ప్రపంచం టాప్ 10 నేతల్లో మోడీ ఉన్నారు: వెంకయ్య
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే టాప్ 10 నేతలలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకరు అని, అలాంటి వ్యక్తి పైన విపక్షాలు విమర్శలు గుప్పించడం విడ్డూరమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు అభిప్రాయపడ్డారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య స్పందించారు. మోడీ ప్రపంచ టాప్ 10 నేతల్లో ఒకరన్నారు. ఆయన అంతర్జాతీయ నేత అన్నారు.

భారత్‌ని ఇప్పుడు ప్రపంచం అంతా గుర్తించిందన్నారు. మన దేశానికి తగిన గౌరవం ఇస్తోందన్నారు. ఒక దేశం తర్వాత మరొక దేశం మోడీ రాక కోసం ఎర్ర తివాచీ పరుస్తోందన్నారు. ప్రపంచ ముఖచిత్రంలో మోడీ భారత్‌ను ప్రత్యేకంగా నిలుపుతున్నారన్నారు.
ఆయన ఆధ్వర్యంలోనే బ్రిక్స్ బ్యాంకుకు తొలిసారి భారతీయుడు ఛైర్మన్ అయ్యారని గుర్తు చేశారు. మోడీ ప్రతిపాదనతోనే ఐక్యరాజ్యసమితి యోగా డేని అధికారికంగా గుర్తించిందని, దేశీయ అభివృద్ధికి విదేశీ విధానాలు ఎంతో ముఖ్యమైనవని మోడీ నమ్ముతారన్నారు.












Click it and Unblock the Notifications