వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అంటే ఏంటి... ఇది కోవిడ్ రోగుల ప్రాణాలు కాపాడగలదా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ లఖ్‌నవూలోని బట్లర్ చౌరస్తా దగ్గర అంజలీ యాదవ్‌ నడిపే ఎస్ఎస్‌బీ ఫార్మస్యూటికల్స్‌లో ఆక్సిజన కాన్సంట్రేటర్ అమ్మడం లేదా అద్దెకివ్వడం చేస్తుంటారు.

కానీ, గత కొన్ని రోజులుగా నెలకు రూ.15 వేలకు అద్దెకు ఇచ్చిన ఆమె 15- 20 మెషిన్లను జనం అసలు తిరిగివ్వాలనే అనుకోవడం లేదు. తిరిగి ఇవ్వడానికి బదులు వారంతా కాన్సంట్రేటర్ల బుకింగ్ మరింత పొడిగించారు.

oxygen concentrator

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో జనం ఊపిరి ఆడక రోడ్లమీద, ఆస్పత్రుల బయట చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుండడంతో, మనకూ ఇలాంటి పరిస్థితే వస్తుందేమోనని జనంలో ఒక విధమైన భయం వ్యాపించింది.

యూపీలో ప్రస్తుతం ఆక్సిజన్ సిలిండర్ల కొరత పెద్దగా లేదు. బ్లాక్‌లో సిలిండర్ రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు దొరుకుతోంది.

ప్రస్తుత సమయంలో ప్రాణాలు కాపాడుకోడానికి ప్రజలు ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ను పరిమిత సమయం పాటు ఉపయోగించే ఒక మంచి ప్రత్యామ్నాయంలా చూస్తున్నారు.

ఆక్సిజన్ సిలిండర్‌కు ప్రత్యామ్నాయమా

ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అంటే ఒక మెషిన్. అది గాలి నుంచి ఆక్సిజన్ సేకరిస్తుంది. ఈ ఆక్సిజన్‌ను ముక్కులోకి వెళ్లే ట్యూబ్ ద్వారా తీసుకుంటారు.

దీన్నుంచి అందే ఆక్సిజన్ 90 నుంచి 95 శాతం స్వచ్ఛంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆస్పత్రిలో పడకలకోసం జనం నానా ఇబ్బందులూ పడుతూ, ఆక్సిజన్ లేక రోడ్లపైనే చనిపోతున్న సమయంలో వారి ప్రాణాలు కాపాడ్డానికి 'ఆక్సిజన్ కాన్సంట్రేటర్' ఒక ముఖ్యమైన పాత్ర పోషించవచ్చని అంటున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ కూడా లక్ష ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కొనుగోలు చేయనున్నట్లు తన ట్వీట్ ద్వారా తెలిపారు. జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాలు కూడా భారత్‌కు సాయంగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు పంపిస్తున్నాయి.

చాలా ప్రైవేటు సంస్థలు, ప్రజలు కూడా అవసరమైనవారికి, ఆస్పత్రులకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ అందిస్తున్నారు.

ప్రాణం కాపాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్

"ఒకవేళ ఎవరికైనా ఆక్సిజన్ స్థాయి పడిపోతుంటే, వారిని ఆస్పత్రిలో చేర్పించేవరకూ మీరు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ సాయం తీసుకోవచ్చు" అని అపోలో ఆస్పత్రి పల్మనరీ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాజేష్ చావ్లా చెప్పారు.

ఆక్సిజన్ కాన్సంట్రేటర్ తీవ్రంగా జబ్బు పడిన, లేదా ఐసీయూలో చేరిన రోగుల కోసం కాదు. ఎందుకంటే, ఆ పరిస్థితిలోని రోగులకు ప్రతి గంటకూ ఎక్కువ స్థాయిలో ఆక్సిజన్ అవసరం ఉంటుంది. ఈ మెషిన్ అంత ఆక్సిజన్ ఉత్పత్తి చేయలేదు.

కరోనా వైరస్ ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. దాని వల్ల ప్రజల ఆక్సిజన్ స్థాయి పడిపోయే ప్రమాదం ఉంటుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌ను ఎక్కువగా 'క్రానిక్ అబ్‌స్ట్రాక్టివ్ పల్మనరీ' వ్యాధి ఉన్న వారికి ఆక్సిజన్ అందించడానికి ఉపయోగిస్తారు. కానీ, కరోనా కాలంలో దీని ప్రాధాన్యం విస్తృతంగా ఉంటోంది.

'క్రానిక్ అబ్‌స్ట్రాక్టివ్ పల్మనరీ డిసీజ్' అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన వ్యాధి. అది వచ్చిన వారికి శ్వాస తీసుకున్నప్పుడు గాలి ఊపిరితిత్తుల వరకూ చేరే దారి మూసుకుపోతుంది. రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి.

ఆక్సిజన్ కాన్సంట్రేటర్ సాయంతో చాలా మంది ఇళ్లలోనే చికిత్స చేయించుకోవచ్చని డాక్టర్ చావ్లా చెప్పారు.

"రోగి ఆక్సిజన్ స్థాయి 90 కంటే దిగువన ఉంటే వాళ్లు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఉపయోగించడం గురించి ఆలోచించాల్సి ఉంటుంది. రోగి ఆక్సిజన్ స్థాయిని 88 లేదా 89 వరకూ ఉండేలా చేయలేకపోతే అది ప్రభావం చూపడం లేదనే విషయం గుర్తించాలి" అని ఆయన తెలిపారు.

దేశంలో అవుట్ ఆఫ్ స్టాక్

కానీ, విద్యుత్‌తో నడిచే ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కొనుగోలు గురించి మీ దగ్గర డబ్బు ఉంటే, లేదా మార్కెట్లో సులభంగా దొరుకుతున్నప్పుడు మాత్రమే ఆలోచించాలి.

గంటకు 5 లీటర్ల ఆక్సిజన్ తయారుచేసే ఒక కాన్సంట్రేటర్ ధర దాదాపు 50 వేలు, గంటకు 10 లీటర్ల ఆక్సిజన్ తయారు చేసే మెషిన్ ధర లక్ష వరకూ ఉంటుందని డాక్టర్ చావ్లా చెప్పారు.

దీన్ని కొనడానికి జనం దగ్గర డబ్బు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆన్‌లైన్, ఆఫ్ లైన్ మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఈ మెషిన్ 'అవుట్ ఆఫ్ స్టాక్' అని ఉంది.

ఒక ఆన్‌లైన్ పోర్టల్‌లో గంటకు 7 లీటర్ల ఆక్సిజన్ తయారు చేసే కాన్సంట్రేటర్ ధర 76 వేల రూపాయలు ఉంది. కానీ దాని కోసం జులై వరకూ వేచిచూడాల్సి ఉంటుంది.

లఖ్‌నవూలోని అంజలీ యాదవ్ దగ్గర ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కొనుగోలు చేయాలని, క్యూలో ఉన్న కనీసం 500 మంది పేర్లు, నంబర్లు ఉన్నాయి.

వాటి స్టాక్ ఆమెకు అమెరికా నుంచి వస్తుంది. తర్వాత స్టాక్ మేలో వస్తుందని అంజలి చెప్పారు. కానీ, తమకు వచ్చే మెషిన్లు, ఆర్డర్ ప్రకారం వస్తాయా, లేక దానికంటే తగ్గిస్తారా అనేది తెలీదని చెప్పారు.

"మేం ఈ వ్యాపారంలో 8-9 ఏళ్ల నుంచి ఉన్నాం. ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందెప్పుడూ చూళ్లేదు" అంటున్నారు అంజలీ యాదవ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is an oxygen concentrator Can it save the lives of Covid patients
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X