వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్టులకు ఉచితంగా కోవిడ్‌ చికిత్స అందిస్తాం, సద్వినియోగం చేసుకోండి-ఏపీ పోలీసులు: ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మావోయిస్టులకు చికిత్స

మావోయిస్టులకు కోవిడ్ చికిత్స అందిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేసినట్లు ఈనాడు దిన పత్రిక ఒక వార్తా కథనం ప్రచురించింది.

'ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో తిరుగుతున్న మావోయిస్టుల్లో చాలామంది కోవిడ్‌ లక్షణాలతో బాధ పడుతున్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం ఉంది.

గాలికొండ, కోరుకొండ, పెదబయలు, కటాఫ్‌ ఏరియాలో దళ సభ్యుల్లో కొందరు ఒళ్లు నొప్పులు, ఆయాసంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది.

కరోనా బారినపడిన వారికి సరైన సమయంలో, సరైన చికిత్స అందకపోవడం వల్ల చనిపోవడం చూస్తున్నాం.

మావోయిస్టులుగానీ, వారి కుటుంబ సభ్యులు గానీ కరోనా లక్షణాలతో బాధపడుతుంటే, వెంటనే సమాచారం ఇస్తే ఉచితంగా చికిత్స అందేలా ఏర్పాటు చేస్తాం' అని విశాఖ గ్రామీణ జిల్లా పోలీసులు ప్రకటించారు.

ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

సరైన నిర్ణయం తీసుకుని మమ్మల్ని ఆశ్రయిస్తే మీ చికిత్సకు, మీ ప్రాణాలకు మాది భరోసా అంటూ హామీ ఇచ్చారు.

కోలుకున్నాక మీరు, మీ కుటుంబ సభ్యులు హాయిగా ఇంటికి వెళ్లడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి కూడా సోమవారం ఇదే తరహాలో విజ్ఞప్తి చేశారని ఈనాడు వివరించింది.

తెలంగాణలో లాక్‌డౌన్‌పై క్యాబినెట్ భేటీ

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ, లాక్ డౌన్‌పై చర్చ

తెలంగాణలో లాక్‌డౌన్ విధించాలని వస్తున్న డిమాండ్లపై చర్చించడానికి ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం అవుతోందని ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కరోనా మహమ్మారి రెండో దశలో పెనుతుఫానులా విరుచుకుపడుతుండడంతో రాష్ట్రంలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి.

వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వం పలు ఆంక్షలు విధించినా ప్రయోజనం కనిపించడం లేదు.

ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రాత్రి కర్ఫ్యూను 15 వరకు పొడిగించింది. అయినా కోవిడ్‌ ఉద్ధృతి తగ్గడం లేదు.

ఇప్పటికే పలు రాష్ట్రాలు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో.. వైర్‌సను కట్టడి చేయాలంటే రాష్ట్రంలోనూ లాక్‌డౌన్‌ విధించాల్సిందేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో కేసీఆర్‌ సర్కారు కూడా లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం ప్రత్యేకంగా భేటీ కాబోతోంది.

దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అనేక రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ ప్రకటించాయి.

దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్‌ విధించాయి.

తెలంగాణలో రెండు వారాలుగా రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుండగా, ఏపీలో పాక్షిక లాక్‌డౌన్‌ అమలవుతోంది.

లాక్‌డౌన్‌ వల్ల ప్రజాజీవనం స్తంభించడంతోపాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదముందని ఈ నెల 6న సీఎం కేసీఆర్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.

మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించినా కరోనా పెద్దగా తగ్గలేదని, సరైన ఫలితాలూ రాలేదనే నివేదికలు ప్రభుత్వానికి అందాయి.

ఈ నేపథ్యంలోనే రాత్రి కర్ఫ్యూను ఈ నెల 15 వరకూ పొడిగించారు. కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు ఇప్పటికే స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నాయి.

కరోనా వైరస్‌ సంక్రమణ గొలుసుకట్టును తెంచడానికి లాక్‌డౌనే సరైన మార్గమని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై లాక్‌డౌన్‌ విధిస్తే కలిగే లాభనష్టాలపై, ధాన్యం కొనుగోళ్లపై లాక్‌డౌన్‌ ప్రభావంపైనా చర్చించనుంది'' అని ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం తెలిపిందని ఆంధ్రజ్యోతి వివరించింది.

టీకా కోసం ఏపీ గ్లోబల్ టెండర్లు

అవసరమైతే విదేశాల నుంచి టీకా కొనుగోలు- ఏపీ

ఏపీలో టీకా డోసుల కొరత తీర్చేందుకు అవసరమైతే గ్లోబల్ టెండర్లకు కూడా వెళ్తామని ప్రభుత్వం ప్రకటించినట్లు సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోవిడ్‌ నుంచి విముక్తి కల్పించేందుకు విదేశాల్లో ఎక్కడైనా వ్యాక్సిన్‌ లభిస్తే కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకోసం గ్లోబల్‌ టెండర్లకు వెళ్లాలని సీఎం జగన్‌ ఆదేశించారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు.

వ్యాక్సిన్‌ లభ్యత ఉంటే ఇప్పటికిప్పుడు రూ. 1,600 కోట్లు చెల్లించేందుకు రాష్ట్ర సర్కారు సన్నద్ధంగా ఉందన్నారు.

సోమవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. వ్యాక్సిన్‌ లభ్యత మొత్తం కేంద్రం చేతుల్లోనే ఉందని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ కూడా దాఖలు చేసిందని తెలిపారు.

అందుకే కేంద్రం నుంచి అనుమతులన్నీ తీసుకుని బయట దేశాల నుంచి వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలని కూడా చూస్తున్నామన్నారు.

వ్యాక్సిన్‌ దొరికితే నెలలోగా అందరికీ వేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. దీంతో పాటు కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను ఇంకోచోట ఎక్కడైనా వేరే యూనిట్లలో ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నా పరిశీలిస్తున్నామని చెప్పారు.

ఉన్న వ్యాక్సిన్‌ను ముందుగా రెండో డోసు వారికి, ఆ తర్వాత 45 ఏళ్లు దాటిన వారికి మొదటి డోసు వేసేలా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

వ్యాక్సిన్‌పై ఉన్న వాస్తవాలను వివరిస్తూ తాము చేస్తున్న విజ్ఞప్తిని ప్రజలు అర్థం చేసుకుంటారని ఆయన అన్నారని సాక్షి వివరించింది.

టీకా విధానంలో మీ జోక్యం తగదు-సుప్రీంకు కేంద్రం

టీకా విధానంలో మీ జోక్యం తగదు-సుప్రీంతో కేంద్రం

వ్యాక్సినేషన్ విధానంలో సుప్రీంకోర్టు జోక్యం తగదని కేంద్రం సుప్రీంకోర్టుకు సూచించినట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

దేశంలో అమలవుతున్న కరోనా వ్యాక్సినేషన్‌ విధానాన్ని వైద్య నిపుణుల మార్గనిర్దేశంలో, పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో రూపొందించామని.. ఈ విధానంలో న్యాయవ్యవస్థ జోక్యం ఎంతమాత్రం అవసరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రప్రభుత్వం తెలిపింది.

ఈ విషయంలో కార్యనిర్వాహక వ్యవస్థకు ఉన్న సామర్థ్యాన్ని, విజ్ఞతను విశ్వసించాలని పేర్కొన్నది.

వ్యాక్సినేషన్‌ విధానంలో న్యాయవ్యవస్థ సదుద్దేశంతోనే అయినప్పటికీ తొందరపాటుతో జోక్యం చేసుకుంటే.. అది ఊహించలేని, అవాంఛనీయ పరిణామాలకు దారి తీయవచ్చని హెచ్చరించింది.

దేశంలో కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటం, నియంత్రణ అంశాల్ని సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టుకు ఈ మేరకు కేంద్రం ఆదివారం రాత్రి 218 పేజీల అఫిడవిట్‌ను సమర్పించింది.

నిపుణులతో, రాష్ట్రప్రభుత్వాలతో, వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలతో పలుమార్లు చర్చలు జరిపిన తర్వాతనే వ్యాక్సినేషన్‌ విధానాన్ని రూపొందించామని కేంద్రం ఈ అఫిడవిట్‌లో తెలిపింది.

దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ ప్రజలందరికీ ఉచితంగా టీకాలను అందజేస్తామని ప్రకటించాయి కాబట్టి.. టీకా కంపెనీలు టీకాలకు ధరలను నిర్ణయించినప్పటికీ.. అది ప్రజలపై భారం కాబోదని కేంద్రం పేర్కొంది.

టీకా తయారీ కంపెనీలతో తాము జరిపిన చర్చల కారణంగానే, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకే ధరతో వ్యాక్సిన్లను అందించటానికి అవి అంగీకరించాయని కేంద్రం అఫిడవిట్‌లో వెల్లడించిందని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
We will provide free Covid treatment to the Maoists, avail it-AP police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X