కేజ్రివాల్ నియంతే, రెఫరెండం చేపట్టాలి: బహిష్కృత నేత
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ ఆరోపించారు. ఆయన ఆ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. తనను పార్టీ నుంచి బహిష్కరించే విషయంపై రెఫరెండం నిర్వహించాలని ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌ను ఆయన డిమాండ్ చేశారు.
ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు కూడా అరవింద్ కేజ్రివాల్ ఢిల్లీ వ్యాప్తంగా రెఫరెండం నిర్వహించారని వినోద్ కుమార్ బిన్నీ గుర్తు చేశారు. తనపై నిర్ణయం తీసుకునేందుకు కూడా అరవింద్ కేజ్రివాల్ రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు. తన నియోజక వర్గం లక్ష్మీనగర్‌లో ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కేజ్రివాల్‌కు సూచించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అరవింద్ కేజ్రివాల్ ఓ నియంతలా మారిపోయారని ధ్వజమెత్తారు. నిర్ణయాలన్నీ ఏకపక్షంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాసంబంధమైన అంశాలను లేవనెత్తినందుకే తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారని విమర్శించారు. తాను ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఎప్పటికీ వెనకాడబోనని తేల్చి చెప్పారు. పార్టీ నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ.. ఆదివారం రాత్రి ఆమ్ ఆద్మీ పార్టీ వినోద్ బిన్నీని ఆ పార్టీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
ఐదు గంటలపాటు ధర్నా చేసిన అనంతరం వినోద్ కుమార్ బిన్నీ, తన ధర్నాను విరమిస్తున్నట్లు ప్రకటించారు. తను పార్టీ ముందు ఉంచిన డిమాండ్లను 10 రోజుల్లో అమలు చేయనట్లయితే తాను మళ్లీ ఇంతకంటే పెద్ద ఆందోళనకు దిగుతానని ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దలను బిన్నీ హెచ్చరించారు. ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనను నాలుగు రోజులపాటు నిరాహాదీక్ష చేయాలని అన్నా హాజారే సూచించారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కేజ్రివాల్ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోతోందని ఆయన ఆరోపించారు.
ఇది ఇలా ఉండగా అకాళిదళ్ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యేతోపాటు 31 మంది భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కార్యాలయం ముందు బైఠాయించారు. న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతీని మంత్రివర్గం నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. బిజెపి నాయకుడు హర్షవర్ధన్ నాయకత్వంలో ఆందోళన చేపట్టిన ఎమ్మెల్యేలు సోమనాథ్ భారతీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దీంతో కార్యాలయం నుంచి బయటికి వచ్చిన అరవింద్ కేజ్రివాల్, హర్షవర్ధన్‌తో మాట్లాడారు. అయితే భారతీని తొలగించేంతవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో పలువురు ఆఫ్రికన్ మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలు సోమనాథ్ భారతీపై వచ్చిన విషయ తెలిసిందే.












Click it and Unblock the Notifications