Ayodhya verdict: అయిదెకరాల ప్రత్యామ్నాయ స్థలానికి విలువ లేదు.. సున్నీ వక్ప్ బోర్డు
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం వినిపించిన తీర్పు సంతృప్తికరంగా లేదని సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ వెల్లడించారు. సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించడానికి ప్రతిపాదించిన అయిదు ఎకరాల స్థలానికి ఎలాంటి విలువ లేదని అన్నారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల తమకు గౌరవం ఉందని, అయినప్పటికీ.. పున:సమీక్షకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తామని అన్నారు.

రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు హిందువులకు అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని, ముస్లింలకు ప్రత్యామ్నాయంగా అయిదెకరాల స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ సారథ్యంలోని అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. రంజన్ గొగొయ్ సహా న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ ఏ బొబ్డె, చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ ఏ నజీర్ తీర్పు పాఠంపై సంతకాలు చేశారు.
తీర్పు వెలువడిన అనంతరం సున్నీ వక్ఫ్ బోర్డు తరపు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ సుప్రీంకోర్టు భవనం వెలుపలు విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పుపై తమకు గౌరవం ఉందని, అయినప్పటికీ.. ఇది తమను నిరాశకు గురి చేసిందని చెప్పారు. దీనిపై పున:సమీక్షకు వెళ్లేలా నిర్ణయాన్ని తీసుకుంటామని అన్నారు.
తీర్పుపై భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాక్ష్యాధారాలన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. సమగ్ర సాక్ష్యాధారాలను తాము న్యాయస్థానానికి అందజేశామని అన్నారు.












Click it and Unblock the Notifications