విజయ్ మాల్యా అరెస్ట్, గంటల్లోనే బెయిల్, ‘ఇండియన్ మీడియా అత్యుత్సాహం’

Subscribe to Oneindia Telugu

లండన్:లిక్కర్ కింగ్, ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా లండ‌న్‌లో అరెస్టయ్యారు. మనదేశంలోని బ్యాంకులకు 9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకున్న విజయ్ మాల్యాను స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వెస్ట్ మినిస్టర్స్ మేజిస్ట్రేట్‌ ఎదుట మాల్యాను హాజరుపర్చనున్నారు.

విలాసాలకు కేరాఫ్ 'మోసకారి' మాల్యా: ఎప్పుడేం జరిగిందంటే..?

త్వరలోనే మాల్యాను మనదేశానికి రప్పించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయమై భారత అధికారులు యూకే ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరిపాయి. కొద్ది రోజుల్లోనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) యూకేకు వెళ్లి ఇందుకు సంబంధించిన వ్యవహారాలను పూర్తి చేసే అవకాశం ఉంది.

vijay mallya arrested in London

మన దేశంలోని బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా.. మార్చి 2016లో లండన్‌కు పారిపోయారు. రుణాల ఎగవేత కేసులో విచారణ కోసం తమ ముందు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోరినప్పటికీ మాల్యా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

ఈ క్రమంలో ఏప్రిల్ 2016లో ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటును జారీ చేసింది. 2017, జనవరిలో సీబీఐ కోర్టు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

బెయిలు మంజూరు

మంగళవారం అరెస్టైన విజయ్ మాల్యాను అక్కడి పోలీసులు.. వెస్ట్ మినిస్టర్స్ కోర్టు ముందు హాజరుపర్చారు. కాగా, విజయ్ మాల్యాకు వెస్ట్ మినిస్టర్స్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. అరెస్టైన 3గంటల్లోనే మాల్యాకు బెయిల్ లభించడం గమనార్హం. దీంతో మరోసారి విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించే ప్రయత్నం విఫలమైనట్లే కనిపిస్తోంది.

ఇండియన్ మీడియా అత్యుత్సాహం: మాల్యా

కోర్టు నుంచి బెయిల్ పొందిన అనంతరం విజయ్ మాల్యా మాట్లాడుతూ.. ఈ వ్యవహరాన్ని భారత మీడియా అత్యుత్సాహంతో ఎక్కువగా చూపిందని అన్నారు. తనను అరెస్ట్ చేసినట్లు వచ్చిన వార్తలు ఇండియన్ మీడియా అత్యుత్సాహానికి నిదర్శనమని అన్నారు. అప్పగింత వాదనలు మంగళవారం కోర్టులో ప్రారంభమయ్యాయని తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Liquor king Vijay Mallya arrested in London on Tuesday morning.
Please Wait while comments are loading...