Vande Bharat Express: వందే భారత్ బ్రేక్స్ ఫెయిల్- అయినా 2 రాష్ట్రాల్లో 463 కి.మీ ప్రయాణం..!
భారత్ లో ప్రీమియర్ రైలుగా పేరు తెచ్చుకున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైలు తాజాగా మరో సంచలనం రేపింది. గత నెలలో ఓ బ్రేక్స్ ఫెయిలైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను పట్టాలపై నడిపేందుకు అధికారులు అనుమతించారు. దీంతో రైలు బయలుదేరింది. మధ్యలో లోకో పైలట్ సమస్యను గుర్తించి అధికారులకు నివేదించినా పట్టించుకోలేదు. దీంతో సదరు రైలు రెండు రాష్ట్రాల గుండా ఏకంగా 463 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలుస్తోంది. చివరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
అక్టోబర్ నెలలో ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్ మధ్య ఓ ఖాళీ వందే భారత్ రైలు అసమర్దమైన బ్రేకింగ్ వ్యవస్థతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో అధికారులు దాన్ని ఏకంగా 463 కిలోమీటర్ల ప్రయాణించేందుకు అనుమతించారన్న అంశం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా బయటపడిన ఈ వ్యవహారం రైల్వేల పనితీరుకు అద్దం పట్టేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ వందే భారత్ రైలు ఇతర ప్యాసింజర్ రైళ్లకు ముప్పు కలిగించే అవకాశం ఉందని తేల్చారు. దాదాపు ఇలాంటి నిర్లక్ష్యం కారణంగానే ఈ నెల 11న అస్సాంలో కోల్ కతా-సైరంగ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడానికి ముందు జరిగిన ఈ ఘటనపై విచారణకు వాయువ్య రైల్వే ఆదేశించింది.

తగినంత బ్రేక్ శక్తి లేకుండా రైలును నడపడం తీవ్రమైన భద్రతా సమస్య అని, ఇది సిబ్బంది, ప్రయాణికుల ప్రాణాల్ని ప్రమాదంలో పడేస్తుందని, అలాగే రైల్వే కార్యకలాపాల భద్రతను ప్రభావితం చేస్తూ ఓ పెద్ద ప్రమాదానికి దారీ తీయవచ్చని రైల్వే జోన్ తెలిపింది. జార్ఖండ్ లోనని హతియా నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీకి ఓ సరకు రవాణా రైలు ద్వారా ఈ వందే భారత్ ఖాళీ ఛైర్ కార్ బోగీని తరలించాల్సి ఉంది. అలాగే ఈ వందే భారత్ బ్రేకింగ్ వ్యవస్థ.. దాన్ని లాగే మరో సరకు రవాణా రైలు బ్రేకింగ్ వ్యవస్థతో లింక్ చేయాల్సి ఉందన్నారు. అయితే రైల్వే సిబ్బంది .. ఈ రెండు వ్యవస్థలు సరిగానే అనుసంధానించినట్లు గుర్తించడంలో విఫలమయ్యారని తెలిసింది. అలాగే రైలు సిబ్బంది నుంచి వచ్చిన హెచ్చరికల్ని సైతం పట్టించుకోలేదన్నారు. దీంతో ఈ వ్యవహారంపై రైల్వే దర్యాప్తుకు ఆదేశించింది.














Click it and Unblock the Notifications
