వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు తొలిదశ పోలింగ్: బీజేపీకి నోట్ల రద్దు లాభిస్తుందా?

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలోని 403 స్థానాలకు తొలిదశలో 73 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరుగనున్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలోని 403 స్థానాలకు తొలిదశలో 73 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరుగనున్నది. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం గల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బాలీవుడ్‌ సినిమాను తలపిస్తుంటాయి. లోక్‌సభకు ఉత్తరప్రదేశ్ నుంచి 80 నియోజకవర్గాలు ఉండటంతో దేశ ప్రజలందరి ద్రుష్టి ఈ రాష్ట్రంపైనే ఉంది.

2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి గెలుచుకున్న సీట్లలో 25 శాతం ఉత్తరప్రదేశ్ స్థానాలే. 2019 సార్వత్రిక ఎన్నికలకు ప్రీ ఫైనల్‌గా భావించే ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ భారీగానే ఆశలు పెట్టుకున్నాయి.

దీనికి తోడు వచ్చే జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగనుండటంతో పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. ఈ ఏడాది రాష్ట్రపతి ఎన్నికలు కూడా జరుగుతుండడంతో యూపీ ఎన్నికల ఫలితాలు అత్యంత కీలకం అయ్యాయి. 2007 నుంచి యూపీ ఓటర్లు హంగ్‌ అసెంబ్లీ కాకుండా విస్పష్ట తీర్పు ఇస్తున్నారు.

ఓటరు నాడి ఇలా..

ఓటరు నాడి ఇలా..

ఈ సారి ఓటరు మొగ్గు ఎటువైపు అన్న విషయం తెలియడం లేదు. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని బిజెపి ప్రగతి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిపోతానని హామీనిస్తున్నది. 14 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కమలనాథులు ఎలాగైనా ఈసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విజయం సాధించాలని పట్టుదలగా వ్యూహరచనతో ముందుకు సాగుతున్నారు. కానీ బీజేపీ ఇంతకుముందు హర్యానా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ముందుకు వెళుతుండటం కమలనాథులకు క్లిష్టమైన సమస్యగానే మిగిలి ఉంది. కేంద్ర మంత్రి మేనకాగాంధీ తనయుడు వరుణ్ గాంధీ, గోరఖ్ పూర్ ఎంపి యోగి ఆదిత్యానాథ్, వినయ్ కతియార్ వంటి వారు సీఎం అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థుల ప్రకటనతో విభేదాలను కల్పించొద్దన్న భయంతోనే బిజెపి అందుకు వెనుకాడుతూ కేవలం ప్రగతి సాధన, ప్రధాని మోదీ ఆధ్వర్యంలోనే ఎన్నికల సమరానికి సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జాతవేతర దళితులు, యాదవేతర ఓబీసీలను, అగ్రవర్ణాలను కలుపుకుని విజయం సాధన దిశగా ముందుకు వెళుతున్నది.

దానివల్ల బిజెపిలో అసమ్మతి

దానివల్ల బిజెపిలో అసమ్మతి

403 స్థానాల పరిధిలో 150 స్థానాల్లో సమర్థులైన నాయకులు లేని బీజేపీ.. ఇతర పార్టీల నుంచి వచ్చిన 50 మంది నేతలకు టిక్కెట్లిచ్చింది బిజెపి. అయితే రిజర్వేషన్లు అవసరం లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సిద్ధాంత కర్త మన్మోహన్ వైద్య చేసిన రిజర్వేషన్ వ్యతిరేక వ్యాఖ్యలు బిజెపికి దళితుల ఓట్లను దూరం చేశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లను సమీక్షించాలని చేసిన వ్యాఖ్య బిజెపి పరాజయానికి దారి తీసింది. దీనికి తోడు ముస్లింల్లోని ట్రిపుల్ తలాఖ్ అంశాన్ని వివాదాస్పదం చేసిన బిజెపి నాయకత్వం.. ఎన్నికల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నది. విమర్శలను తప్పించుకునేందుకు మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమంటూ మిగతా సామాజిక వర్గాల్లోని మహిళల మనస్సులు గెలుచుకునే వ్యూహాన్ని రచించింది. చట్టానికి అనుగుణంగా రామ మందిరం నిర్మిస్తామని ఇచ్చిన హామీని ఏ ఒక్కరూ విశ్వసించడం లేదు.

నోట్ల రద్దు ప్రతికూలమేనా...

నోట్ల రద్దు ప్రతికూలమేనా...

అవినీతి నిర్మూలన, నల్లధనాన్ని వెలికి తీసే పేరుతో పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలందరినీ నరక యాతనకు గురి చేసింది. అకస్మాత్‌గా తీసుకున్న నిర్ణయంతో ఇతర రాష్ట్రాలతోపాటు ఉత్తర్ ప్రదేశ్ వాసులు చిల్లర నగదు కోసం బ్యాంకుల ముందు బారులు తీరారు. వివాహాది శుభకార్యాలు చేసేందుకు అష్టకష్టాల పాలవ్వాల్సి వచ్చింది. పలువురు హఠాన్మరణం పాలయ్యారు. వారి గురించి కనీసం సానుభూతి కూడా చూపని బిజెపి.. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయానికి ప్రజామోదం ఉన్నదని నమ్మ బలుకుతోంది. బ్యాంకుల ముందు బారులు తీరి మరణించిన వారి కుటుంబాలకు అఖిలేశ్ యాదవ్ సర్కార్ రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకున్నామన్న సంకేతాలిచ్చింది.

కులాలవారీ సమీకరణలు...

కులాలవారీ సమీకరణలు...

2014 లోక్ సభ ఎన్నికల్లో 34.3 మిలియన్ల మంది ఓట్లతో 73 స్థానాలు గెలుచుకున్న బిజెపి.. ఎస్పీ, బీఎస్పీలను పక్కకు నెట్టేసింది. కానీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ అమలు కాకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత క్రమంగా పెరుగుతున్నది. దీన్ని అధిగమించేందుకు కులాల వారీగా సమీకరణాలకు తెరతీసిన కమలనాథులు కుశ్వాహ్‌లు, కుర్మీలు తదితర ఓబీసీలను చేరదీయడంలో ఒకింత కొంత మెరుగుదల సాధించింది. జాతవేతర దళితులను తమ అక్కున చేర్చుకునేందుకు బిజెపి చేసిన ప్రయత్నం ఫలించే అవకాశాలు లేవు. సంఘ్ పరివార్ సైతం బిజెపితో కలిసి ఎన్నికల్లో విజయ సాదన కోసం ప్రచారం మొదలు అన్నింటా జోక్యం చేసుకుంటున్నది.

హిందూ ఓట్లపై ఆశలు..

హిందూ ఓట్లపై ఆశలు..

హిందువుల్లోని వివిధ సామాజిక వర్గాలను బుజ్జగించేందుకు పూనుకుంటున్నది. ప్రత్యేకించి రామ మందిర నిర్మాణం డిమాండ్ ముందుకు తెచ్చిన బిజెపి.. లవ్ జిహాద్, గో రక్షక్ నినాదాలను ముందుకు తెచ్చింది. ముస్లింలపై ఉగ్రవాద ముద్ర వేయడానికి విఫలయత్నం చేసింది. గో రక్షక్ పేరుతో గుజరాత్ రాష్ట్రంలో ఉన్నలో దళితులపై విచక్షణా రహితంగా దాడులు చేసిన సంగతంతా దశమంతా స్వయంగా వీక్షించింది. కైరానాలో గతంలో భారీ స్థాయిలో హిందువుల వలస వెళడానికి అప్పటి పాలకులే కారణమని పరోక్షంగా ముస్లింలపై దాడికి యత్నించింది. గోమాంసం తిన్నారన్న సాకుతో దాద్రిలో ఒక ముస్లింపై దాడిచేసి తీవ్రంగా కొట్టడంతో మరణించిన ఘటన దేశమంతటికి తెలిసిన సంగతే. హుకుంసింగ్, సంగీత్ సోమ్, సురేశ్ రాణా, సంజీవ్ బాల్యన్, యోగి ఆదిత్యానాథ్, రామచంద్ర కథేరియా వంటి బిజెపి నేతలు హిందువుల ఓట్ల సంఘటితం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

అచ్చే దిన్ ఎప్పుడో మరి...

అచ్చే దిన్ ఎప్పుడో మరి...

రెండున్నరేళ్ల క్రితం లోక్ సభ ఎన్నికల్లో తమకు అధికారం ఇస్తే అచ్చేదిన్ తెస్తానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ హామీకి విషమ పరీక్ష కానున్నది. ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పన, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తానని హామీలు గుప్పించింది. రుణాల మాఫీ, తేలిక ధరలకు రసాయన ఎరువుల విక్రయాలు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాలను తమ ప్రచారాస్త్రాలుగా ఉపయోగించింది.

ఆశల పల్లకిలో మాయావతి

ఆశల పల్లకిలో మాయావతి

బీఎస్పీ అధినేత మాయావతి డార్క్ హార్స్‌గా ఉంటూ వ్యూహ రచన చేస్తూ ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించాలని ప్రతిపాదించి ప్రజాభిమానానికి దూరమైన మాయావతి ఈ దఫా ఆ ఊసే లేకుండా ముందుకు సాగుతున్నారు. 206 స్థానాల నుంచి 2012 ఎన్నికల్ల్లో 80 స్థానాలకు మాత్రమే పరిమితమైన మాయావతి 2014 లోక్ సభ ఎన్నికల్లో 15.9 మిలియన్ల ఓట్లు పొందినా ఒక్క సీటు కూడా గెలుపొందలేక పోయింది. వ్యూహాత్మకంగా 97 మంది ముస్లిం అభ్యర్థులను బరిలో నిలిపిన బీఎస్పీ అధినేత్రి.. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే రాష్ట్రంలో అత్యధిక జనాభా గల 143 నియోజకవర్గాలను చుట్టేసి వచ్చారు. ఏడాది ముందే క్షేత్రస్థాయి అధ్యయనం తర్వాత అభ్యర్థుల ప్రకటనతోపాటు ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి ఉండేలా చూసుకోవడంతోపాటు బీఎస్పీ విజయం దిశగా ముందుకు సాగుతున్నది.

అది బిఎస్పీకి అనుకూలమా..

అది బిఎస్పీకి అనుకూలమా..

ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి వైద్య చేసిన రిజర్వేషన్ల వ్యతిరేక వ్యాఖ్యలు తమకు అనుకూలంగా ఉంటుందని బిఎస్పీ అంచనా వేస్తున్నది. మనువాద విదానానికి వ్యతిరేకంగా ఆచితూచి ఆమె స్పందిస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ.. రిజర్వేషన్ల వ్యతిరేక వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ముస్లిం ఓట్లను గుండుగుత్తగా పొందాలని వ్యూహాలు రూపొందిస్తోంది. తొలి రెండు దశల్లోనే 50 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించిన బిఎస్పీకి పశ్చిమ ప్రాంతంలో ముస్లింల ఓట్లు కీలకం కానున్నాయి. ముజఫర్ నగర్ దాడుల్లో బాధితులకు నష్ట పరిహారం అందజేయడం ద్వారా వారి మనస్సులు చూరగొనేందుకు ప్రయత్నించింది.

బిఎస్పీకి జమా మసీద్ ఇమాం అండ

బిఎస్పీకి జమా మసీద్ ఇమాం అండ

బీఎస్పీకి ఓటేయాలని ముస్లింలను ఢిల్లీ జమా మసీద్ ఇమాం బుఖారీ పిలుపునివ్వడం ఆ పార్టీకి మేలు చేసేదే. శాంతిభద్రతల పరిరక్షణలో అఖిలేశ్ సర్కార్ విఫలమైందన్న విమర్శలు మాయావతి పాలనకు గుర్తుకు తెచ్చేవే. కాకపోతే బతికి ఉండగానే మాయావతి తనతోపాటు తన రాజకీయ గురువు కాన్షీరాం, బీఎస్పీ ఎన్నికల గుర్తు ఏనుగు విగ్రహాలు ఏర్పాటు చేయడం ప్రజల్లో వ్యతిరేకతను తెచ్చి పెట్టాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బాదౌన్ లో దాడులు, భీఫ్‌పై నిషేధం విధించాలన్న కమలనాథుల డిమాండ్లు.. ముస్లింలను వారికి మరింత దూరంచేస్తాయి.

 అఖిలేష్ నినాదం అదే..

అఖిలేష్ నినాదం అదే..

నోట్ల రద్దు మొదలు ప్రతి అంశంలోనూ ప్రధాని నరేంద్రమోడీతో యూపీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ధీటుగానే సమాధానం చెప్తూ వచ్చారు. దేశంలోనే అతిపెద్ద జనాభా గల యూపీలో నోట్ల రద్దు నిర్ణయం వల్ల తలెత్తిన నగదు కొరతతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగదు లభించక రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర పొందలేకపోయారు. తదుపరి పంటల సాగుకు చేయడానికి వారు పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. దీనికి తోడు బ్యాంకుల ముందు బారులు తీరి మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వడం ఎస్పీకి అనుకూల అంశమే. అయితే ముజఫర్ నగర్ దాడుల్లో బాధితులకు సరైన న్యాయం చేయలేదన్న విమర్శ మాత్రం అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వానికే సొంతం. దీనివల్ల ముస్లింల్లో చాలా మంది ఎస్పీకి దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో తెలివిగా వ్యవహరించిన అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ముస్లింలు, ఇతర అగ్ర కులాల్లో కొన్ని సామాజిక వర్గాల ఓట్లలో భాగస్వామ్యం పొందేందుకు వీలయ్యింది.

వారే లక్ష్యంగా హామీలు

వారే లక్ష్యంగా హామీలు

దీనికి తోడు బాలికలకు ఉచిత విద్య, లాప్ టాప్ కంప్యూటర్లు, తదితర ఉచిత హామీలతో గ్రామీణులు, మహిళల మనస్సులు చూరగొనేందుకు అఖిలేశ్ సానుకూల ప్రయత్నమే చేశారు. అయితే పార్టీలో ఆధిపత్య పోరులో తండ్రి ములాయంపై విజయం సాధించిన అఖిలేశ్.. తండ్రిని పూర్తిగా గెలుచుకోలేకపోయారు. గత లోక్ సభ ఎన్నికల్లో 18 మిలియన్ల ఓట్లు పొందినా కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే విజయం సాధించడంతో ఎస్పీ వెనుకపట్టు పట్టినా పలు ప్రగతి దాయక పథకాలతో రాష్ట్ర ప్రజల మనస్సులు చూరగొన్నది. గత ఐదేళ్లుగా తండ్రి, బాబాయిల కనుసన్నల్లో పాలన సాగించాడన్న పేరు అఖిలేశ్ యాదవ్ కు ఉంది. కానీ ప్రస్తుతం పార్టీ అధినేతగానూ విధాన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ గల నేతగా రాష్ట్ర ప్రజలు ప్రత్యేకించి యువతకు ఆరాధ్య నాయకుడి అవతారం ఎత్తారు.

మోడీ ప్రశ్నలకు అఖిలేష్ సమాధానాలు

మోడీ ప్రశ్నలకు అఖిలేష్ సమాధానాలు

ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం చెప్పడంలో అఖిలేశ్ వెనుకడుగు వేయడం లేదు. యువకుడిగా జనంలో ఆయనకు గల ఆకర్షణను దెబ్బ తీసేందుకు భావోద్వేగ పూరిత విమర్శలు చేస్తున్న ప్రధాని మోదీకి అదే స్థాయిలో జవాబిస్తున్నారు. స్కాం అంటే సమాజ్ వాదీ.. అఖిలేశ్.. కాంగ్రెస్, మాయ.. అన్న ప్రధాని మోదీ వ్యాఖ్యకు ఎ అంటే అమిత్ షా, ఎం అంటే మోదీ అని ఎద్దేవా చేశారు. మూడుసార్లు మాయాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజెపి.. స్కామ్ లో మాయా పేరు ఎలా చేర్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారం చేయడం ఆ రెండు పార్టీలకు కలిసి వచ్చే అంశమే. ఇక ఉత్తర ప్రదేశ్ లోని పశ్చిమ ప్రాంతంలో బలంగా ఉన్న ఆర్ఎల్డీ వంటి పార్టీల పోటీ ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితం.

English summary
The seven-phase Uttar Pradesh Assembly elections is beginning on February 11 when 73 constituencies of 403 assembly will vote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X