విజయ్ గెలుపు తథ్యం- భారీ ఓటింగ్ తో మారిన ఈక్వేషన్లు: రెండు చోట్లా?
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ చరిత్ర సృష్టించబోతోన్నారా?, తన తొలి ఎన్నికలోనే రెండు కీలక నియోజకవర్గాల నుండి పోటీ చేసిన ఆయన భారీ మెజారిటీతో గెలవబోతోన్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. చెన్నైలోని పెరంబూరు, తిరుచ్చిరపల్లి తూర్పు నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావడాన్ని దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. అందులోనూ యువ ఓటర్లు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల ఈ రెండు చోట్లా విజయ్ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని అంచనా వేస్తోన్నారు.
పెరంబూరులో 89.12 శాతం, తిరుచ్చి ఈస్ట్ లో 81.51 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఇదే అత్యధిక పోలింగ్ శాతం. భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలిసారిగా ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకున్న వాళ్లే ఇందులో అధికం. ఇది విజయ్ విజయానికి బాటలు వేసినట్టయిందనే అభిప్రాయాలు తమిళనాట వ్యక్తమౌతోన్నాయి.

తమిళనాడులో విజయ్‌కి ఎప్పటినుంచో అపారమైన అభిమానగణం ఉంది. ముఖ్యంగా యువత, దిగువ మధ్యతరగతి పట్టణ ఓటర్లలో ఆయనకు బలమైన పట్టుంది. ఆయన నటించిన ప్రతి సినిమాకూ జనం బ్రహ్మరథం పట్టారు. థియేటర్లన్నీ కూడా బహిరంగ సభలను తలపించేవి. అదే అభిమానం పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల్లో కూడా కనిపించింది. అక్కడ రికార్డుస్థాయి ఓటింగ్ నమోదయింది.
కార్మికలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు పెరంబూర్ లో. విజయ్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి కూడా అదే ప్రధాన కారణం. ఆయనకు ఉన్న సినిమా ఛరిష్మా, యువ- తటస్థులు, కార్మికులు, దిగువ మధ్య తరగతి ఓటుబ్యాంక్ ను విజయ్ ఆకర్షించుకోగలిగారని, అందుకే అక్కడ భారీగా ఓటింగ్ శాతం నమోదైందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇది విజయ్ వైపే మొగ్గు చూపిందా లేదా అనేది మే 4న తేలిపోతుంది.
విజయ్ పోటీ చేయడం వల్లే తిరుచ్చి ఈస్ట్ లో కూడా ఓటింగ్ శాతం పెరిగిందని అంటున్నారు. పట్టణ ఓటర్లు, వ్యాపారులు, మైనారిటీలు, డీఎంకే, ఏఐఏడీఎంకేలకు బలమైన ఓటు బ్యాంక్ ఉందిక్కడ. 2021లో డీఎంకే అభ్యర్థి ఇరుదయరాజ్ ఇక్కడ గెలిచారు. ఇక్కడ దాదాపుగా 90 శాతం ఓటింగ్ నమోదైంది. అధిక ఓటింగ్ నమోదైనా, ఆ నియోజకవర్గంపై సంప్రదాయక రాజకీయ పార్టీలకు ఉన్న బలమైన పట్టు కారణంగా పెరంబూర్ లో ఉన్నంత సానుకూలత ఇక్కడ ఉండకపోవచ్చనీ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications