వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఎండెమిక్' అంటే ఏంటి? కరోనావైరస్ ఎండెమిక్ అయితే ప్రమాదం తగ్గిపోతుందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కరోనా ఎండెమిక్ అంటే

భారత్‌లో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. దేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు "భారత్‌లో కోవిడ్-19 ఎండెమిక్ స్థితికి చేరుకుంటున్నట్లు అనిపిస్తోంది. అక్కడ వైరస్ వ్యాప్తి తక్కువ నుంచి మీడియం స్థాయి వరకూ ఉండచ్చు" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు.

భారత్‌లో కరోనా రోజువారీ కేసులు 40 వేలకు దగ్గరగా నమోదవుతున్న సమయంలో డాక్టర్ స్వామినాథన్ ఈ మాట అన్నారు.

ఆరోగ్య అంశాల నిపుణులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

అసలు 'ఎండెమిక్' అంటే ఏంటి? దానివల్ల ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? భారత్‌లో కరోనా వైరస్ ఎండెమిక్‌గా మారడం అంటే ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ మేం వైరాలజిస్టుల సాయంతో సమాదానాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం.

'ఎండెమిక్' అంటే…

దేశ ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ టీ జాకబ్ జాన్ 2020 మార్చ్‌లో ఒక సైన్స్ పేపర్ రాశారు. వాస్తవాల ఆధారంగా దేశంలో ఈ వ్యాధి పాండెమిక్ నుంచి ఎండెమిక్ కాగలదని అందులో ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎండెమిక్ అంటే ఏదైనా ఒక వ్యాధి ప్రజల మధ్య శాశ్వతంగా ఉండిపోయే స్థితి.

"ఎండెమిక్‌గా మారి, పూర్తిగా అంతం కాని ఎన్నో వ్యాధులు ఇప్పుడు మన మధ్యే ఉన్నాయి. అవి మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తూ ఎండెమిక్‌గా మారుతాయి. అంటే తట్టు, సాధారణ ఫ్లూ, హెపటైటిస్-ఎ, హెపటైటిస్-బి, మశూచి లాంటి వ్యాధులు. అవన్నీ ఎండెమిక్" అని డాక్టర్ జాన్ చెప్పారు.

కోవిడ్-19 జంతువుల నుంచి మనుషులకు వచ్చిందా లేదా అనేదానిపై పక్కా ఆధారాలు ఏవీ లభించలేదు. అలాంటప్పుడు కోవిడ్ ఎండెమిక్‌గా మారే అవకాశం ఉందా?

ఈ ప్రశ్నకు "ఇప్పుడు కరోనా వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తోంది. అంటే ఇది ఎండెమిక్‌గా మారుతోంది. ఇది ఒకప్పుడు జంతువుల నుంచి మనుషులకు వచ్చుండచ్చు. కానీ ఇప్పుడు అది మనుషుల్లో వ్యాపిస్తోంది" అని డాక్టర్ జాన్ సమాధానం ఇచ్చారు.

"పాండమిక్ అంటే ప్రజల్లో తీవ్రంగా సోకి, పెద్ద ఎత్తున వ్యాపించే ఒక వ్యాధి. ఇక ఎండెమిక్ అంటే జనాల మధ్యే ఉంటూ, ఎక్కువకాలం పాటు అలా ఉండిపోయే వ్యాధి. అది ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వ్యాపించవచ్చు".

కరోనా ఎండెమిక్ అంటే

భారత్‌లో కరోనా ఎప్పటికి ఎండెమిక్ కావచ్చు

ఈ ప్రశ్నకు వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ సమాధానం ఇచ్చారు.

"కరోనావైరస్ మెల్లమెల్లగా ఎండెమిక్‌గా మారుతోంది. ఎక్కువ వైరస్‌లు ఎండెమిక్‌గా మారుతాయి. అంటే, ప్రజల్లో ఆ వైరస్ వ్యాపించేకొద్దీ లేదంటే జనం వ్యాక్సీన్ వేయించుకునే కొద్దీ.. అది అంతకు ముందు వ్యాప్తి చెందినంత తీవ్రంగా ఉన్నట్టు అనిపించదు, తగ్గుతుంది" అని ఆయన చెప్పారు.

మనం బ్రిటన్‌నే ఉదాహరణగా తీసుకుంటే అక్కడ 60 శాతం మంది వ్యాక్సీన్ వేసుకున్నారు. అక్కడ వ్యాప్తి తీవ్రంగా లేదు. మరణాలు కూడా లేవు. కానీ వైరస్ మాత్రం ఉంది.

నిపుణులు మాత్రం భారత్ లాంటి భారీ జనాభా ఉన్న దేశంలో, కేవలం 15 శాతం మందికే వ్యాక్సీన్ వేసిన సమయంలో వైరస్ ఆరు నెలలు లేదా ఏడాదిలో ఎండెమిక్ కావచ్చని చెప్పడం తొందరపాటే అవుతుందని అంటున్నారు.

అయితే, ఎండెమిక్ వ్యాధులకు కూడా అవుట్‌బ్రేక్ రావొచ్చని, అది పాండమిక్ కూడా మారవచ్చని డాక్టర్ జాన్ చెబుతున్నారు.

"అది ప్రజల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. జనం అసలు జాగ్రత్తలేవీ పాటించకపోతే కేసులు వేగంగా పెరుగుతాయి. కానీ, ఇప్పుడు యావరేజి కేసులు 40 వేలుంది. అవి అంత వేగంగా పెరుగుతున్నట్లు కనిపించడం లేదు. అందుకే, నా వరకు భారత్‌లో కోవిడ్ ఎండెమిక్ స్టేజ్‌కు చేరుకుంటోందని చెప్పగలను" అన్నారు.

కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఎంత ఎక్కువగా ఉండచ్చు?

థర్డ్ వేవ్ తీవ్రంగా ఉంటుందని నాకు అనిపించడం లేదు. కానీ ఇది వైరస్. అందుకే కచ్చితంగా ఏదీ చెప్పలేం అంటున్నారు జాన్.

"దేశంలో కరోనా ఫస్ట్ వేవ్‌లో కేసులు వేగంగా పెరిగాయి. వ్యాప్తి హెచ్చు తగ్గులను పాండమిక్ అంటారు. అలాగే సెంకండ్ వేవ్‌లో కూడా కేసులు వేగంగా పెరిగి, మళ్లీ తగ్గడంతో అది పాండమిక్ అయ్యింది. థర్డ్ వేవ్‌లో కూడా కేసుల సంఖ్యలో పెరుగుదల వస్తే అది పాండమిక్ అవుతుంది. కానీ కరోనా ఈ వేవ్స్ మధ్య కొన్ని కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్త కేసులు రావడం ఆగలేదు దానిని ఎండెమిక్ అంటాం" అని ఆయన చెప్పారు.

"కరోనా వైరస్ 2020లో వచ్చినపుడు చాలామంది ఇది ఎండెమిక్ అవుతుందా, వచ్చి వెళ్లిపోతుందా అని ప్రశ్నించడం ప్రారంభించారు. అప్పట్లో నేను ఈ వైరస్ మనతోనే ఉంటుందని చెప్పాను. ఈ వ్యాధి ఎండెమిక్ కావచ్చని చెప్పాను" అన్నారు.

కరోనా ఎండెమిక్ అంటే

కరోనా ఎండెమిక్ అయితే, వ్యాక్సీన్ బూస్టర్ డోస్ అవసరం ఉంటుందా?

అమెరికా సహా కొన్ని దేశాలు ప్రజలకు కరోనా వ్యాక్సీన్ బూస్టర్ డోస్ వేయడం ప్రారంభించాయి. భారత్‌లో ప్రస్తుతం బూస్టర్ డోస్ ఇవ్వడం లేదు. కానీ ఇటీవల కోవాగ్జిన్ మూడో డోస్ ట్రయల్‌కు అనుమతులు ఇచ్చారు.

అలాంటప్పుడు, కరోనా ఎండెమిక్ అయి, దాని వ్యాప్తి రేటు కూడా తగ్గితే, బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

"అవును. తట్టు, ఇంకా ఎన్నో ఎండెమిక్ వ్యాధులు ఉన్నాయి. వాటికి టీకా వేయాలి. వ్యాధి పూర్తిగా అంతం అయ్యేవరకూ టీకాలు వేస్తుండాలి. డయాబెటీస్, బ్లడ్ ప్రెజర్ లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి, వృద్ధులకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వ్యాక్సీన్‌ వేయడం వల్ల వారు వైరస్‌ వల్ల తీవ్రంగా జబ్బు పడకుండా కాపాడవచ్చు" అని జాన్ చెప్పారు..

అంటే, టీకా, బూస్టర్ డోస్ ఎప్పుడూ అవసరమే.

కరోనా ఎండెమిక్ అంటే

భారత ప్రభుత్వం ఏం చెబుతోంది

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం చెబుతోంది. భారత్‌లో కేసుల సంఖ్య భారీగా తగ్గింది. చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ నుంచి ఉపశమనం లభించింది. కానీ, ప్రభుత్వ ఆరోగ్య అధికారులు మాత్రం థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని ప్రజలను పదే పదే హెచ్చరిస్తున్నారు. కొన్ని రిపోర్టుల్లో అక్టోబర్‌లో భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇప్పటివరకూ నమోదైన గణాంకాల ప్రకారం భారత్ కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం భారత్‌లో కోవిడ్ వల్ల 4 లక్షల 35 వేల మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is 'endemic'? Does the risk decrease if the coronavirus is endemic?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X