విజయ్.. కింగా? కింగ్ మేకరా?
తమిళనాడులో పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 234 నియోజకవర్గాలకు నేడు ఒకే దశలో ఓటింగ్ జరుగుతోంది. డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకున్నాయి. టీవీకే పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలో నిల్చోవడం వల్ల త్రిముఖ పోరు ఏర్పడింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ హోరాహోరి పోరు నెలకొంది. ఈ పోరులో విజేత ఎవరనేది మే 4వ తేలుతుంది.
డీఎంకే ఈ ఎన్నికలను తమ పాలన, సంక్షేమ కార్యక్రమాలు, సమాఖ్య హక్కులపై ప్రజాభిప్రాయ సేకరణగా అభివర్ణిస్తోంది. అన్నాడీఎంకే అంతర్గత విభేదాలు, బీజేపీతో కూటమి మార్పుల తర్వాత రాజకీయంగా తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తోంది. మాస్ హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ యువ, పట్టణ ఓటర్లపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా తనను తాను నిలబెట్టుకోవచ్చని భావిస్తోన్నారు. ఈ ఎన్నికల్లో విజయ్ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది మే 4న తేలిపోతుంది.

కోళత్తూరు నుండి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తిరిగి పోటీలో ఉన్నారు. ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చెపాక్-తిరువల్లికేణి నియోజకవర్గం నుండి బరిలో నిలిచారు. విజయ్.. తిరుచిరాపల్లి తూర్పు, పెరంబూరు నియోజకవర్గాల నుండి రాజకీయ రంగప్రవేశం చేశారు. ఈపీఎస్ తన సొంత నియోజకవర్గం ఎడప్పాడి నుండి ఎన్నికల బరిలో దిగారు. ఆయన ప్రధాన ప్రత్యర్థి, మాజీ ముెఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం.. బోడినాయకనూర్ నుండి డీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్.. మైలాపూర్ నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తిరునల్వేలి నుండి సత్తూర్ నియోజకవర్గానికి మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో సత్తూర్ లో చతుర్ముఖ పోటీ నెలకొంది.
ఇవే కాకుండా తిరుచిరాపల్లి జిల్లా- శ్రీరంగం, తిరువారూర్ జిల్లా- మన్నార్ గుడి, నాగపట్టిణం జిల్లా- వేదారణ్యం, వేలూరు జిల్లా కాట్పాడి, రాణిపేట జిల్లా అరక్కోణం, కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూరు, కడలూర్ జిల్లా విరుధాచలం వంటి నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు ఏర్పడింది. తిరువారూర్.. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సొంత జిల్లా కావడం, శ్రీరంగం.. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన నియోజకవర్గం కావడం వల్ల వాటిపై అందరి చూపూ పడింది. చెన్నై సిటీ పరిధిలోని థౌజండ్ లైట్స్, టీ నగర్ వంటి స్థానాలు బహుముఖ పోటీ ఉంది.












Click it and Unblock the Notifications