West Bengal Opinion Poll 2021: మమతా బెనర్జీకే అధికారం కానీ, బీజేపీ భారీ షాక్
కోల్‌కతా: స్వాతంత్ర్యం అనంతరం అనేక దశాబ్దాల వామపక్షాల పాలన అనంతరం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పదేళ్ల క్రితం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధికారంలోకి వచ్చింది. వరుసగా రెండు సార్లు విజయాలు నమోదు చేసిన మమతా బెనర్జీ.. మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర కసరత్తులే చేస్తున్నారు. అయితే, బీజేపీ రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది అధికార టీఎంసీకి.

మళ్లీ మమతా బెనర్జీ టీఎంసీదే అధికారం
కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగున్న తరుణంలో టైమ్స్ నౌ-సీ ఓటర్ ఓపీనియన్ పోల్ అంచనాలను విడుదల చేసింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీనే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. అయితే, రాష్ట్రంలో టీఎంసీ తర్వాత అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించనున్నట్లు పేర్కొంది.

51 సీట్లను కోల్పోనున్న టీఎంసీ.. బీజేపీ ట్రిపుల్ డిజిట్..
టీఎంసీ ఈ ఎన్నికల్లో 160 స్థానాల్లో విజయాలను నమోదు చేయనుందని ఓపీనియన్ పోల్ పేర్కొంది. 2016 ఎన్నికల్లో(211) కంటే ఇది 51 సీట్లు తక్కువ కావడం గమనార్హం. అదే సమయంలో 2016లో కేవలం మూడు స్థానాల్లోనే గెలుపొందిన బీజేపీ.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 112 సీట్లలో సీట్లలో విజయాలను నమోదు చేస్తుందని వెల్లడించింది. ఇక లెఫ్ట్ ఫ్రంట్-కాంగ్రెస్-ఇండియన్ సెక్యూలర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) కూటమి 22 స్థానాలతో మూడోస్థానంలో నిలవనుందని తెలిపింది.

టీఎంసీకి పోటీగా ఓటు షేర్ పెంచుకున్న బీజేపీ
ఆసక్తికరంగా టీఎంసీ, బీజేపీల మధ్య ఓట్ల శాతంలో తేడా చాలా తక్కువగా ఉంది. 2021 ఎన్నికల్లో టీఎంసీకి 42.1 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉండగా, బీజేపీకి 37.4 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. 2016 ఎన్నికల కంటే టీఎంసీకి 2.8 శాతం ఓట్లు తక్కువగా రావడం గమనార్హం. ఇక బీజేపీ గత ఎన్నికల్లో 10.2 శాతం నుంచి ఈ ఎన్నికలకు 27.2 శాతం ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. ఇక లెఫ్ట్ ఫ్రంట్-కాంగ్రెస్-ఇండియన్ సెక్యూరలర్ ఫ్రంట్ కూటమికి ఈ ఎన్నికల్లో 13 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

బీజేపీ కూటమికి 104-120 సీట్లు..
రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గానూ 152-168 నియోజకవర్గాల్లో విజయం నమోదు చేసి టీఎంసీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇక బీజేపీ కూటమి 104-120 స్థానాల్లో విజయం సాధించనుంది. లెఫ్ట్ ఫ్రంట్-కాంగ్రెస్ కూటమి 18-26 స్థానాలకు పరిమితం కానుంది.

మమతా బెనర్జీ సీఎంగా ఓకే..
మార్చిలో మొత్తం 17,890 మందిని సర్వే చేయగా.. బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ఉండాలని 55 శాతం మంది కోరుకున్నారు. బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ కు 32.3 శాతం మద్దతు పలికారు. బీజేపీ నేతలు ముకుల్ రాయ్‌కి 6.5 శాతం మంది, సువేందు అధికారికి 1.3 శాతం మంది మద్దతిచ్చారు. బెంగాల్ ప్రభుత్వ పనితీరు చాలా బాగుందని 37 శాతం మంది తెలుపగా, బాగుందని 33.66 శాతం మంది, 24.4 శాతం మంది సంతృప్తికరంగా లేదని చెప్పారు. సీఎం మమతా బెనర్జీ పనితీరు చాలా బాగుందని 46 శాతం మంది చెప్పగా, 20.04 శాతం మంది అస్సలు బాగోలేదని చెప్పారు. ఇక ఎంఐఎం, అబ్బాస్ సిద్ధికీ పార్టీలు ముస్లిం ఓట్లను చీల్చే అవకాశం ఉందని 30 శాతానికిపైగా ప్రజలు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications