మీ మొఖాలను కాస్త డెట్టాల్‌తో కడుక్కోండి- రెచ్చిపోయిన నిర్మల సీతారామన్..!!
హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు జరిపేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పట్టుబట్టిన ప్రతిపక్ష సభ్యులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొఖాలను డెట్టాల్ తో కడుక్కోవాలంటూ సూచించారు.
న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అదాని కంపెనీలు సుమారు 10 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ వెల్లడించిందీ రిపోర్ట్. ఈ నివేదిక దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది.
హిండన్ బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలంటూ ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టుతున్నాయి. పార్లమెంట్ ఉభయ సభలనూ స్తంభింపజేస్తోన్నాయి. ప్రధాని-అదాని భాయ్ భాయ్ అనే నినాదాన్ని లేవనెత్తాయి. వాటిని కేంద్ర ప్రభుత్వం తిప్పికొడుతోందే గానీ జేపీసీతో దర్యాప్తు జరిపించడానికి ససెమిరా అంటోంది. ప్రధాని మోదీ స్వయంగా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాం మొత్తం కుంభకోణాలమయం అంటూ ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు.

ప్రతిపక్షాలపై తాజాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ విరుచుకు పడ్డారు. ఘాటు వ్యాఖ్యలతో చెలరేగిపోయారు. తమపై విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ సభ్యులు తమ ముఖాలను కాస్త డెటాల్ తో కడుక్కోవాలని సూచించారు. కాంగ్రెస్ సభ్యులు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు. అవినీతికి ఆద్యులు కాంగ్రెస్ నాయకులేనని మండిపడ్డారు. బడ్జెట్ ప్రతిపాదనలపై సమాధానాలను ఇచ్చారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఇంధన ధరలను తాము రెండుసార్లు తగ్గించామని గుర్తు చేశారు.

దీనికి విరుద్ధంగా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరించాయని, వాటి రేట్లను తగ్గించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవలే డీజిల్‌పై వ్యాట్‌ను మూడు రూపాయల మేర పెంచారని గుర్తు చేశారు. ఇంధనంపై వ్యాట్‌ను పెంచిన ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో పంజాబ్, కేరళ ఉన్నాయని అన్నారు. పంజాబ్ ఇటీవలే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచిందని, కేరళ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై సామాజిక భద్రతా సెస్‌ను ప్రకటించిందని నిర్మల సీతారామన్ అన్నారు.












Click it and Unblock the Notifications