3 ఉచిత సిలిండర్ల పథకంలో మార్పులు?
3 Free LPG Cylinders: ఏపీలో ఎన్నికల్లో అధికారంలో రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలోని తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ఇచ్చిన హామీల్లో కీలకమైనది- సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్ల పథకం.
అధికారంలోకి వచ్చి నెలన్నర రోజులు దాటింది కూటమి ప్రభుత్వానికి. ఇంకా దీనిపై ఎలాంటి కసరత్తు చేయలేదు. అదిగో ఇదిగో అంటూ దాటవేస్తూ వస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ప్రస్తుతానికి అమల్లోకి వచ్చింది ఒక్క పింఛన్ పెంపు మాత్రమే. మిగిలినవన్నీ కార్యరూపం దాల్చట్లేదు.

ఈ పరిణామాల మధ్య మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్నే ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఉచితంగా మూడు ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్లు అనే కాన్సెప్ట్‌ను తెరమీదికి తీసుకొచ్చింది. అందరికీ దీన్ని వర్తింపజేయట్లేదు. టీడీపీ కూటమి ఇచ్చిన హామీతో పోల్చుకుంటే కీలక మార్పును ప్రతిపాదించింది.
సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లకు బదులుగా దానికి సమానమైన డబ్బులను అందజేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే- దీనికి కొన్ని ఆంక్షలను సైతం విధించింది. 2.5 లక్షల రూపాయల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకే ఈ డబ్బులను అందజేస్తామని స్పష్టం చేసింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్.. స్వయంగా దీనిపై ఓ ప్రకటన చేశారు. తన సొంత నియోజకవర్గం బారామతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. లాడ్లీ బెహన్ పథకాన్ని తాము నిలిపివేయట్లేదని, మూడు సిలిండర్ల డబ్బులను అక్కచెల్లెమ్మలకు అందజేస్తోన్నామని అన్నారు.
లాడ్లీ బెహన్ పథకం కింద సంవత్సరానికి 46,000 కోట్ల రూపాయలను వ్యయం చేస్తోన్నామని అజిత్ పవార్ చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుటి ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాము కాకుండా మరే పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ పథకం కొనసాగకపోవచ్చని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications