అవిశ్వాసానికి మద్దతు ఇవ్వం: టిడిపికి రాజ్‌నాథ్ షాక్
ఢిల్లీ: సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల అవిశ్వాస తీర్మానం నోటీసులకు మద్దతు ఇవ్వబోమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణపై కాకుండా ఇతర అంశాలపై అవిశ్వాసం ప్రతిపాదిస్తే మద్దతు ఇస్తామని బిజెపి చెప్పిన నేపథ్యంలో ఆ పార్టీ మద్దతు పొందడానికే అన్నట్లు అవినీతి, ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ అవిశ్వాసానికి నోటీసు ఇచ్చింది. తాము అవిశ్వాసానికి మద్దతు ఇవ్వబోమని రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు.
తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణ అంశం దీర్ఘకాలికంగా ఉన్న డిమాండ్ అని రాజ్‌నాథ్ అన్నారు. యూపిఏ ప్రభుత్వం విభజనపై ముందుకెళితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాము రాజకీయ ప్రయోజనాలు కోరుకోవడం లేదని ఆయన తేల్చి చెప్పారు. విభజన సమయంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని అన్నారు. పార్లమెంటుకు బిల్లు వస్తే మద్దతు ఇస్తామని చెప్పారు.

విభజనపై కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరి వల్లే సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు నెలకొన్నాయని అన్నారు. సీమాంధ్ర ప్రజల డిమాండ్లను పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. యూపిఏ ప్రభుత్వం శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని రాజ్‌నాథ్ ప్రకటించారు. అదే సమయంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. రెండు ప్రాంతాలకు ప్రయోజనాలను కాపాడతామని, ఇరు ప్రాంతాలకు న్యాయం కలిగేలా చూస్తామని అన్నారు.
ఒక వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంలో విఫలమైనట్లయితే.. వచ్చే ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత తమ ప్రభుత్వం తెలంగాణను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. అదే సమయంలో సీమాంధ్ర సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. ముందు నుంచీ బిజెపి తెలంగాణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తాము పది జిల్లాల తెలంగాణకే కట్టుబడి ఉన్నామని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతంలోని ఆందోళనలను తేలిగ్గా తీసుకోవడం లేదని, బిల్లు మా ముందుకు వస్తే సీమాంధ్ర ప్రాంత సమస్యలకు పరిష్కారం సూచిస్తామని చెప్పారు.
తెలంగాణపై కాంగ్రెసులోనే ఏకాభిప్రాయం లేదని, ముందుగా కాంగ్రెసు తన పార్టీలో ఏకాభిప్రాయం సాధించుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు తేలిగ్గా తీసుకుంటోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications