వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రం అంటే ఏంటి? మంత్రాలతో ధ్యానం చేస్తే మెదడుకు మేలు జరుగుతుందా? సైన్స్ ఏం చెబుతోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రోడ్డు మీద ధ్యానం చేస్తున్న అమ్మాయి

మనుషులు తమ చుట్టూ ఏర్పాటుచేసుకున్న వాతావరణం వారి మనస్సులకు ఏమాత్రం మేలు చేయడం లేదు.

నేడు మనుషులవి ఉరుకుల పరుగుల జీవితాలు. లక్ష్యాలను జయించే పనిలో ప్రపంచమంతా పరుగులు తీస్తోంది. కలలను సాకారం చేసుకోవడానికి అంచనాలను అందుకోవడానికి రేసు గుర్రంలా మనుషులు దూసుకు పోతున్నారు.

అవకాశాలను అందుకోవాలి... కలలను నిజం చేసుకోవాలి... జీవితంలో గెలుపు జెండా ఎగురవేయాలి... ఇలాంటి ఆలోచనలు చాలా మందిని కుంగతీస్తున్నాయి. వారి మనుసులు ఎన్నడూ లేనంతగా ఆందోళనకు గురవుతున్నాయి. ఇదంతా ఆలోచనా విధానం వల్లే అన్నది కొందరి నమ్మకం.

ధ్యానం చేస్తున్న యువతి

మనుషుల ఆలోచనా విధానంలో తప్పు ఉందా?

మనుషుల ఆలోచనా విధానంలో ఏమైనా తప్పు ఉందా? మంత్రాలతో ధ్యానం చేస్తే మెదడుకు మేలు జరుగుతుందా?

'ఒక రోజులో అంటే 24 గంటల్లో మన మెదడులో 60వేల ఆలోచనలు పుడతాయి. మనసు కోతిలాగా ఇష్టం వచ్చినట్లు చిందులు వేయకుండా చూసేదే మంత్రం. ఒక ఆలోచన నుంచి మరొక ఆలోచనకు వెంట వెంటనే మారిపోకుండా ఇది చూస్తుంది.

మనసు ఎప్పుడూ ఒకేసారి అనేక పనులు చేయాలని చూస్తుంది. ఇతరులను చూసి వారిలాగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది.

మన లోపల ఏం జరుగుతుందో పట్టించుకోకుండా చుట్టు పక్కల జరిగే వాటికి కొందరు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి వాటిని నిజం అనుకుని వాటి వెనుకే పరుగులు తీస్తుంటారు.

ఇలాంటప్పుడు మన మూలాల్లోకి మనల్ని తీసుకెళ్లేవే మంత్రాలు. చాలా చిన్నతనంలోనే నాకు ధ్యానం అలవాటైంది. మంత్రాలను జపించడం కూడా చాలా చిన్నతనం నుంచే ప్రారంభించాను' అని ది 'ఏన్సియెంట్ సైన్స్ ఆఫ్ మంత్రాస్' అనే పుస్తకం రాసిన ఓం స్వామి తెలిపారు.

ధ్యానం చేస్తున్న యువతి

మంత్ర అంటే ఏమిటి?

  • మంత్ర అనేది సంస్కృత పదం.
  • 'మన్' అంటే మనస్సు... 'త్ర' అంటే సాధనం. మంత్ర అంటే మనసును నియంత్రించే సాధనం. అంటే ఆలోచనలను కంట్రోల్ చేసే మార్గం.
  • మంత్రాల్లో ధ్వని అనేది కీలక పాత్ర పోషిస్తుంది.

'ఎంతో కాలంగా ధ్వని అనేది మనుషుల జీవితాల్లో ఒక అంతర్గత భాగంగా ఉంటూ వస్తోంది. మనిషి ఉనికిలో కూడా అది భాగమే.

నోటి నుంచి వెలువడే శబ్దాలే మాటలు... పదాలు... పాటలు.

మన చుట్టూ ఉండే ప్రపంచం అంతా ఈ మాటల మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ మాటలు సరికొత్త ప్రపంచాన్ని సృష్టించగలవు లేదా ఉన్న ప్రపంచాన్ని ధ్వంసం చేయగలవు.

మనసు అనే పువ్వు విచ్చుకున్నప్పుడు, అది మనిషి జీవితంలో అంతులేని ఆనందాన్ని నింపుతుంది. కానీ అదే పువ్వు వాడిపోతే మనిషిలో నిరాశ పెరిగి పోతుంది. మనకు బతకాలని అనిపించదు. ఉన్నట్టుండి మాయమై పోతే బాగుండనిపిస్తుంది.

ఇలాంటప్పుడు మనసును మంత్రం రక్షిస్తుంది.

జీవితంలోని రకరకాల ఆలోచనలు, భావోద్రేకాలు మనసు మీద చేసే దాడుల నుంచి మంత్రం రక్షణ కల్పిస్తుంది. తద్వారా మనసు అనే పువ్వు వాడిపోకుండా చూస్తుంది' అని ఓం స్వామి చెబుతున్నారు.

మంత్ర

గతాన్ని గుర్తు పెట్టుకోవడం... భవిష్యత్తును ఊహించడం అనే రెండు లక్షణాలతో మానవ జాతి మనుగడ సాగిస్తూ వస్తోంది. కానీ ఈ లక్షణాల వల్ల చెడు ప్రభావాలు కూడా పడుతున్నాయి.

'ఒక రకంగా చూస్తే గుర్తు పెట్టుకోవడం, భవిష్యత్తును అంచనా వేయడం అనేవి చాలా అద్భుతమైన నైపుణ్యాలు.

చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచం, ప్రతికూల శక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకుని మనుగడ సాగించేందుకు ఈ నైపుణ్యాలు చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ ఇదంతా థియరీ వరకే...

వాస్తవంలో నేడు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నాం. మనసు మీద పదేపదే భారం వేయడం వల్ల ఈ పద్ధతి మనకు పెద్దగా ఉపయోగపడదు.

మన జీవితాల్లో 'నెగిటివ్ మంత్రాస్' కూడా ఉంటాయి.

  • 'నేను బాగా లేను'...
  • 'నేను ఎప్పటికీ గెలవలేనేమో'...
  • 'నేను ఎప్పటికీ ఇంతేనా?'

ఇలాంటి నెగిటివ్ మంత్రాలు చాలానే ఉంటాయి.

మనం వాటిని మన మనసులో మోస్తూ ఉంటాం' అని లింకొపింగ్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రొజలిన్ సిమన్ అన్నారు.

మనం భవిష్యత్తు గురించి ఊహించినప్పుడు మెదడులోని 'డిఫాల్ట్ మోడ్ నెట్‌వర్క్(డీఎంఎన్) ' అనే భాగం యాక్టివేట్ అవుతుంది.

సమస్యల పరిష్కారం వంటి వాటికి డీఎంఎన్ కీలకమైన భాగం. తరచూ ఎదురయ్యే కుంగుబాటు, ఒక మనిషి తన గురించి తాను చేసే ఆలోచనలను కూడా ఈ భాగం డీల్ చేస్తుంది.

'డీఎంఎన్ యాక్టివేట్ అయినప్పుడు, మనుషులు తమను తామే జడ్జ్ చేసుకుంటూ ఉంటారు. తమను తామే పోల్చి చూసుకుంటూ ఉంటారు. భవిష్యత్తులో ఎక్కువ కాలం తమను తాము ఊహించుకుంటూ గడుపుతుంటారు.

వీరు వర్తమానంలో ఉండరు. వర్తమానంలో లేనప్పుడు... నేడు ఏం జరుగుతుందో గుర్తించనప్పుడు... భవిష్యత్తులో వాటిని గుర్తుకు తెచ్చుకోలేరు' రొజలిన్ సిమన్ తెలిపారు.

మంత్రాలు జపిస్తున్న సమయంలో ఓం స్వామి మనసు ఎంతో నిశ్చలంగా ప్రశాంతంగా ఉండటాన్ని సైంటిస్టులు గమనించారు.

మంత్రాల ప్రభావం వెనుక సైన్స్ ఉందా?

'ధ్యానమంత్ర'తో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? అనే దిశగా రొజలిన్, ఆమెతో పని చేసే మరొక ప్రొఫెసర్ మరియా పరిశోధనలు చేశారు. అందులో శాస్త్రీయత ఉందా అనేది తేల్చడం కూడా వారి పరిశోధనలో భాగమే.

మౌనంగా మంత్రాలను జపించే మహిళల మెదడును మరియా స్కాన్ చేసి చూశారు. ఆ స్కానింగ్ ఫలితాలను రొజలిన్ విశ్లేషించారు.

'మేం రెండు వారాల పాటు ధ్యానమంత్ర కోర్సు నిర్వహించాం.

కోర్సులో పాల్గొన్న వారి మెదడులో డీఎంఎన్ యాక్టివిటీ తగ్గడాన్ని గమనించాం' అని రొజలిన్ తెలిపారు.

మంత్రాలను మళ్లీమళ్లీ వల్లెవేయడం ద్వారా మెదడులోని అటెన్షన్ నెట్‌వర్క్ యాక్టివేట్ అవుతుంది. అదే సమయంలో డీఎంఎన్ అంటే డిఫాల్ట్ మోడ్ నెట్‌వర్క్ మెల్లగా డీయాక్టివేట్ అయిపోతుంది.

'తమను తాము జడ్జ్ చేసుకునే తీరుతో పాటు మనసులో ప్రతికూల భావనాలు తగ్గాయని ఇలా మంత్రాలు వల్లెవేసిన వారు చెప్పారు.

మెదడులోని అటెన్షనల్, వర్కింగ్ మెమోరీ భాగాల్లో మెరుగుదల కనిపించింది.

ఏకాగ్రత కోసం అటెన్షనల్ భాగం ఉపయోగపడుతుంది. థింకింగ్, రీజనింగ్, డెసిజన్ మేకింగ్ వంటి వాటికి వర్కింగ్ మెమోరీ కీలకం' అని రొజలిన్ వివరించారు.

ధ్యానంతో పాటు మంత్రాలను పఠించేందుకు తన జీవితంలో సుమారు 15వేల గంటలను వెచ్చించినట్లు ఓం స్వామి చెబుతున్నారు.

సైంటిస్టులు 2018లో ఆయన మెదడును పరిశోధించారు. ఓం స్వామి మంత్రాలు చదువుతున్నప్పుడు ఆయన మెదడు పనితీరును పరిశీలించారు.

మంత్రాలు జపిస్తున్న సమయంలో ఆయన మనసు ఎంతో నిశ్చలంగా ప్రశాంతంగా ఉండటాన్ని సైంటిస్టులు గమనించారు.

ధ్యానం, యోగ

ధ్యానమంత్రాన్ని ఎలా ప్రారంభించాలి?

'ఒక్క పదమే ఉండే చిన్న మంత్రాలు ఉంటాయి.

లేదంటే పదాలన్నీ పూసల మాదిరిగా కలిసి ఉండే మాల వంటి పెద్దపెద్ద మంత్రాలు ఉంటాయి. ఇందులో వేల పదాలు ఉంటాయి.

దీన్ని 'మాల మంత్ర' అంటాం. మాల అంటే పువ్వుల లేదా ముత్యాల దండ వంటిది.

దండలో ఉన్నట్లే మంత్రంలోనూ పదాల అమరిక ప్రత్యేకంగా ఉంటుంది. వాటిని జపించేటప్పుడు మెదడులో నాడుల మధ్య కొత్త మార్గాలు ఏర్పడతాయి.

వీటినే 'న్యూరల్ పాథ్‌వేస్' అంటారు' అని ఓం స్వామి వెల్లడించారు.

ధ్యానమంత్రలో పలికే పదాలే కాదు వాటిని పలికే తీరు కూడా ముఖ్యమే. ధ్యానమంత్రను ఆచరించడానికి ఒక మతం మీద విశ్వాసం ఉండాల్సిన అవసరం లేదు.

'మంత్రం ఏదైనా కావొచ్చు... ఏ భాషకు చెందినదైనా కావొచ్చు. ఎవరికి నచ్చింది వారు ఎంచుకోవచ్చు. అదేమీ సమస్య కాదు.

ఆరు వారాల పాటు చేసిన పనినే మళ్లీమళ్లీ చేస్తూ పోతే మెదడులో కొత్త 'న్యూరల్ నెట్‌వర్క్స్' ఏర్పడతాయి.

ఇందుకు ఫలానా మంత్రమే జపించాలనే నియమేమీ లేదు.

'థ్యాంక్యూ యూనివర్స్' అనే ఇంగ్లిష్ పదాన్ని అయినా మీరు పఠించొచ్చు. అదే మీకు మంత్రం అవుతుంది.

సంప్రదాయ బద్ధంగా మంత్రాలను ఎంచుకోవాలనుకునే వాళ్లు, సూపర్ కాన్సియస్‌నెస్‌ స్థితిలోకి వెళ్లాలనుకునే వాళ్లు ఓంకారంతో మొదలు పెట్టడం మంచిది.

అలాగే మిమ్మల్ని మీరు భుజం తట్టి ప్రోత్సహించుకోవడం కూడా ముఖ్యమే.

అంతా బాగానే ఉంటుందనే భావన మెదడును యాక్టివేట్ చేస్తుంది. మీరు నిరాశగా ఉన్నప్పుడు 'అంతా మంచే జరుగుతుంది' అనుకుంటూ ఒకసారి భుజం తట్టుకోండి.

మీ మనసులో ఒక కొత్త అనుభూతి కలుగుతుంది' అని ఓం స్వామి వివరించారు.

మన ఆలోచనలే మనల్ని తీర్చిదిద్దుతాయి

మంత్రాల సాయంతో ప్రయత్నిస్తే, మనుషులు ఊహా ప్రపంచపు బంధనాల నుంచి విముక్తి పొంది వాస్తవ ప్రపంచంలోకి రాగలుగుతారు.

'బుద్ధ అనే పదానికి అర్థం చైతన్యం.

మనల్ని కట్టిపడేసే లక్షలాది కోరికలు, ఆశలు, అవసరాలతో జీవితంలో మనం ఎల్లప్పుడూ నిద్ర పోతూనే ఉంటామని ఆయన చెప్పారు.

ఆ కోరికలు నెరవేకపోతే కోపం రావడమో లేక ఆత్మన్యూనతకు లోను కావడమో జరుగుతుందని బుద్ధుడు బోధించారు' అని ఓం స్వామి అన్నారు.

మన ఆలోచనలే మనల్ని తీర్చిదిద్దుతాయి. మన ఆలోచనలే మనల్ని తయారు చేస్తాయి.

కాబట్టి ఆలోచనల మీద మరింత ఏకాగ్రత పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is mantra? Does meditating with mantras benefit the brain? What does science say?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X