
రాష్ట్రపతి రేసులో వెంకయ్య..!! వైసీపీ - బీజేడీ తో బీజేపీ మంతనాలు : నిర్ణయం దిశగా..!!
దేశానికి కాబోయే తదుపరి రాష్ట్రపతి ఎవరు. ప్రస్తుత రాష్ట్రపతినే కొనసాగిస్తారా. ప్రస్తుత ఉప రాష్ట్రపతికి ప్రమోషన్ దక్కుతుందా. లేక, కొత్త వారికి ఛాన్స్ దక్కేనా. ఢిల్లీలో ఏం జరుగుతోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ జోష్ లో ఉంది. నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించటంతో తమ నెక్స్ట్ టార్గెట్ మీద ఫోకస్ పెట్టింది.
అందులో భాగంగా.. జాతీయ రాజకీయాల్లో తమకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న వారికి అవకాశం లేకుండా.. తమ సత్తా చాటేందుకు సిద్దం అవుతోంది. ఉత్తరప్రదేశ్ లో విజయం తో ఇప్పుడు బీజేపీ బలం పెరిగింది. దీంతో..రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక..ఎన్నిక ప్రధాన లక్ష్యం గా బీజేపీ పావులు కదుపుతోంది.

రాష్ట్రపతి ఎన్నిక పై ఫోకస్
యూపీలో వచ్చిన సీట్లు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా మారనున్నాయి. మార్చి 31న జరిగే రాజ్యసభ ఎన్నికల సమయంలోనే ఈ ఫలితాలు ప్రభావం చూపనున్నాయి. భారత రాష్ట్రపతిని 776 మంది పార్లమెంటేరియన్లు.. వివిధ రాష్ట్రాల్లోని మొత్తం 4,120 మంది శాసనసభ్యులు ఏర్పాటు చేసిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు.
ఎలక్టోరల్ కాలేజీ మొత్తం బలం 10,98,903 ఓట్లు కాగా, బీజేపీ బలం సగం కంటే ఎక్కువగా ఉంది. ఎంపీకి ఒక్కో ఓటు విలువ 708. ఎమ్మెల్యేల విషయానికొస్తే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ఓటు విలువ భిన్నంగా ఉంటుంది. అధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యే ఓట్లకు అత్యధిక విలువ 208 గా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ .. మిత్రపక్షాలు 270 సీట్లకు పైగా గెలుపొందడంతో, తదుపరి రాష్ట్రపతిని ఎంపిక చేసుకునేందుకు పరిణామాలు కలిసి వస్తున్నాయి.

వెంకయ్యకు ప్రమోషన్ దక్కేనా
అయితే, ఢిల్లీలో పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ మేరకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అత్యున్నత పదవికి ముందంజలో ఉన్నారు, అయితే ప్రస్తుత రామ్ నాథ్ కోవింద్‌కు రెండవసారి పదవి ఇవ్వాలా వద్దా అనే దానిపై బిజెపి నాయకత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఇప్పటి వరకు మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ మాత్రమే రెండుసార్లు ఎన్నికయ్యారు. అయితే, 2024 ఎన్నికల్లో భాగంగా దక్షిణాది పైన బీజేపీ ఫోకస్ పెట్టనుంది. అదే సమయంలో దక్షిణాదిని చిన్న చూపు చూస్తున్నారనే క్రమంలో ఉప రాష్ట్రపతికి ప్రమోషన్ ఇస్తారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఉప రాష్ట్రపతి ఏపీలో పర్యటన సమయంలోనూ పలువురు ప్రముఖులు ఆయన రాష్ట్రపతి కావాలని ఆకాంక్షించారు.

సమీకరణాల ఆధారంగా తుది ఎంపిక
అయితే, వెంకయ్య మాత్రం అనేక మంది తాను మరింత ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారని..తనకు మాత్రం ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేసారు. ఇక, ఇప్పుడు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావటంతో..ఈ చర్చ తెర మీదకు వచ్చింది. అయితే, బీజేపీ సైతం అన్ని కోణాల్లోనూ చర్చించి..సమీకరణాల ఆధారంగా తుద నిర్ణయం తీసుకోనుంది.
అయితే, ప్రతీ సందర్భంలోనూ మద్దతుగా నిలుస్తున్న వైసీపీ..బిజూ జనతా దళ్ తోనూ బీజేపీ చర్చలు చేస్తున్నట్లుగా సమాచారం. దీని ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్ధిని ఏకగ్రీవంగా ప్రకటించాలనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీ వ్యతిరేక పక్షాలు రాష్ట్రపతి అభ్యర్ధిగా తమ కూటమి నుంచి సీనియర్ నేతను ప్రతిపాదించాలని భావిస్తున్నాయి.
Recommended Video

వైసీపీ..బీజేడీతో మంతనాల తరువాతనే
మమతా బెనర్జీ.. స్టాలిన్... థాక్రే..కేసీఆర్ వంటి నేతలు ఉమ్మడిగా రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక పైన ఆలోచన చేసినా...అయిదు రాష్ట్రాల ఫలితాల తరువాత వారి ఆలోచనలో మార్పు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కానీ, బీజేపీ ప్రతిపాదించే అభ్యర్ధికి సహకరించే విషయంలో వారి నుంచి అభ్యర్ది పైన స్పష్టమైన ప్రకటన వచ్చిన తరువాతనే నిర్ణయం ఉండే అవకాశం ఉంది.
దీంతో..బీజేపీ ఏకగ్రవంగానే రాష్ట్రపతి అభ్యర్ధిని ఖరారు చేసేందుకు అభ్యర్ధి ఎంపిక విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉంది. దీంతో..ఇప్పుడు వెంకయ్యనాయుడుకు ప్రమోషన్ దక్కుతుందా..లేక, కొత్త అభ్యర్ధిని తెర మీదకు తెస్తుందా అనేది మరి కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.