BJP:వెరీ ఇంపార్టెట్, డుమ్మా కొట్టొద్దు -ఎంపీలకు విప్ జారీ -పార్లమెంటరీ పార్టీ భేటీ రేపు-రచ్చలోనే బిల్లులు పాస్
పెగాసస్ నిఘా ఉదంతం, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం, కరోనా మహమ్మారి నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం తదితర అంశాలపై తీవ్రమైన రచ్చ కొనసాగడంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గందరగోళంగా కొనసాగుతున్నాయి. మరో మూడు రోజుల్లో, అంటే ఆగస్టు 13తో సెషన్ ముగియనుండటంతో మోదీ సర్కారు హడావుడి బిల్లుల్ని ఆమోదించుకుంటున్నది. ఈ క్రమంలోనే మంగళ, బుధవారాల్లో కీలక పరిణామాలు జరగనున్నాయి..
మంగళవారం, బుధవారం జరిగే పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరు కావొద్దంటూ బీజేపీ తన రాజ్యసభ ఎంపీలను ఆదేశించింది. ఈ మేరకు సోమవారం ఎంపీలకు మూడు లైన్ల విప్‌ను జారీ చేసింది. ''ఆగస్ట్ 10 మంగళవారం, ఆగస్ట్ 11 బుధవారం రాజ్యసభలో ముఖ్యమైన అంశాలపై చర్చ, ముఖ్యమైన బిల్లుల ప్రవేశం జరుగనున్నది. ఈ నేపథ్యంలో రాజ్యసభలోని బీజేపీ సభ్యులంతా ఈ రెండు రోజులు సభకు హాజరై ప్రభుత్వానికి మద్దుతు ఇవ్వాలి'' అని నోటీసులో బీజేపీ పేర్కొంది. మరోవైపు మంగళవారం లోక్‌సభకు బీజేపీ ఎంపీలంతా హాజరుకావాలని కోరుతూ మూడు లైన్ల విప్ జారీ చేసింది.

కరోనా నిబంధనల నడుమ జూలై 19న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్ట్ 13న ముగియనున్నాయి. పెగాసస్ స్పైవేర్ అంశం, రైతుల నిరసనలపై ప్రతిపక్షాలు సభను అడ్డుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు పార్లమెంట్ కార్యక్రమాలు సజావుగా జరుగలేదు. కాగా, విపక్షాల గందరగోళం మధ్య కొన్ని ముఖ్యమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి ఆమోదించింది. మరో మూడు రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నందున మరి కొన్ని ముఖ్య బిల్లులను ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. కాగా,
పార్లమెంట్ సమావేశాలు మరో మూడురోజుల్లో ముగినుండగా, భారతీయ జనతాపార్టీ తన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పిలుపునిచ్చింది. మంగళవారం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుందని, ఈ భేటీకి ఎంపీలందరూ హాజరు కావాల్సిందిగా సమాచారం వెళ్లింది. గతవారం కూడా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయగా, సభలో విపక్షాలు అనుసరిస్తోన్న వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రేపటి సమావేశంలోనూ ప్రధాని కీలక సందేశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే,
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా సోమవారంనాడు విపక్షాల ఆందోళనల మధ్య చర్చ లేకుండానే 3 బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొందాయి. వీటిలో లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్ (సవరణ) బిల్లు-2021, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (సవరణ) బిల్లు-2021, కన్‌స్టిట్యూషన్ (గిరిజన తెగలు) ఆర్డర్ (సవరణ) బిల్లు-2021 ఉన్నాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు సభా సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్ (సవరణ) బిల్లు-2021ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. 2008 లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్ చట్టానికి ఇది సవరణ బిల్లు. దేశంలో సులభతర వాణిజ్యానికి ఉద్దేశించినది. ఇది చాలా కీలకమైన బిల్లు అని నిర్మలా సీతారామన్ చెబుతుండగానే..
విపక్షాలు పోడియం వైపు దూసుకువెళ్లి 'పెగాసస్ ప్రాజెక్ట్' మీడియా రిపోర్ట్‌పై చర్చ జరపాలంటూ పట్టుపట్టారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (సవరణ) బిల్లు-2021 బిల్లును కూడా ఆర్థిక మంత్రి నిర్మల లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రూ.5 లక్షల వరకూ బ్యాంకు డిపాజిట్లను ఇన్‌స్యూర్ చేసేందుకు ఉద్దేశించిన బిల్లు ఇది. విపక్షాలు చర్చలో పాల్గొనాలని నిర్మలా సీతారామన్ విపక్షాలను కోరారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. దీంతో ఎలాంటి చర్చా లేకుండానే రెండు బిల్లులు సభామోదం పొందాయి. కన్‌స్టిట్యూషన్ (ఎస్‌టీ) ఆర్టర్ (సవరణ) బిల్లు-2021ను కేంద్ర మంత్రి అర్జున్ ముండే ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కూడా ఎలాంటి చర్చా లేకుండానే ఆమోదం పొందింది. అనంతరం సభ మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది.
పెగాసస్ సహా పలు అంశాలపై ఆందోళనలు చేస్తూ పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్న ప్రతిపక్షాలు.. ఒక్క విషయంలో మాత్రం ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెడుతూ కేంద్రం నేడు ప్రవేశపెట్టే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు విపక్షాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి. ఈ బిల్లు వచ్చినప్పుడు ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా చర్చలో పాల్గొంటామని వెల్లడించాయి. ఇది చాలా ముఖ్యమైన అంశమని, అందుకే కేంద్రానికి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు విపక్ష నేతలు చెప్పారు.
రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాని నిర్వహించే అధికారాన్ని ఈ బిల్లు ద్వారా కేంద్రం.. రాష్ట్రాలకే కట్టబెట్టనుంది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు దక్కనుంది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. కాగా.. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓబీసీల మద్దతు సంపాదించుకోవడం కోసమే బీజేపీ హైకమాండ్ వ్యూహాత్మకంగా ఈ బిల్లును తీసుకొస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పార్లమెంట్‌లో సోమవారం కూడా వాయిదాల పర్వం మొదలైంది. ఈ ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన లేవనెత్తాయి. దీంతో కొద్ది నిమిషాలకే సభ అరగంటపాటు వాయిదా పడింది. ఆ తర్వాత ఉదయం 11.30 గంటలకు మళ్లీ మొదలైనా విపక్షాల నిరసనలు ఆగలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం నెలకొంది. ఫోన్ల హ్యాకింగ్‌పై చర్చ జరపాలని పట్టుబడుతోన్న విపక్ష నేతలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
అంతకు ముందు టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులు నీరజ్ చోప్రా, బజరంగ్ పునియా, పీవీ సింధు, లవ్లీనా, మీరాబాయి చాను, రవి దహియా, హాకీ జట్టు క్రీడాకారులకు ఉభయ సభలు అభినందనలు తెలిపాయి. నేడు క్విట్ ఇండియా ఉద్యమ రోజును పురస్కరించుకుని భారత స్వాతంత్ర్య సమరంలో ప్రాణత్యాగం చేసిన వారికి ఉభయ సభలు నివాళులర్పించాయి.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్‌లో ఊహించని ట్విస్ట్ -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications