వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీరప్పన్: అటవీ అధికారి తలతో ఫుట్‌బాల్ ఆడడం వంటి అనేక దారుణాలు చేసిన గంధపు చెక్కల స్మగ్లర్‌ను 20 నిమిషాల్లో ఎలా చంపారంటే...

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వీరప్పన్‌

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఫేమస్ కాకముందు, తమిళనాడులో 'జంగల్ పెట్రోల్ పోలీస్' అనే దళం ఉండేది. దీనికి లహీమ్ షహీమ్ గోపాలకృష్ణన్ నేతృత్వం వహించేవారు.

ఆయన చేతులు చాలా బలంగా ఉండటం వల్ల సహచరులంతా 'రాంబో' అని పిలిచేవారు. రాంబో గోపాలకృష్ణన్ ప్రత్యేకత ఏంటంటే... ఆయన కూడా వీరప్పన్ సామాజిక వర్గమైన 'వన్నియార్' కులానికి చెందినవారే.

1993 ఏప్రిల్ 9న, కోలాథ్పూర్ గ్రామంలో ఒక పెద్ద బ్యానర్‌ను వేలాడదీశారు. దానిపై వీరప్పన్ తరఫున రాంబోను ఉద్దేశించి అసభ్యకరమైన తిట్లను రాశారు. అంతేకాకుండా దమ్ముంటే వీరప్పన్‌ను పట్టుకోవాలని రాంబోకు సవాలు విసిరారు.

అదే సమయంలో బయటకి వెళ్లి, వీరప్పన్‌ను పట్టుకోవాలని రాంబో నిర్ణయం తీసుకున్నారు. ఆయన పలార్ వంతెన వద్దకు రాగానే జీప్ పాడైంది. దాన్ని అక్కడే వదిలేసి, వంతెన సమీపంలోని పోలీస్ స్టేషన్ నుంచి రెండు బస్సులు తీసుకొని వారు బయల్దేరారు. 15 మంది ఇన్ఫార్మర్లు, నలుగురు పోలీసులు, ఇద్దరు అటవీశాఖ సిబ్బందితో రాంబో మొదటి బస్సు ఎక్కారు.

వీరప్పన్ భయం

వెనకే వస్తోన్న రెండో బస్‌లో తమిళనాడు పోలీస్ ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ మరో ఆరుగురు సహచరులతో ఉన్నారు. వేగంగా వస్తోన్న బస్సు శబ్ధం వీరప్పన్ బృందానికి వినబడగానే... వారంతా జీప్‌లో వచ్చేది రాంబోనేనని భయపడ్డారు.

వీరప్పన్‌

బస్సు ముందు సీట్లో రాంబో కూర్చున్నట్లు దూరం నుంచే గమనించిన వీరప్పన్ గట్టిగా విజిల్ వేశారు. బస్సు నిర్దేశిత ప్రదేశానికి చేరుకోగానే, వీరప్పన్ బృందంలోని సైమన్ అనే వ్యక్తి, 12 బోల్ట్ కారు బ్యాటరీని ల్యాండ్‌మైన్‌కు కనెక్ట్ చేశారు.

దీంతో భారీ పేలుడు సంభవించింది. 3000 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రత ఫుట్టింది. బస్సుల కింది భూమి కంపించడంతో పాటు బస్సు పూర్తిగా గాల్లోకి ఎగిరింది. బస్సు శకలాలు, ముక్కలైన శరీర భాగాలు, రాళ్లు గంటకు 1000 కి.మీ వేగంతో నేలమీద పడ్డాయి.

''ఆ దృశ్యం చాలా భయానకంగా ఉంది. దూరంగా ఒక రాయి వెనుక కూర్చొన్న వీరప్పన్ కూడా వణికిపోయాడు. ఆయన శరీరమంతా చెమటతో తడిసిపోయింది. కాసేపటికి ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. ముక్కలైన 21 శరీరాలను ఆయన లెక్కించారు'' అని 'వీరప్పన్ చేజింగ్ ద బ్రిగాండ్' అనే పుస్తకంలో కె. విజయ్ కుమార్ రాశారు.

గాయాలైన వారితో పాటు చనిపోయిన మృతదేహాలను మరో బస్సులోకి ఎక్కించామని విజయ్ కుమార్‌తో అశోక్ కుమార్ చెప్పారు. కానీ ఆ గందరగోళంలో మేం మా సహచరుడు సుగుమార్‌ను అక్కడే వదిలి వచ్చామనే సంగతి తర్వాత తెలిసింది. పేలుడు ధాటికి ఆయన గాలిలోకి ఎగిరి ఎక్కడో దూరాన విసిరివేయబడ్డారు. బస్సు ఆ ప్రాంతం నుంచి వచ్చేశాక మాకు ఈ సంగతి తెలిసింది. కానీ ఆలోపే ఆయన మరణించారు.

అప్పటివరకు వీరప్పన్ చేసిన వాటిలో ఇదే అతిపెద్దది. ఈ ఘటనతో వీరప్పన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.

1952 జనవరి 18న జన్మించిన వీరప్పన్, 17 ఏళ్ల వయస్సులోనే మొదటిసారిగా ఏనుగును వేటాడాడని చెబుతుంటారు. ఏనుగులను చంపేందుకు ఆయనకు నచ్చిన టెక్నిక్... నుదురు మధ్య భాగంలో కాల్చడం.

వీరప్పన్‌ పట్టుబడినప్పుడు

''ఒకసారి, వీరప్పన్‌ను అటవీ అధికారి శ్రీనివాస్ అరెస్ట్ చేశారు. ఒకరోజు తనకు చాలా తలనొప్పిగా ఉందని వీరప్పన్ భద్రతా సిబ్బందికి చెప్పారు. తలకు రాసుకునేందుకు తైలాన్ని ఇవ్వగా, ఆయన దాన్ని తెలివిగా చేతులకు కూడా రాసుకున్నారు. దీంతో కొన్ని నిమిషాలకే ఆయన చేతులు, సంకెళ్ల నుంచి బయటకొచ్చాయి. చాలారోజుల పాటు వీరప్పన్ పోలీసు కస్టడీలో ఉన్నప్పటికీ, ఆయన ఫింగర్ ప్రింట్స్ మాత్రం పోలీసులు సేకరించలేదు.'' అని కె. విజయ్ కుమార్ వివరించారు.

ఆ కాలంలో వీరప్పన్ ఎంత వణికించాడంటే... తనను తొలిసారిగా అరెస్ట్ చేసిన భారత అటవీశాఖ అధికారి శ్రీనివాస్ తల నరికిన వీరప్పన్ తన సహచరులతో కలిసి దానితో ఫుట్‌బాల్ ఆడాడు.

''వీరప్పన్ తమ్ముడు అర్జునన్‌తో శ్రీనివాస్ తరచూ మాట్లాడుతుండేవారు. వీరప్పన్ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడని ఒకరోజు శ్రీనివాస్‌తో అర్జునన్ చెప్పారు. మీరు నామ్‌దిల్లీవైపు వెళ్తూ ఉండండి. మధ్యలో ఆయన మిమ్మల్ని కలుస్తారు అని అర్జునన్ చెప్పారు. దీంతో కొంతమందితో కలిసి వీరప్పన్‌ను కలిసేందుకు శ్రీనివాస్ బయల్దేరారు. కానీ మార్గమధ్యంలోనే ఒక్కొక్కరు నెమ్మదిగా ఆయనను వదిలి వెళ్లడాన్ని శ్రీనివాస్ గుర్తించలేదు'' అని విజయ్ కుమార్ వివరించారు.

వీరప్పన్ క్రూరత్వం

kannada actor raj kumar

''ఒకానొక దశలో ఆయన, వీరప్పన్ తమ్ముడు అర్జునన్ మాత్రమే మిగిలిపోయారు. వారు దగ్గరిలోని ఒక చెరువుకు చేరుకోగానే, ఒక పొద నుంచి కొంతమంది వ్యక్తులు బయటికొచ్చారు. వారిలో ఒకరు గుబురు మీసాలతో ఉన్నారు. అప్పుడు కూడా శ్రీనివాస్, వీరప్పన్ లొంగిపోవడానికి వచ్చారనే అనుకున్నారు. కానీ అంతలోనే అతను ఏదో తప్పు జరిగిందని గ్రహించారు.''

''వీరప్పన్ చేతిలో రైఫిల్ ఉంది. శ్రీనివాస్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కేవలం అర్జునన్ మాత్రమే ఉన్నారు. ఆయన్ను చూస్తూ వీరప్పన్ గట్టిగా నవ్వారు. శ్రీనివాస్ ఏమీ మాట్లాడకముందే, వీరప్పన్ ఆయన్ను కాల్చారు. అక్కడితో ఆగకుండా శ్రీనివాస్ శరీరం నుంచి తలను వేరు చేసి ఒక ట్రోఫీలా ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ గ్యాంగ్‌తో కలసి దానితో ఫుట్‌బాల్ ఆడారు.''

నేర ప్రపంచంలో అనేక క్రూరమైన చర్యల గురించి మీరు విని ఉంటారు. కానీ ఒక దొంగ, తనను తాను కాపాడుకోవడానికి తన నవజాత కుమార్తెను బలి చేయడం గురించి మీరు కచ్చితంగా విని ఉండకపోవచ్చు.

''1993లో వీరప్పన్, ఒక పాపకు తండ్రయ్యారు. అదే సమయంలో ఆయన గ్యాంగ్ సంఖ్య 100 దాటింది. నవజాత శిశువు ఏడిస్తే 110 డెసిబెల్స్ ధ్వని ఉత్పత్తి అవుతుంది. మెరుపు వల్ల కలిగే ధ్వని కన్నా ఇది కేవలం 10 డెసిబెల్స్ తక్కువ. అడవిలో, రాత్రి సమయంలో చిన్నారి ఏడిస్తే ఆ శబ్ధం దాదాపు రెండున్నర కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది.''

veerappan

''ఆ చిన్నారి ఏడ్వడం వల్ల ఒకసారి వీరప్పన్ ఇబ్బందుల్లో పడ్డాడు. దీంతో ఆ పాపను శాశ్వత నిద్రలోకి పంపాలని నిర్ణయించుకున్నాడు. మరి మడువు ప్రాంతంలోని చదునైన నేల... ఎగుడుదిగుడుగా ఉండటాన్ని 1993లో కర్ణాటక ఎస్‌టీఎఫ్ బృందం గమనించింది. దాన్ని తవ్వి చూడగా, వారికి నవజాత శిశువు మృతదేహం లభించింది.'' అని విజయ్ కుమార్ వివరించారు.

100 రోజుల పాటు బంధీగా....

2000 ఏడాదిలో దక్షిణ భారతదేశ ప్రముఖ సినీ నటుడు రాజ్ కుమార్‌ను వీరప్పన్ కిడ్నాప్ చేశారు. ఆయనను 100 రోజులకు పైగా బంధించారు. ఆ సమయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

2001 జూన్‌ నెలలో, ఒకరోజు ఉదయం 11 గంటలకు సీనియర్ ఐపీఎస్ ఆధికారి కె. విజయ్ కుమార్ ఫోన్ మోగింది. స్క్రీన్‌పై 'అమ్మ' అనే పేరు కనిపించింది. ముఖ్యమంత్రి జయలలిత పేరును ఆయన అమ్మ అని సేవ్ చేసుకున్నారు.

jayalalitha

సమయం వృథా చేయకుండా జయలలిత అసలు విషయానికి వచ్చారు. ''తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) బృందానికి మిమ్మల్ని చీఫ్ అఫీసర్‌గా నియమిస్తున్నాం. రేపటికల్లా మీకు ఆర్డర్లు వస్తాయి. ఈ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ వైఖరి శ్రుతి మించుతోంది'' అని అన్నారు.

స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోగానే విజయ్ కుమార్, వీరప్పన్‌కు సంబంధించిన వివరాలు సేకరించడం ప్రారంభించారు. వీరప్పన్ కంటికి ఏదో సమస్య ఉన్నట్లు విజయ్ కుమార్ దృష్టికి వచ్చింది. మీసాలకు పట్టించే ద్రావణంలోని కొన్ని చుక్కలు పొరపాటున వీరప్పన్ కంటిలో పడినట్లు వారికి తెలిసింది.

''ఆడియో, వీడియో క్లిప్పుల ద్వారా తన సందేశాన్ని బయటి ప్రపంచానికి పంపడానికి వీరప్పన్ ఇష్టపడతాడు. అలాంటి ఒక వీడియోలో, వీరప్పన్ పేపర్ చదవడంలో ఇబ్బంది పడుతుండటాన్ని చూశాం. ఆయనకు ఏదో కంటి సమస్య ఉన్నట్లు అప్పుడు మాకు తొలి సంకేతం లభించింది. వెంటనే మా సభ్యుల సంఖ్యను కుదించాలని మేం నిర్ణయించాం. మా పెద్ద బృందం కోసం మేం సరుకులు తీసుకున్నప్పుడల్లా ఆ విషయం వీరప్పన్‌కు తెలిసిపోయేది. అందుకే ఆరుగురు సభ్యుల చొప్పున అనేక బృందాలుగా విడిపోయాం.''

కంటి చికిత్స కోసం వీరప్పన్‌ను అడవి నుంచి బయటకు రప్పించేందుకు ప్రణాళిక రచించాం. అందుకోసం 'ఎస్‌కేఎస్ ఆసుపత్రి, సేలం' పేరిట ఒక ప్రత్యేక అంబులెన్స్‌ను సిద్ధం చేశాం.

వీరప్పన్‌ను మట్టుబెట్టిన పోలీస్ అధికారి కె. విజయ్ కుమార్

''ఆ అంబులెన్స్‌లో ఇద్దరు ఎస్‌టీఎఫ్ సిబ్బంది, ఇన్‌స్పెక్టర్ వైళ్లదురై, డ్రైవర్ శరవణన్ కూర్చున్నారు. తెల్లటి బట్టలు ధరించిన వీరప్పన్, ఎవరూ తనను గుర్తు పట్టే వీల్లేకుండా తన మీసాలను కత్తిరించుకున్నారు.''

అంబులెన్స్ నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్నాక డ్రైవర్ శరవణన్ అకస్మాత్తుగా గట్టిగా బ్రేక్ వేశారు. దీంతో సీట్లలో కూర్చున్నవారంతా కిందపడిపోయారని విజయ్ కుమార్ గుర్తు చేసుకున్నారు. '' ఆయన చాలా వేగంగా అంబులెన్స్ నడిపిస్తూ ఒక్కసారిగా బ్రేక్ వేశారు. ఆ ధాటికి అంబులెన్స్ టైర్ల కింద పొగ రావడం మేం చూశాం. టైర్లు కాలుతున్న వాసన మా వరకు వచ్చింది. అంతలోనే శరవణన్ నా దగ్గరకు వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చారు.''

విజయ్ కుమార్ విజయ నాదం

''వీరప్పన్ అంబులెన్స్‌లో ఉన్నాడని శరవణన్ అరవడం నేను స్పష్టంగా విన్నా. అంతలోనే మెగాఫోన్‌లో నా సహచరుడు 'ఆయుధాలు కింద పడేయండి. లొంగిపోండి. మీ చుట్టూ పోలీసులు ఉన్నారు' అని అరిచారు. అయినప్పటికీ వారే మొదట కాల్పులు ప్రారంభించారు. ఆ తర్వాత మేమంతా మొదలెట్టాం. బుల్లెట్ల వర్షం కురిసింది. నేను కూడా నా పూర్తి కోటా 47 బుల్లెట్లు అంబులెన్స్‌పై సంధించా. కాసేపటికి, అంబులెన్స్ నుంచి ప్రతీకార కాల్పులు ఆగిపోయాయి.''

