కరోనాలోనూ కుమ్మేశారు: బెంగాల్ ఏడో దశలో భారీ పోలింగ్ -కోల్‌కతాలో అత్యల్పం -దీదీపై నడ్డా ఫైర్
కరోనా వైరస్ విజృంభిస్తున్నా పశ్చమ బెంగాల్ లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన ఏడవ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 వరకు కొనసాగింది. కాగా, ఈసారి కూడా పోలింగ్ శాతం భారీగా నమోదైంది..
ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం, సాయంత్రం 5 గంటల సమయానికే పోలింగ్ శాతం 75.06గా ఉంది. రాత్రి తొమ్మిది గంటల తర్వాత పూర్తి లెక్కలు కలిపితే, ఏకంగా 81.05 శాతం ఓటింగ్ నమోదైందని అధికారవర్గాలు వెల్లడించాయి. మొత్తం 34 నియోజకవర్గాల్లోని 11,376 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరిగింది. కోల్ కతా సిటీలో మాత్రం అత్యల్పంగా 60.03 శాతం ఓటింగ్ నమోదైంది.

ఏడో దశ పోలింగ్‌లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆమె తన ఓటు వేశారు. కాలుకు గాయం కారణంగా గత నెలరోజులకు పైగా వీల్ చైర్‌లోనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మమతాబెనర్జి.. ఇవాళ ఓటేసేందుకు కూడా వీల్ చైర్‌లోనే పోలింగ్ బూత్‌కు వచ్చారు. ఓటేసి బయటికి వచ్చిన అనంతరం ఆమె వీల్ చైర్‌లో కూర్చునే అభిమానులకు విక్టరీ సింబల్ చూపించారు. కాగా,
కరోనా నేపథ్యంలో ఈసీ విధించిన షరతులకు లోబడి బీజేపీ వ్యవహరించిందని, మమత నేతృత్వంలోని టీఎంసీ మాత్రం అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. బెంగాల్ లో చివరి విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. అనంతరం మే 2న ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.












Click it and Unblock the Notifications