సీఎం సర్.. ఆఫీస్ లోనే ఉంటా: ప్లీజ్.. జనం జోలికి వెళ్లొద్దు
ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో సంభవించిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. 39కి చేరింది. ఈ దుర్ఘటన పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి లక్ష రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ఈ వేకువ జామున ఆయన కరూర్ ఆసుపత్రికి సందర్శించారు. బాధిత కుటుంబాల వారిని పరామర్శించారు.
ఈ ఘటనపై విజయ్ తాజాగా మరో వీడియో విడుదల చేశారు. తొక్కిసలాట తర్వాత వీడియో రూపంలో తెర మీదికి రావడం ఇదే తొలిసారి. దీన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఇలాంటి బాధాకరమైన పరిస్థితిని నేను ఎప్పుడూ ఎదుర్కోలేదని, హృదయం ద్రవించిపోతోందని అన్నారు. తనను చూడటానికి, ఆదరించడానికి లక్షల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారని, తన పట్ల చూపిన ప్రేమ, ఆప్యాయతలకు ఎప్పుడూ కృతజ్ఞుడినేనని పేర్కొన్నారు.

ప్రజల భద్రతకు ఎలాంటి లోటు రాకుండా చూసేందుకు తాను రాజకీయాలను పక్కన పెట్టి, ప్రజలకు సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకుని పోలీసు శాఖను అభ్యర్థించినప్పటికీ, జరగకూడనిది జరిగిందని విజయ్ వివరించారు. తాను కూడా ఓ మానవమాత్రుడినేనని వాపోయారు. అంత మంది ప్రజలు బాధలో ఉన్నప్పుడు వారిని వదిలి ఎలా వెళ్లగలనని ప్రశ్నించారు.
ఇప్పటివరకు తాను అయిదు జిల్లాల్లో ప్రచారం చేశానని, కరూర్ లోనే ఇలా ఎందుకు జరిగింది? ఇది ఎలా జరిగింది? ప్రజలకు నిజం తెలుసు, వారు అన్నీ చూస్తున్నారని విజయ్ అన్నారు. స్థానికుల సాక్ష్యాలు అసలు నిజాన్ని బయటపెడతాయని స్పష్టం చేశారు. కరూర్ ప్రజలు నిజాన్ని మాట్లాడినప్పుడు, దేవుడే తనకు వచ్చి చెప్పినట్లు అనిపించిందని విజయ్ తెలిపారు. త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ర్యాలీ విషయంలో పార్టీపరంగా ఎటువంటి తప్పు లేదని విజయ్ పునరుద్ఘాటించారు. పోలీసులు అనుమతి ఇచ్చిన, కేటాయించిన స్థలం నుండే మాట్లాడానని గుర్తు చేశారు. తన మద్దతుదారులు కూడా ఎలాంటి తప్పు చేయలేదని విజయ్ పేర్కొన్నారు. ఎలాంటి తప్పు చేయలేదు.. చేయబోము అని తేల్చి చెప్పారు. అయినా పార్టీ నాయకులు, స్నేహితులు, సోషల్ మీడియా యూజర్ల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చుతున్నారని ఆరోపించారు.
— TVK Vijay (@TVKVijayHQ) September 30, 2025
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించి మాట్లాడారు విజయ్. ప్రజలు, అభిమానులను కాకుండా తనను శిక్షించమని కోరారు. సీఎం సర్, మీరు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటే నా మీద తీర్చుకోండి. నాకు ఏదైనా చేయండి. వారిని మాత్రం ముట్టుకోవద్దు. నేను ఇంట్లో లేదా నా ఆఫీస్ లో ఉంటాను. మీకు ఏమి కావాలో అది చేయండి. ప్రజలు, అభిమానుల జోలికి వెళ్లొద్ద.." అని విజయ్ అన్నారు.












Click it and Unblock the Notifications