''ఆయనపై మొత్తం 338 రౌండ్ల పాటు కాల్పులు జరిపాం. ఒక్కసారిగా అక్కడ అంత పొగ చుట్టుముట్టింది. పెద్ద శబ్ధాలు ఆగిపోయాయి. రాత్రి 10:50 గంటలకు ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. 20 నిమిషాల్లో వీరప్పన్‌తో పాటు ఆయన ముగ్గురు అనుచరులను మట్టుబెట్టాం.''

''ఆశ్చర్యకంగా, వీరప్పన్‌కు కేవలం రెండు బుల్లెట్లు మాత్రమే తగిలాయి. 1960ల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు డి గాలె లక్ష్యంగా కారుపై 140 సార్లు కాల్పులు జరపగా, కేవలం 7 బుల్లెట్లు మాత్రమే కారును తగిలాయి.

మీరు అంబులెన్స్ దగ్గరికి వెళ్లినప్పుడు, వీరప్పన్ బతికే ఉన్నారా? అని నేను విజయ్ కుమార్‌ను అడిగాను.

''అప్పటికీ ఆయన శ్వాస తీసుకోలేకపోతున్నారు. అతని ప్రాణం పోవడం నాకు స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ, తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని నేను నిర్ణయించుకున్నా. ఆయన ఎడమ కంటిలోనుంచి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. మీసాలు లేకుండా వీరప్పన్... ఒక సాధారణ వ్యక్తిలా కనిపించారు. ఆయన మృతదేహానికి డాక్టర్ వల్లినాయగమ్ పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. వీరప్పన్‌కు 52 ఏళ్ల వయస్సు ఉన్నప్పటికీ, ఆయన శరీరం మాత్రం 25 ఏళ్ల యువకుడిలా ఉందని డాక్టర్ వల్లినాయగమ్ నాతో చెప్పారు'' అని విజయ్ కుమార్ బదులిచ్చారు.

వీరప్పన్ చనిపోయాక కూడా కాసేపటి వరకు ఎస్‌టీఎఫ్ సిబ్బంది దాన్ని నమ్మలేకపోయారు. దాన్నుంచి తేరుకున్నాక చీఫ్ విజయ్‌కుమార్‌ను భుజాల పైకెత్తుకొని అభినందనలు తెలుపుకున్నారు. విజయ్ కుమార్ వేగంగా మెట్లెక్కి అక్కడి ఒక పాఠశాల బాల్కనీకి చేరుకున్నారు.

అక్కడి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తిన ఆమె కార్యదర్శి షీలా బాలకృష్ణన్ 'మేడమ్ నిద్రపోతున్నారు' అని చెప్పారు.

''నేను ఇప్పుడు చెప్పబోయేది వింటే, ఆమె చాలా సంతోషిస్తారు'' అని షీలాతో విజయ్ కుమార్ అన్నారు.

'' ఆ మరు క్షణంలోనే నేను జయలలిత గొంతు విన్నాను. 'మేడమ్ మేం అతన్ని మట్టుబెట్టాం' అని అసలు విషయం వెంటనే చెప్పేశాను. నాతో పాటు నా టీమ్‌ను ఆమె అభినందించారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా ఇంతకంటే మంచి న్యూస్ నేను వినలేదు అని ఆమె నాతో అన్నారు'' అని విజయ్ కుమార్ గుర్తు చేసుకున్నారు.

ఫోన్ కట్ చేయగానే, విజయ్ కుమార్ తన జీప్ వైపు నడిచారు. చివరిగా మరోసారి అంబులెన్స్‌ను పరీక్షించారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశమేంటంటే, ఆయనను కనీసం ఒక్క బుల్లెట్ కూడా గాయపరచలేకపోయింది. తన జీప్‌పైనున్న నీలం రంగు బల్బ్ ఇంకా తిరుగుతూనే ఉంది. దాన్ని ఆపేయాలని ఆయన ఆదేశించారు. ఆ ఆపేసిన బల్బ్ 'మిషన్ విజయవంతంగా పూర్తయింది' అనే సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Veerappan:How was this smuggler killed in just 20 minutes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X