Vote from home: కర్ణాటకలో మొదలైన పోలింగ్: తొలి ఓటు వేసిన నటి
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచార తీవ్రతను పెంచాయి. విజయం సాధించడానికి నియోజకవర్గ స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తోన్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి.
భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు కర్ణాటకలో మకాం వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు, రామనగరల్లో రోడ్ షో, బహిరంగ సభలను నిర్వహించనున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ఇక్కడే మకాం వేశారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 80 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వయోధిక వృద్ధులు, దివ్యాంగులు, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల కోసం ఇంట్లో నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. దీనికోసం ప్రత్యేకంగా 12డీ ఫామ్‌ను ఎన్నికల అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వెలువడిన తరువాత అయిదు రోజుల్లో ఈ ఫామ్ 12డీ అందుబాటులోకి వచ్చాయి.
ఇవ్వాళ ఓట్ ఫ్రమ్ హోమ్ విధానం అమల్లోకి వచ్చింది. సీనియర్ నటి లీలావతి ఈ విధానాన్ని వినియోగించుకున్నారు. ఇంట్లో నుంచే ఓటు వేసే విధానంలో నమోదైన తొలి ఓటు ఆమెదే. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సుమారు 600లకు పైగా సినిమాల్లో నటించారామె. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో కొంతకాలంగా ఇంటివద్దే ఉంటోన్నారు. మంచానికే పరిమితం అయ్యారు.

తన కుమారుడు, నటుడు వినోద్ రాజ్‌తో కలిసి బెంగళూరు శివార్లలోని నెలమంగళ తాలూకా మైలనహళ్లిలో నివసిస్తోన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓట్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ మధ్యాహ్నం ఆమె నివాసానికి వెళ్లిన ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ పేపర్‌ను అందించారు. దీనికోసం ప్రత్యేకంగా ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications