'దేశ విద్రోహులే' : మోడీ కామెంట్స్ తో రూట్ మార్చిన ఆర్ఎస్ఎస్
న్యూఢిల్లీ : దళితులపై దాడులకు పాల్పడేవారిని దేశ విద్రోహులు అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలతో గొంతు కలిపింది ఆర్ఎస్ఎస్. మోడీ వ్యాఖ్యలపై స్పందించిన పలువురు ఆర్ఎస్ఎస్ నేతలు.. దళితులపై దాడుల ద్వారా దేశ సమగ్రతను దెబ్బతీయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషి దీనిపై స్పందిస్తూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజలపై అరాచాకాలకు పాల్పడడం కేవలం చట్టవిరుద్దం మాత్రమే కాదని, అది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే అని అభిప్రాయపడ్డారు.

ఇలాంటి దాడులను సమాజం మొత్తం ఖండించాల్సిన అవసరముందని.. పాలక వర్గాలు కూడా ఇలాంటి వ్యక్తులు లేదా సమూహాల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు జోషి. మరోవైపు గో సంరక్షణ గురించి దేశ మొత్తం ఓ విస్త్రుత ప్రచారం చేపట్టాలనే యోచనలో ఉంది విశ్వహిందూ పరిషత్ సమితి. అయితే గో సంరక్షణ పేరుతో అరాచాకాలతో పాటు కొంతమంది దాన్నో వ్యాపారంగా మలుచుకుంటున్నారన్న మోడీ వ్యాఖ్యలపై వీహెచ్.పీ కొంత గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త రాకేష్ సిన్హా మాట్లాడుతూ.. దళితులపై దాడులకు పాల్పడేవారిని దేశ విద్రోహులుగా ముద్ర వేయడం ద్వారా దళిత ప్రజలను కూడా ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని భావనలో తమ కార్యకలాపాలు కొనసాగనున్నట్లు ప్రకటించారు.
గుజరాత్ లోని ఉనా, గిర్ సోమ్ నాథ్ లలో దళితులపై జరిగిన దాడులను మొదట ఖండించింది తామే అని చెప్పుకొచ్చారు రాకేష్ సిన్హా. దళితులపై దాడులు కేవలం వారిపై జరుగుతున్న దాడులుగానే పరిగణింపబడవని, వాటిని హిందూ సమాజంపైన దాడులుగా చూడాల్సి ఉంటుందన్నారు. అయితే శాంతియుత పద్దతిలో గో సంరక్షణకు సంబంధించి విస్త్రుత ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.
దేశం మొత్తం మీద 30వేల కబేళాలు అక్రమంగా నడుస్తాయని.. వీటికి వ్యతిరేకంగా యాంటీ స్లాటర్ ఉద్యమాన్ని తీసుకొస్తామని చెప్పుకొచ్చారాయన.












Click it and Unblock the Notifications