హైదరాబాద్-బెంగళూరుకు వందే భారత్ రైలు, ప్రధాని మోదీతో తెలంగాణ, కర్ణాటక లీడర్స్ !
బెంగళూరు/హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ ఓ హామీ ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మోదీ పవర్ ఫుల్ స్కెచ్ వేశారు. కర్ణాటక-తెలంగాణలను మోదీ టార్గెట్ చేశారు. బెంగళూరు-హైదరాబాద్ మార్గంలో త్వరలో వందే భారత్ రైలు సంచరిస్తుందని ప్రధాని మోదీ బీజేపీ నాయకులకు హామీ ఇచ్చారని కన్నడ మీడియా అంటోంది.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో పర్యటించడానికి వచ్చిన సమయంలో తెలంగాణకు చెందిన కొంత మంది బీజేపీ నాయకులు ఆయన్ను కలిశారు. ఈ సందర్బంలో బెంగళూరు- హైదరాబాద్ మార్గంలో త్వరలో వందే భారత్ రైలు సంచరిస్తుందని, ముహుర్తం దగ్గరలోనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ, కర్ణాటక బీజేపీ నాయకులకు క్లూ ఇచ్చారని తెలిసింది.

అయితే బెంగళూరు-హైదరాబాద్ వందే భారత్ రైలు ఎప్పుడు ప్రారంభిస్తారు అని కచ్చితమైన తేదీ చెప్పకపోయినా త్వరలోనే ఈ మార్గంలో వందే భారత్ రైలు ప్రారంభిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ, కర్ణాటక బీజేపీ నాయకులకు హామీ ఇచ్చారని ఓ సీనియర్ బీజేపీ నాయకుడు చెప్పారని కన్నడ మీడియా తెలిపింది.
ఆర్-హై- స్పీడ్ రైలు బెంగళూరు నుంచి హైదరాబాద్ లోని కాచీగూడ రైల్వేస్టేషన్ల మధ్య 570 కిలోమీటర్ల దూరం సంచరిస్తుందని గత జనవరి నెలలో దక్షిణ మధ్య రైల్వే శాఖకు చెందిన సీనియర్ అధికారి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు సంచరించే రైళ్లు సుమారు 10 గంటల సమయం తీసుకుంటున్నాయి.

అయితే బెంగళూరు-హైదరాబాద్ మార్గం మధ్యలో వందే భారత్ రైలు కేవలం 4 గంటల సమయం మాత్రమే తీసుకుంటుందని, ఈ మార్గంలో సంచరించే ప్రయాణికులకు 6 గంటల సమయం ఆదా అవుతుందని ఓ అధికారి చెప్పారని కన్నడ మీడియా తెలిపింది. బెంగళూరు-హైదరాబాద్ మార్గంతో పాటు బెంగళూరు-హుబ్బళి మార్గంలో వందే భారత్ రైళ్లు ఒకే రోజు ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిసింది.
ఇప్పటికే కర్ణాటకకు చెందిన కొందరు బీజేపీ నాయకులు వందే భారత్ రైళ్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారని తెలిసింది. రెండు ప్రముఖ ఐటీ కంపెనీలు ఉన్న నగరాలుగా గుర్తింపు పొందిన బెంగళూరు-హైదరాబాద్ మార్గంలో వందే భారత్ రైలును వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటక, తెలంగాణ బీజేపీ నాయకులు మనవి చేశారని ఓ సీనియర్ లీడర్ చెప్పారని కన్నడ మీడియా తెలిపింది.












Click it and Unblock the Notifications