సుప్రీంకోర్టులో విచారణ వేళ..: ఏక్‌నాథ్ షిండే కీలక నిర్ణయం: ముంబై ప్రయాణం వాయిదా
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం పతనం బల పరీక్షలను ఎదుర్కొనబోతోంది. శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమికి ఒక్క రోజే గడువు మిగిలివుంది. బల నిరూపణ కోసం ప్రత్యేకంగా సభను సమావేశ పర్చాలంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి.. అసెంబ్లీ కార్యదర్శికి ఈ ఉదయం లేఖ రాశారు. గురువారం ఉదయం 11 గంటలకు సభ సమావేశ పర్చడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలంటూ ఆదేశించారు.
గవర్నర్ రాసిన లేఖకు వ్యతిరేకంగా శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఉదయం ఆయన పిటీషన్‌ను దాఖలు చేశారు. శివసేన ఉద్ధవ్ వర్గం తరఫున ఈ పిటీషన్‌పై సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలను వినిపిస్తోన్నారు. దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టనుంది.
గురువారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో బల నిరూపణ ఏర్పాటయిన నేపథ్యంలో ఇవ్వాళే పిటీషన్‌ను విచారించాలంటూ మను సింఘ్వీ బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై బెంచ్ సానుకూలంగా స్పందించింది. ఈ సాయంత్రం 5 గంటలకు వాదనలు మొదలయ్యాయి. బల నిరూపణ నేపథ్యంలో అన్ని పార్టీలు.. తమ తమ శాసన సభ్యులతో సమావేశమౌతున్నాయి. మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమిలో భాగస్వామ్యమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేతో సమావేశమైంది కూడా.

ఈ పరిణామాల మధ్య తిరుగుబాటుదారులకు నాయకత్వాన్ని వహిస్తోన్న శివసేన సీనియర్ నాయకుడు, మంత్రి ఏక్‌నాథ్ షిండే కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ముంబైకి తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. గురువారం ఉదయం నేరుగా శాసనసభకు చేరుకుంటామని తెలిపారు. గువాహటిలోని ర్యాడిసన్ బ్లూ వద్ద విలేకరులకు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ లోగా సుప్రీంకోర్టు నిర్ణయం కూడా వెలువడుతుందని, దానికి అనుగుణంగా ముంబై వెళ్తామని అన్నారు.
షెడ్యూల్ ప్రకారం.. ఇవ్వాళే వారంతా గువాహటి నుంచి గోవాకు చేరుకోవాల్సి ఉంది. ఈ మేరకు స్పైస్‌జెట్ విమానంలో టికెట్లను కూడా బుక్ చేసుకున్నారు. గోవాలోని తాజ్ కన్వెన్షన్ హోటల్‌లో మొత్తం 71 గదులను తిరుగుబాటు ఎమ్మెల్యేలు బుక్ చేశారు. సరిగ్గా బల నిరూపణ సమయానికి గోవా నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకోవాలనేది వారి ముందస్తు ప్రణాళిక. సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో గువాహటిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. గోవాకు బదులుగా నేరుగా ఇక్కడి నుంచే ముంబై వెళ్తామని షిండే చెప్పారు.












Click it and Unblock the Notifications