విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖపట్నం: లైట్ హౌస్‌లు ఎలా పనిచేస్తాయి, వీటిని ఎందుకు ఏర్పాటు చేశారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
లైట్ హౌస్

రాత్రి వేళల్లో సముద్రంలో కిలోమీటర్ల పొడవునా నౌకలకు దారి చూపేవి లైట్ హౌస్‌లు. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో వీటి గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.

అయితే, ఒకప్పుడు సముద్ర యానంలో ఇవి ప్రధా పాత్ర పోషించేవి. ఈ లైట్ హౌస్‌లు లేకపోతే నౌకలకు ఎటు వెళ్లాలో అర్థమయ్యేది కాదు.

మరోవైపు ఈ లైట్ హౌస్‌ల పైనుంచి సుదూర తీరాన్ని, ఆ తీరానికి అనుకుని ఉన్న పట్టణాల్ని, నగరాల్ని చూడటం మంచి అనుభూతినిస్తుంది.

ఇంతకీ ఈ లైట్‌ హౌస్‌లు ఎలా పనిచేస్తాయి? వీటిని దేని కోసం ఏర్పాటుచేశారు.

లైట్ హౌస్

'విశాఖలో 5 లైట్ హౌస్‌లు’

బ్రిటిష్ ఇండియాలో 1927లో లైట్‌ హౌస్ చట్టాన్ని ఆమోదించారు. 1947కు ముందు, మన దేశంలో కేవలం 17 లైట్‌ హౌస్‌లు మాత్రమే ఉండేవి.

కిరోసిన్, లిక్విడ్ ఎసిటలీన్ వాయువు ద్వారా ఈ లైట్‌ హౌస్‌లలో దీపాలు వెలిగించేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా సుమారు 200 లైట్‌ హౌస్‌లు నిర్మించారు.

వైజాగపటం (విశాఖపట్నం) తీర ప్రాంతం పొడవునా కొన్ని లైట్ హౌస్‌లు నిర్మించారు. వాటిలో కొన్ని కాలక్రమంలో కనుమరుగైపోగా, మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి.

“ప్రస్తుతం విశాఖలో ఐదు లైట్ హౌస్‌లు ఉన్నాయి. అందులో యారాడ కొండపై ఉన్న డాల్ఫిన్ లైట్ హౌస్, ఉడా పార్కు సమీపంలో ఉన్న ఈస్ట్ పాయింట్ లైట్ హౌస్, వన్ టౌన్ ఏరియాలో ఉన్న వైజాగపటం లైట్ హౌస్, కేజీహెచ్ ఆసుపత్రి దగ్గర్లోని ఇసుక కొండ లైట్ హౌస్, భీమిలి లైట్ హౌస్ ఉన్నాయి. ప్రస్తుతం పూర్తి స్థాయిలో డాల్ఫిన్ లైట్ హౌస్, పాక్షికంగా భీమిలి లైట్ హౌస్ పని చేస్తున్నాయి. మిగతా మూడింటిలో ఇసుక కొండ లైట్ హౌస్ దాదాపుగా శిథిలావస్థలో ఉండగా, వైజాగపటం లైట్ హౌస్‌కు ఉన్న చరిత్ర నేపథ్యంలో దానికి మరమ్మత్తులు చేసి పరిరక్షిస్తున్నారు. ఈస్ట్ పాయింట్ లైట్ హౌస్ తరుచూ సినిమాల్లో విశాఖ లైట్ హౌస్ అంటూ చూపిస్తారు. ప్రస్తుతం ఇది నిరుపయోగంగా ఉంది” అని విశాఖకు చెందిన విశ్రాంత నేవీ ఉద్యోగి ఫణిరాజు బీబీసీతో చెప్పారు.

లైట్ హౌస్

“యారాడ లైట్ హౌస్ వెలుగులు చూడాలంటే ఆర్కే బీచ్ రావాల్సిందే”

యారాడ కొండపై ఉన్న డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ ఇప్పటికీ సేవలను అందిస్తుంది. దీని వెలుగులు 32 నాటికల్ మైళ్ల వరకు ప్రసరిస్తాయి. ఒక నాటికల్ మైలు అంటే 1.852 కిలో మీటర్లు. అంటే సముద్రంలో దాదాపు 64 కిలోమీటర్ల వరకు డాల్ఫిన్ లైట్ హౌస్ వెలుగులు విరజిమ్ముతోందని చరిత్రకారుడు ఎడ్వర్డ్ పాల్ బీబీసీతో చెప్పారు.

ప్రకృతి విపత్తుల కారణంగా ధ్వంసమైన ఈ లైట్ హౌస్‌ను 1957లో అప్పటి రవాణా శాఖ మంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి ప్రారంభించారు. ఇప్పటికీ సేవలందిస్తున్న ఈ లైట్ హౌస్ చరిత్రను ఎడ్వర్డ్ పాల్ బీబీసీకి వివరించారు.

“ఈ లైట్ హౌస్‌ను 1873లో యారాడ కొండపై ఉన్న ఒక సమతల ప్రాంతంపై సముద్ర మట్టానికి 640 అడుగుల ఎత్తులో నిర్మించారు. కానీ 1876లో వచ్చిన తుపానులో అది పూర్తిగా ధ్వంసమైంది. ఆ తర్వాత మళ్లీ 1957లో డాల్ఫిన్ నోస్‌పై శాశ్వత ప్రతిపాదికన లైట్ హౌస్ నిర్మించారు. ఆ తర్వాత రకరకాలైన మరమ్మత్తులకు గురై, ప్రస్తుతం ఇది విశాఖలో పని చేస్తున్న ఏకైక లైట్ హౌస్‌గా మారింది. ప్రస్తుతం ఈ లైట్‌హౌస్ 32 నాటికల్ మైళ్ల పరిధిలో నౌకలకు మార్గనిర్దేశం చేస్తుంది”అని ఎడ్వర్డ్ పాల్ చెప్పారు.

లైట్ హౌస్

’10 సెకన్లకు ఒకసారి లైటింగ్’

“ప్రస్తుతం ఈ లైట్‌ హౌస్‌ నాలుగు అంతస్తులలో ఉంది. చిన్న చిన్న మెట్లపై రౌండ్‌గా తిరుగుతూ సందర్శకులు, సిబ్బంది లోపలికి వెళ్లి దీని పైభాగానికి చేరుకుంటారు. నాలుగో అంతస్తులో రింగు రింగులుగా ఉండే గట్టి గాజు చక్రం ఒకటి కనిపిస్తుంది. దీనినే రివాల్వింగ్ అప్టిక్ సిస్టమ్ అంటారు. ఇదే కాంతిని ప్రసరింప చేసే లైట్ హౌస్‌లోని ప్రధాన భాగం. ఇది తిరుగుతూ ప్రతి 10 సెకన్లకు ఒకసారి కాంతిని ప్రసరింప చేస్తుంది. సాయంత్రం 6 గంటలకు ఈ లైట్‌ను వెలిగిస్తారు. అయితే అందుకు రెండు గంటల ముందు నుంచి దీనికి సంబంధించిన పనులు మొదలవుతాయి”అని ఎడ్వర్డ్ పాల్ వివరించారు.

“ఇప్పుడు దీనిని డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్‌ అని పిలుస్తున్నాం. దీని అసలు పేరు బ్లాక్ మోర్స్ హిల్. 1801లో బ్రిటిష్ సైన్యానికి చెందిన కెప్టెన్ బ్లాక్ మోర్ ఈ కొండ మీద ఇల్లు కట్టుకుని ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. అయితే ఈ కొండ డాల్ఫిన్ నోస్‌ను పోలి ఉండటంతో... దీనికి డాల్ఫిన్ నోస్ అనే పేరు కాలక్రమంలో స్థిరపడింది. 1700 సంవత్సరంలోనే నౌకలను నడిపే వారికి రాత్రి వేళల్లో మార్గనిర్దేశం చేసేందుకు కొండపై ఒక బీకన్ లైట్ (దారి చూపేందుకు ఎత్తైన ప్రదేశంలో మంటతో కాంతిని ఏర్పాటు చేయడం) వెలిగించేవారు. మరోవైపు జెండాలతోనూ విశాఖ తీరం నుంచి వెళ్లి వచ్చే నౌకలకు దారి చూపే వ్యవస్థ ఉండేది. 1876లో తుపానుకు ఈ వ్యవస్థ మొత్తం దెబ్బతినడంతో, సముద్రం నుండి దాదాపు 10 కిలో మీటర్లు కనిపించే ఒక తాత్కాలిక రెడ్ బీకన్ లైట్ ఏర్పాటు చేశారు. ఇది కూడా కాలక్రమంలో ధ్వంసమయింది”అని తూర్పు నౌకదళం మాజీ ఉద్యోగి ఫణిరాజు చెప్పారు.

విశాఖలో ఉన్న మిగతా లైట్ హౌస్‌ల పరిస్థితిని కూడా చరిత్రకారుడు ఎడ్వర్డ్ పాల్ వివరించారు.

వన్‌టౌన్ ఏరియా లైట్ హౌస్

''1903లో వన్‌టౌన్ ఏరియాలో సెయింట్ అలోసియస్ స్కూల్ ముందు 59 అడుగుల ఎత్తున్న ఒక లైట్ హౌస్ నిర్మించారు. నౌకాశ్రయంలోకి నౌకల రాకపోకలకు సహాయపడే ఒక ట్రాన్సిట్ లైట్‌హౌస్‌గా ఇది ఉపయోగపడేది.

దాదాపు 20 కిలోమీటర్ల దురం వరకు ప్రతి 20 సెకన్లకు ఒకసారి దీని నుంచి లైటింగ్ వచ్చేది. ప్రస్తుతం కార్పోరేట్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కంటైనర్ కార్పోరేషన్ దీని బాగోగులు చూస్తోంది’’అని ఎడ్వర్డ్ చెప్పారు.

ఈస్ట్ పాయింట్ లైట్ హౌస్‌

'షూటింగుల లైట్ హౌస్’

''ఎర్రని, తెల్లని రంగుల రింగులతో కనిపించే ఈస్ట్ పాయింట్ లైట్ హౌస్‌ను షూటింగుల లైట్ హౌస్ అంటారు. బాలీవుడ్, టాలీవుడ్‌ సినిమాలతోపాటు ఇతర ప్రాంతీయ భాషల సినిమాలు, షార్ట్‌ఫిల్మ్‌లలో ఇది కనిపిస్తుంటుంది. ఇది వుడా పార్కు సమీపంలోనే ఉంటుంది. దాంతో విశాఖలో లైట్ హౌస్ అంటే ఇదే అనుకుంటారు. దీనిని 1959లో నిర్మించారు. ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉంది’’అని ఎడ్వర్డ్ చెప్పారు.

'ఇసుక కొండ లైట్ హౌస్’

''రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రాయల్ నేవీ ద్వారా లైట్ బీకన్‌ ఒకటి నిర్మించారు. దీన్ని 1966లో లైట్‌హౌస్‌గా మార్చారు. కింగ్ జార్జ్ హాస్పిటల్ ప్రక్కనే ఉన్న ఇసుక కొండపై తీర ప్రాంతానికి సమీపంలో దీన్ని నిర్మించారు. ఇది అప్పటి లైట్ టెక్నాలజీతో ఏర్పాటు చేసింది. దీనిని ఆ తర్వాత ఎప్పుడూ అప్‌గ్రేడ్ చేయలేదు. ప్రస్తుతం ఇది పూర్తి శిథిలావస్థకు చేరుకుంది’’అని ఎడ్వర్డ్ వివరించారు.

భీమిలి లైట్ హౌస్

భీమిలి లైట్ హౌస్

''బ్రిటిష్ పాలనా సమయంలోనే సముద్ర ఎగుమతులు, దిగుమతులకు ఇబ్బందులు తలెత్తకుండా భీమిలి వచ్చి వెళ్లే ఓడల కోసం 1854లో భీమిలి లైట్ హౌస్‌ను ఏర్పాటు చేశారు. దీని ఎత్తు 36 అడుగులు మాత్రమే. ఇది తక్కువ ఎత్తు కావడంతో నావికులకు మార్గనిర్దేశం చేయడంలో ఇబ్బందులు ఏర్పడేవి. దీని సేవలు పెద్దగా ఉపయోగపడలేదు.

ప్రస్తుతం దీని సేవలు వేటకు వెళ్లే మత్స్యకారులకు పరిమితంగా ఉపయోగపడుతున్నాయి. పదేళ్ల క్రితం వరకు కాకినాడ పోర్టు ఆధీనంలో ఉన్న ఈ లైట్‌హౌస్‌.. కేంద్ర ప్రభుత్వంలోని షిప్స్‌ అండ్‌ లైట్‌హౌసెస్‌ విభాగం ఆధీనంలోకి వెళ్లింది. దీంతో ఈ లైట్ హౌస్‌ను అధునికీకరించడంతో పాటు 100 అడుగుల ఎత్తు పెంచాలని ఈ విభాగం నిర్ణయించింది. అయితే ఇంకా అది అమలు కాలేదు’’అని ఎడ్వర్డ్ చెప్పారు.

ఫ్రెస్నెల్ లెన్స్

“ఫ్రెస్నెల్ లెన్స్ లెన్స్...ఇది లైట్ హౌస్‌ల కోసమే”

''తొలి రోజుల్లో తీరానికి సమీపంలో ఉన్న ఎత్తైన కొండలపై మంటలు వేసేవారు. పెద్ద పెద్ద దీపాలు వెలిగించేవారు. ఆ కాంతిని పెద్ద పెద్ద అద్దాల సహాయంతో.. తీరం ఎక్కడుందో నావికులకు తెలిపేందుకు ఉపయోగించేవారు. క్రమేణా వాటి స్థానంలో లైట్‌హౌస్‌లు వచ్చాయి. ప్రకాశవంతమైన కాంతిని ఇవ్వగలిగే అద్దాల వ్యవస్థను ఎత్తైన టవర్లపై ఏర్పాటు చేసి రాత్రిపూట నౌకలను మార్గనిర్దేశం చేసేవారు’’అని ఎడ్వర్డ్ వివరించారు.

“ఈ లైట్ హౌస్‌లలో వాడేవి ఫ్రెస్నెల్ లెన్స్ అంటారు. ఇవి ప్రకాశవంతమైన కాంతి పుంజాలను మెటల్ ఫ్రేముల్లో అమర్చిన గ్లాస్ ప్రిజమ్(త్రికోణాకారం కలిగిన గాజు) ద్వారా కాంతిని పదే పదే ప్రతిబింబించేలా చేస్తాయి. ఈ ప్రిజమ్‌లలో వక్రీభవించిన కాంతి సుదూర ప్రాంతాలకు ప్రసరిస్తుంది. ఈ టెక్నాలజీని ఫ్రెంచ్ ఇంజనీర్ అగస్టియన్ ఫ్రెస్నెల్.. లైట్ హౌస్‌ల కోసమే ప్రత్యేకంగా కనిపెట్టారు. అందుకే దీనికి ఫ్రెస్నెల్ లెన్స్ అంటారు”అని అప్టిక్స్ ఫిజిక్స్‌లో 70 ఏళ్ల అనుభవమున్న ప్రొఫెసర్ శాంతమ్మ బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Visakhapatnam: How light houses work and why they are set up
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X