Yogi Adityanath : ఏడాదిలో ప్రపంచంలోనే సుందర నగరంగా అయోధ్య-యోగీ ఆదిత్యనాథ్ వెల్లడి
అయోధ్య : యూపీలో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. గతంలో ఓసారి ఐదేళ్ల పాలన పూర్తిచేసుకుని గత ఏడాది ఎన్నికలకు వెళ్లిన బీజేపీ సర్కార్.. మరోసారి ప్రజా మద్దతు సంపాదించి అధికారం చేపట్టింది. రెండోసారి పాలన ఏడాది పూర్తి చేసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.
యూపీ సీఎంగా ఆరేళ్ల పాలన పూర్తి చేసుకున్న యోగీ ఆదిత్యనాథ్.. నిన్న అయోధ్యకు వెళ్లి రామ్ లల్లాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయోధ్యలోని ఆయన డ్రీమ్ ప్రాజెక్టులు రామ్ పథ్, థర్మ్ పథ్, భక్తి పథ్ ల పురోగతిని సమీక్షించారు. అలాగే రామ జన్మభూమిని జాతీయ రహదారితో కలిపే ప్రాజెక్టు పనుల్ని కూడా యోగీ సమీక్షించారు. ఒక్క అయోధ్యలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చేపడుతున్న రూ.32000 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నట్లు యోగీ వెల్లడించారు.

ఏడాదిలోగా అయోధ్యలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, అయోధ్య రామాలయం ప్రారంభ నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రపంచంలోనే సుందరమైన నగరంగా అయోధ్యను తీర్చిదిద్దుతామని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. అలాగే రామాలయం పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, ఇవి సకాలంలో పూర్తవుతాయని వెల్లడించారు. ఇప్పటికే వచ్చే ఏడాది జనవరిలో రామాలయం ప్రారంభించబోతున్నట్లు కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో యోగీ సర్కార్ ఈ ప్రాజెక్టుల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications