యూపీలో భారీ ఎత్తున "హర్ ఘర్ తిరంగా"-దేశ విభజన వ్యతిరేక ర్యాలీలు- యోగీ ఆదేశాలతో..
భారత స్వాతంత్ర దిన వేడుకలు దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఘనంగా నిర్వహించేందుకు యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఘర్ ఘర్ తిరంగా (ఇంటింటికీ జెండా ) ప్రచారాన్ని సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రారంభించారు. యూపీలోని అన్ని జిల్లాల్లో సాగే ఈ ప్రచారం ద్వారా జాతీయ జెండాపై ప్రజలకు అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆదివారం గోరఖ్ నాధ్ ఆలయం వద్ద హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఆజాదీకి అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజలు కూడా ఇందులో భారీ ఎత్తున పాల్గొనాలని సీఎం యోగీ కోరారు. 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేపట్టిన ఈ ప్రచారంలో భాగంగా జెండాతో సెల్ఫీ దిగాలని ప్రతీ ఒక్కరినీ ముఖ్యమంత్రి కోరారు.

మూడు రోజుల పర్యటన కోసం గోరఖ్ నాథ్ ఆలయానికి వచ్చిన సీఎం యోగీ ఆదిత్యనాథ్.. ఈ మూడు రోజుల కోసం తన సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్ లను త్రివర్ణాలతో మార్చేశారు. గతేడాది యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ యూపీలో 4.5 కోట్ల జెండాల్ని ఎగరేసి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రికార్డు సృష్టించింది. ఈసారి కూడా అంతకు మించిన స్ధాయిలో ఇళ్లు, ఆఫీసులు, ఇతర భవనాలపై జెండాలు ఎగరేయాలని ప్రభుత్వం సూచిస్తోంది.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా యూపీలో చేపడుతున్న హర్ ఘర్ తిరంగా, మేరీ మట్టీ-మేరీ దేశ్ కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్ల కోసం నిన్న ఆదివారం కూడా రాష్ట్రంలో ప్రాధమిక, మాధ్యమిక స్కూళ్లను తెరిచారు. అలాగే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ దేశ విభజన దినం సందర్భంగా మౌన ర్యాలీలు నిర్వహించారు. దేశ విభజన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన వారికి యూపీలో నివాళులు కూడా అర్పించారు.












Click it and Unblock the Notifications