విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాకపల్లి అత్యాచారాలు:సత్వర న్యాయం జరగాల్సిన చోట 15 ఏళ్లుగా విచారణ, బాధితులు ఏమంటున్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వాకపల్లి

అత్యాచార కేసుల్లో సత్వర న్యాయం జరగాలనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.

సత్వర న్యాయం అనే మాట వినిపించిన ప్రతీసారి 15 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న వాకపల్లి అత్యాచార బాధిత గిరిజన మహిళలు గుర్తుకొస్తారు.

11 మంది గిరిజన మహిళలను 13 మంది పోలీసులు అత్యాచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కేసు ప్రస్తుతం విశాఖపట్నంలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు విచారణలో ఉంది.

వాకపల్లి

'బాధితులు బయటకు రాలేకపోతున్నా’

గ్రేహౌండ్స్ బలగాలు తమపై అత్యాచారం చేశారంటున్న ఈ బాధిత మహిళలు..ఊరు దాటి బయటికి రాలేని పరిస్థితిని ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు.

గ్రామం దాటి ఆసుపత్రులకో, సంతలకో బాధితులు వస్తే బాధితులతో పాటు గ్రామస్థులు సైతం పోలీసుల వేధింపులకు గురవుతున్నారని ఏపీ ఆదివాసీ జేఏసీ కన్వీనర్ రామారావు దొర బీబీసీతో అన్నారు.

“వాకపల్లి ఘటనలో సీబీఐతో విచారణ జరిపించి నిజాలు రాబట్టాలని ఆదివాసీ, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తూనే ఉన్నాయి. వాకపల్లిలో అత్యాచారమే జరగలేదని మొదటి నుంచి బుకాయిస్తున్న పోలీసులు... ఘటన జరిగి 15 ఏళ్లు అయినా ఆ గ్రామంపై ఇంత నిర్బంధం దేనికి ప్రయోగిస్తున్నట్లు? వాకపల్లి కేసును ఎక్కడో ఒకచోట తప్పుదారి పట్టించి నిందితులను కాపాడే ప్రయత్నంగా కనబడుతోంది” అని రామారావు దొర అన్నారు.

రామారావు దొర వాకపల్లి అత్యాచార బాధితుల కోసం పని చేసిన ఆదివాసీ ఐక్యపోరాట సమితి కన్వీనర్‌గా కూడా వ్యవహరించారు.

“ఘటన జరిగిన నాటినుంచి ఆదివాసి ఐక్య పోరాట సమితి, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టగా, సంఘటన జరిగిన రోజు వాకపల్లికి గ్రేహౌండ్స్‌ దళాలు వెళ్ళినట్లు ఒప్పుకున్నాయి. కానీ తగిన సమయంలో తగిన విధంగా వైద్య పరీక్షలు నిర్వహించకుండా, ఈ కేసును అణగదొక్కడానికి వైద్య నివేదికల చుట్టూ తిప్పడానికి చూశారు. ఆ నివేదికను అడ్డుపెట్టుకుని అప్పటి రాష్ట్ర హోం శాఖ అత్యాచారం జరగలేదని చెప్పింది. కేసును సీబీఐతో విచారణ జరిపించాలని బాధితులు, ప్రజా సంఘాలు కోరాయి. అప్పటి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి నాగిరెడ్డి ఈ వాంగ్మూలాలను రికార్డు చేసినా, ఆ డిమాండ్‌ను పట్టించుకోలేదు” అని రామారావు చెప్పారు.

వాకపల్లి

వాకపల్లిలో అసలేం జరిగింది?

2007 ఆగస్టు 20వ తేదీన వాకపల్లిలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని జి. మాడుగుల మండలం, సుర్మతి పంచాయితీ వాకపల్లి గ్రామం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. (వాకపల్లి ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది)

ఈ గ్రామంలో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారంతో 2007 ఆగస్టు 20, తెల్లవారుజామున గ్రేహౌండ్స్‌ పోలీసులు వాకపల్లి గ్రామాన్ని చుట్టుముట్టారు.

మగవాళ్లు తెల్లవారుజూమునే పొలం పనులకు వెళ్లిపోవడంతో...ఇళ్లలో మహిళలు, పిల్లలే ఉన్నారు. మగవాళ్లు ఇళ్లలో లేరని చెప్పినా కూడా పోలీసులు సోదాలు పేరుతో ఇళ్ల లోపలకు చొచ్చుకుని వచ్చారని...పోలీసులకు తమకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుందని బాధిత మహిళలు చెప్పారు.

సోదాల పేరుతో 21 మంది పోలీసులు తమపై తమపై అత్యాచారం జరిపారని 11 మంది ఆదివాసీ మహిళలు ఆరోపించారు.

11 మంది గిరిజన స్త్రీలపై పోలీసులు అత్యాచారం జరిపారన్న ఆరోపణలతో వాకపల్లితో పాటు మన్యం మొత్తం అట్టుడికిపోయింది. బాధిత మహిళలకు పలు ప్రజా సంఘాలు, మహిళ సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి.

వాకపల్లి

ఆ తర్వాత ఏం జరిగింది?

పోలీసులు అత్యాచారం చేశారంటూ బాధితులు ఆరోపిస్తూ 2007 ఆగస్టు 20 సాయంత్రం 5.30 గంటలకు పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో 11 మంది మహిళలు ఫిర్యాదు చేశారు.

సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు పాడేరు పోలీసులు ఐపీసీ సెక్షన్ 372(2), సెక్షన్ 3(2) ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. మావోయిస్టులు కూబింగ్ నిలిపివేసేందుకు ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారంటూ అప్పటీ డీజీపీ బాసిత్ అత్యాచారం ఆరోపణలను ఖండించారు.

అదే రోజు రాత్రి 10 గంటలకు బాధిత మహిళలను అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించి, వైద్య పరీక్షలు జరిపారు.

మర్నాడు వాకపల్లి ఘటనకు బాధ్యులైన గ్రేహౌండ్స్ పోలీసులను అరెస్ట్ చేయాలని కలెక్టరేట్ వద్ద అప్పటి చింతపల్లి ఎమ్మెల్యే దేముడు, పాడేరు ఎమ్మెల్యే రాజారావు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.

ఆగస్టు 22న అప్పటి జిల్లా ఎస్పీ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ 21 మంది గ్రేహౌండ్స్ పొలీసులను పిలిపించి, విడివిడిగా విచారించానని, వాకపల్లిలో అత్యాచార ఘటనే జరగలేదని ప్రకటించారు.

ఆగస్టు 24న బాధిత మహిళలు హైదరాబాద్‌ వెళ్లి స్వతంత్ర నేర పరిశోధన సంస్థతో విచారణ జరిపించాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

ఆగస్టు 29న మహిళలపై అత్యాచారం జరిగినట్టు ఆధారాలు లభించలేదని ఫోరెన్సిక్ నివేదికలో వచ్చింది. ఆగస్టు 30న వాకపల్లి ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ జిల్లా ఎస్పీకి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.

వాకపల్లి

సెప్టెంబర్ 6న ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ నాగిరెడ్డిని విచారణ అధికారిగా నియమించింది. వాకపల్లి గ్రామంలో బాధితులు, గ్రామస్థులతో పాటు విశాఖలో నిందితులైన పోలీసులను విచారించారు.

సెప్టెంబర్ 12న నాగిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించారు.

సెప్టెంబర్ 22న వాకపల్లి కేసులో ప్రగతి లేకపోవడంతో పాడేరులో బాధితులు అంబేద్కర్ సెంటర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ తరువాత వాకపల్లి వెళ్లిన గ్రేహౌండ్స్ పోలీసుల పేర్లు బయటకు వచ్చాయి.

అక్టోబర్ 28న హైకోర్టు ఆదేశాలతో చోడవరంలో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు 11 మంది ఆదివాసి మహిళల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.

21 మంది పోలీసులు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటుండగా, 8 మంది ఘటన జరిగిన సమయంలో విధుల్లో లేరని హైకోర్టు వారికి కేసు నుంచి మినహాయింపు ఇచ్చింది.

2007 నుంచి 2012 వరకు హైకోర్టులో విచారణ జరిగిన ఈ కేసు ఆ తర్వాత సుప్రీం కోర్టుకు చేరింది. నిందితులుగా ఉన్న 13 మంది పోలీసులు తమకు ఈ కేసు నుంచి విముక్తి కల్పించాలంటూ సుప్రీంలో 2017లో లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.

పోలీసుల పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు వాకపల్లి కేసుపై పదేళ్లుగా విచారణ జరగకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమపై కేసు కొట్టాయాలని నిందితులైన 13 మంది పోలీసులు చేసుకున్న దరఖాస్తును కోర్టు తోసిపుచ్చింది.

అలాగే ఈ విచారణ కోసం ప్రత్యేక కోర్టుని ఏర్పాటు చేసి, 6 నెలలలో విచారణ పూర్తి చేయాలంటూ ఆదేశించింది. అయినా కూడా వాకపల్లి కేసు ఇప్పటికీ విశాఖపట్నంలోని ఎస్పీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది.

ప్రస్తుతానికి బాధిత మహిళల్లో ఒకరు పాము కాటుతో, మరొకరు ఆరోగ్య సమస్యలతో మరణించగా...మిగతా 9 మంది న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు.

వాకపల్లి

'జాప్యంతో బాధితులు వేదన అనుభవిస్తున్నారు’

ఏ మహిళ కూడా ఎవరి కోసమో తమని పోలీసులు అత్యాచారం చేశారంటూ అబద్దాలు చెప్పదని, బాధిత మహిళలను పోలీసు భార్యలంటూ ఇతర గ్రామల వాళ్లు హేళన చేసేవారని పాడేరు మాజీ ఎమ్మెల్యే రాజారావు అన్నారు. ఆయన 2002 ఎన్నికల్లో బీఎస్పీ తరపున పాడేరుకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కొందు తెగలో కట్టుబాట్లు ఎక్కువనీ, ఈ కట్టుబాట్ల పేరుతో ఈ సంఘటన తర్వాత బాధిత మహిళలను వారి భర్తలు కుటుంబం నుంచి దూరం పెట్టిన సంగతి వాస్తవమని, ఇలాంటి ఎన్నో బాధలను బాధిత మహిళలు అనుభవించారని రాజారావు బీబీసీతో అన్నారు.

“అత్యాచార సంఘటనపై విచారణ జరిగినప్పుడు అక్కడే ఉన్న డానియల్ అనే 8 ఏళ్ల గిరిజన బాలుడు ఆరోజు ఏం జరిగిందో, పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారో వివరించారు. అప్పటి వరకు గిరిజన మహిళలు అవాస్తవాలు చెప్తున్నారంటూ పోలీసులు ఆరోపించారు. డానియల్ చెప్పిన వాస్తవాల తర్వాత ఇక్కడ సంఘటన జరిగిందనే విషయం అందరికి అర్థమైంది. విచారణకు వచ్చిన అధికారి నాగిరెడ్డి కూడా ఇక్కడ అత్యాచారం జరిగింది, కానీ ఇంకా లోతుగా విచారించాల్సి ఉందని చెప్పారు” అని రాజారావు చెప్పారు.

15 ఏళ్లు గడిచినా బాధితులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. ఇటువంటి కేసుల్లో ఇంత జాప్యం తగదని రాజారావు చెప్పారు.

వాకపల్లి

'అప్పుడు నేను ఆరో తరగతి’

వాకపల్లి బాధిత కుటుంబాలతో బీబీసీ మాట్లాడేందుకు ప్రయత్నించింది. కోర్టులో కేసు వాదనల దశకు వచ్చిందని పెద్దలు చెప్పారని, న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని బాధితులు అన్నారు.

“సంఘటన జరిగిన తర్వాత నా భర్త నన్ను దూరం పెట్టాడు. పోలీసులు, ప్రభుత్వం తరపున కొందరు మనుషులు మా ఇళ్లకు వచ్చి డబ్బులు, పశువులు, పథకాలు ఇస్తామని చెప్పారు. మాకు అవేమి వద్దని కోర్టు ద్వారా న్యాయం జరిగితే చాలని వాళ్లకి చెప్పాం. పెద్దలు మాట్లాడి మళ్లీ నన్ను, నా భర్తని కలిపారు” అని పదేళ్ల లోపు ఇద్దరు పిల్లలున్న ఓ బాధితురాలు చెప్పారు.

“వాకపల్లి సంఘటన జరిగినప్పుడు నేను ఆరో తరగతి చదువుతున్నాను.. సంఘటన జరిగిన తర్వాత కొంతకాలానికి అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. నాన్న అంతకు ముందే అమ్మను దూరం పెట్టాడు. ఊర్లోనే అమ్మ ద్వారా వచ్చిన ఇంట్లో ఉంటున్నాను. త్వరలోనే కోర్టు తీర్పు వస్తుందని ఊర్లో పెద్దలు చెప్తున్నారు” అని మరో బాధిత మహిళ కుమారుడు బీబీసీతో చెప్పారు.

వాకపల్లి కేసు విషయంలో మాట్లాడేందుకు అప్పడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పని చేసిన పోలీసులు కానీ, ప్రస్తుతం పని చేస్తున్న పోలీసులు కానీ ముందుకు రాలేదు.

వాకపల్లి

'బాధితులకు అండగా ఉంటే కేసులా?’

2020 నవంబర్‌లో విశాఖ, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రజా, పౌర, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులపై ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువమంది వాకపల్లి బాధితులకు అండగా ఉంటున్న వివిధ సంఘాలకు చెందినవారే.

వాకపల్లి బాధిత మహిళలకు న్యాయం జరగాలని ఉద్యమాలు చేస్తున్న వారిపై నిర్బంధం దేనికి ప్రయోగిస్తున్నట్లని మానవ హక్కుల వేదిక ఏపీ, తెలంగాణా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు వీఎస్ కృష్ణ బీబీసీతో అన్నారు.

2020 నవంబర్‌లో వీఎస్ కృష్ణతో పాటు పలు ప్రజాసంఘాల నాయకులపై పాడేరు ఏజెన్సీ ముంచింగిపుట్టు, గుంటూరు,పిడుగురాళ్ల టౌన్ పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.

“మానవ హక్కుల వేదిక ఆదివాసీలతో కలిసి వాకపల్లి బాధితులకు న్యాయం చేయాలని ఆందోళనలు చేస్తున్నాం. మానవ హక్కుల రక్షణ కోసం మేం ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. న్యాయ విచారణలో జాప్యం జరిగినా బాధితులకు ఇప్పటికైనా న్యాయం జరగాలని ఆశిస్తున్నాం" అని కృష్ణ అన్నారు.

'ఈ నెలలోనే వాదనలు మొదలు’

సత్వర న్యాయం జరగాల్సిన ఈ కేసులో ఇంత జాప్యం బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆదివాసీ సంఘాలు అంటున్నాయి. న్యాయం కోసం 15 ఏళ్లు ఎదురు చూస్తూ...మహిళలు చేస్తున్న ఈ న్యాయ పోరాటం స్ఫూర్తి నింపుతుందని అన్నారు.

అయితే ఇంతకాలానికైనా ఈ కేసు విచారణ ముగిసి వాదనల దశకు చేరుకోవడంతో త్వరలోనే బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆదివాసీ సంఘాలు నాయకులు చెప్పారు.

“నిందితులుగా ఉన్న గ్రేహౌండ్స్ పోలీసులు, బాధితులైన గిరిజన మహిళలతో పాటు మరో 38 మంది సాక్షులనూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఎస్పీ, ఎస్టీ ప్రత్యేక న్యాయ స్థానం వారిని విచారించింది. 2017 నుంచి విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో కోవిడ్ సమయంలో మినహా దాదాపు నెలకు రెండుసార్లు ఈ కేసు విచారణ జరిగింది. బాగా జాప్యం జరిగిన కేసుల్లో ఇది ఒకటి. ఈ నెల 19న వాదనలు మొదలవుతాయి” అని విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయవాది ఒకరు బీబీసీకి తెలిపారు.

'వాకపల్లి బాధితులకు న్యాయం జరిగితేనే...’

జాప్యం జరిగినా వాకపల్లి బాధితులకు న్యాయం జరిగాలని మాజీ మంత్రి మణికుమారి అన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా దిశ వంటి చట్టం తెచ్చినా ఇంకా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహించాల్సి ఉందని, వాకపల్లి బాధితులకు న్యాయం జరిగితేనే మరింత మంది బాధితులు ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆమె అన్నారు.

''సుదీర్ఘ పోరాటం చేసిన వాళ్లకే దక్కని న్యాయం తమకెక్కడ దక్కుతుందని బాధితులు బయటకు రారు. ఇదొక ప్రమాదం’’ అని మణి కుమారి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Vakapalli rapes: 15 years of investigation where swift justice should be done, what do the victims say?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X