సుప్రీంకోర్టుపై ఉపరాష్ట్రపతి ధన్ కర్ ఫైర్- అణ్వస్త్ర క్షిపణిలా మీ అధికారాలు..!
తమిళనాడు అసెంబ్లీ పంపిన 10 బిల్లుల్ని ఆమోదించకుండా, తిరస్కరించకుండా పెండింగ్ లో పెట్టిన గవర్నర్ బీఎన్ రవిపై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్హహం వ్యక్తం చేసింది. అంతే కాదు రాష్ట్రపతి అభిప్రాయం కోసం పంపిన సదరు బిల్లుల్ని నేరుగా ఆమోదిస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఆ తర్వాత రాష్ట్రపతి సైతం తమ వద్దకు వచ్చిన బిల్లుల్ని మూడు నెలల్లో తప్పనిసరిగా ఆమోదించి పంపాల్సిందేనని తేల్చిచెప్పేసింది. దీంతో ఈ తీర్పులు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.
ఇవాళ ఇదే వ్యవహారంపై ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్ తీవ్రంగా స్పందించారు. దేశంలో న్యాయవ్యవస్థకు రాజ్యాంగం ఆర్టికల్ 142 లో కల్పించిన స్వతంత్ర అధికారాలు ప్రజాస్వామ్య శక్తులపై అణ్వస్త్ర క్షిపణిలా మారాయని వ్యాఖ్యానించారు. రాజ్యసభలో ఆరో బ్యాచ్ ఇంటర్న్ లకు నిర్వహించిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే తాజాగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలపైనా ధన్ కర్ విమర్శలు గుప్పించారు.

మార్చి 14, 15 తేదీల్లో ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి నోట్ల కట్టలు దొరికాయని, కానీ ఈ విషయం వారం రోజుల వరకూ ఎవరికీ తెలియదని ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్ తెలిపారు. ఈ ఆలస్యం ఎందుకో, దీన్ని ఖండించాలో వద్దో మనమే ప్రశ్నించుకోవాలన్నారు. మనం సాధారణ పరిస్ధితుల్లో చట్టం అందరికీ సమానమని మాట్లాడుకుంటామని, కానీ పరిస్ధితులు మాత్రం భిన్నంగా ఉంటున్నాయన్నారు. వారం రోజుల తర్వాత ఈ విషయం తెలిసి దేశ ప్రజలు నివ్వెరపోయారన్నారు.
ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఈ వ్యవహారంలో ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, కానీ ముగ్గురు జడ్జిల సుప్రీంకోర్టు బెంచ్ మాత్రం విచారణ చేపట్టిందని ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్ తెలిపారు. తద్వారా కార్యనిర్వాహక వ్యవస్థ చేయాల్సిన పనిని న్యాయ వ్యవస్థ చేస్తోందన్నారు. సాధారణ వ్యక్తులు ఇలాంటి తప్పులు చేస్తే చట్ట ప్రకారం నేరుగా శిక్షలుంటాయని, కానీ జడ్డీల విషయంలో మాత్రం వారి పై వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ విషయం రాజ్యాంగంలో కూడా లేదన్నారు.
రాజ్యాంగం రాష్ట్రపతికీ, గవర్నర్లకు మాత్రమే ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పించిందని, కానీ న్యాయవ్యవస్థ ఇందులో ఎలా వచ్చి చేరిందో అర్ధం కావడం లేదని ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు తమ ఇంట్లో జరిగితే విచారణలు ఎంత వేగంగా జరుగుతాయో అని ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తున్నారని తెలిపారు. కానీ ఢిల్లీ హైకోర్టు జడ్డి విషయంలో మాత్రం విచారణ ఎడ్లబండిలా జరుగుతోందన్నారు.
అలాగే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంపై ముగ్గురు సుప్రీంకోర్టు జడ్డిలు విచారణ చేస్తున్నారని, వారికి ఈ అధికారం ఎవరు ఇచ్చారని ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్ ప్రశ్నించారు. చివరకు సుప్రీంకోర్టు జడ్డీల కమిటీ సిఫార్సులు చేస్తుందని, అది కూడా తిరిగి పార్లమెంటే చేయాలన్నారు. ఈ కేసులో విచారణ వేగంగా జరగాల్సిన అవసరం ఉందని, సదరు జడ్డి అభిశంసన ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలు కావాల్సి ఉందన్నారు.
భారత రాష్ట్రపతి చాలా ఉన్నతమైన పదవి అని, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, రక్షించడానికి ప్రమాణం చేస్తారని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పులో రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. మనం ఎటువైపు వెళ్తున్నాం? దేశంలో ఏం జరుగుతోంది? మనం చాలా సున్నితంగా ఉండాలని సూచించారు. ఎవరైనా సమీక్ష దాఖలు చేస్తారా లేదా అనేది ప్రశ్న కాదని, ఇవాళ ప్రజాస్వామ్యం కోసం మనం ఎప్పుడూ బేరసారాలు చేయలేదని తెలిపారు. కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతిని ఆదేశించడం, లేకపోతే చట్టంగా మారుతుందని చెప్పడం సరికాదన్నారు. మనకు చట్టాలు చేసే, కార్యనిర్వాహక విధులను నిర్వహించే, సూపర్-పార్లమెంట్‌గా వ్యవహరించే న్యాయమూర్తులు ఉన్నారని చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications