విజయ్ జననాయగన్ కు మరో భారీ షాక్..! హైకోర్టు సంచలన ఆదేశం..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ కు సినిమా కష్టాలు తప్పడం లేదు. ఆయన కెరీర్ లో నటించిన తాజా, చివరి చిత్రం కూడా అయిన జన నాయగన్ కు సెన్సార్ సర్టిఫికెట్ కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఇవాళ మద్రాస్ హైకోర్టు (madras high court)లో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ఇవాళ డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది.
విజయ్ జన నాయగన్ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు బోర్డు నిరాకరించింది. దీంతో సమస్య మొదలైంది. దీనిపై సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన విజయ్ కు తిరిగి మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ లో ఊరట లభించింది. జన నాయగన్ కు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై సెన్సార్ బోర్డు తిరిగి డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది.

విజయ్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసే విషయంలో తిరిగి తాజాగా విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. దీంతో విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న జన నాయగన్ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. అంతే కాదు ఈ చిత్ర విడుదల సైతం మరింత ఆలస్యం కాబోతోంది. దీనిపై విజయ్ తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా లేక హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకూ ఎదురుచూస్తారా అన్నది తేలాల్సి ఉంది. జన నాయగన్ చిత్రంలో కొన్ని డైలాగ్స్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని సెన్సార్ బోర్డు చెప్పిన అభ్యంతరాలపై మద్రాస్ హైకోర్టు ఇప్పుడు మరోసారి విచారణ జరపబోతోంది.












Click it and Unblock the Notifications