వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూకశ్మీర్‌లో జీ-20 సదస్సు నిర్వహించడంపై వివాదం దేనికి... పాకిస్తాన్‌ ఎందుకు వద్దంటోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జీ-20

జీ-20 దేశాల 2023 సదస్సుకు జమ్మూకశ్మీర్ వేదిక కానుంది. ఈ సదస్సు కోసం జమ్మూకశ్మీర్ పరిపాలనా విభాగం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేసిన తర్వాత అక్కడ జరగబోతున్న తొలి అంతర్జాతీయ సదస్సు ఇదే.

2019 ఆగస్టు 5న జమ్మూకశ్మీర్ ప్రతిపత్తిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రద్దుచేసింది. ఈ ప్రాంతాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

జీ-20 అనేది ప్రపంచంలోనే 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి. ప్రపంచ జీడీపీలో ఈ దేశాల వాటా 20 శాతం వరకూ ఉంటుంది.

గత ఏడాది సెప్టెంబరులో జీ-20 భారత ప్రతినిధిగా(భారత షేర్పాగా) కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ను మోదీ ప్రభుత్వం నియమించింది.

మోదీ

అభ్యంతరాలు ఎందుకు?

డిసెంబరు 1, 2022 నుంచి నవంబరు 30, 2023 వరకు జీ-20కి భారత్ ఛైర్మన్‌గా వ్యవహరించనుంది. దీనిలో భాగంగానే జీ-20 సదస్సుకు భారత్ ఆతిథ్యం వహించనుంది.

ఈ సదస్సు కోసం కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ పాలనా విభాగం జూన్ 23న ఒక కమిటీ ఏర్పాటుచేసింది. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి విభాగం ప్రధాన కార్యదర్శిని ఈ కమిటీకి ఛైర్మన్‌గా నియమించింది. జూన్ 4న విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదేశాలపై ఈ కమిటీని ఏర్పాటుచేసినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

''జీ-20 సదస్సుకు సంబంధించిన భిన్న శాఖలతో సమన్వయం కోసం ఈ కమిటీని ఏర్పాటుచేశారు’’అని జమ్మూకశ్మీర్ పరిపాలనా విభాగం ఒక ఆదేశంలో పేర్కొంది. దీనిపై జమ్మూకశ్మీర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ ద్వివేది సంతకం చేశారు.

జమ్మూకశ్మీర్‌లో జీ-20 సదస్సు నిర్వహణను చాలా దేశాలు స్వాగతిస్తున్నాయి. దీన్ని భారత్ వ్యూహాత్మక చర్యగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, పాకిస్తాన్ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

జీ-20

పాకిస్తాన్, చైనాలకు అభ్యంతరం ఎందుకు?

భారత్ చర్యలను జూన్ 26న పాకిస్తాన్ తప్పుపట్టింది. ''అది అంతర్జాతీయంగా వివాదంలో ఉన్న ప్రాంతం. అక్కడ సదస్సు నిర్వహించకూడదు’’అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తిఖార్ వ్యాఖ్యానించారు.

''ఈ వివాదం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఏడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ అంతర్జాతీయ సదస్సు నిర్వహించకూడదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ తర్వాత, చైనా కూడా ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

''జమ్మూకశ్మీర్‌లో జీ-20 దేశాల సదస్సు నిర్వహించడంపై పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తంచేసింది. ఈ విషయంలో చైనా స్పందన ఏమిటి?’’ అని జూన్ 30న చైనా విదేశాంగ ప్రతినిధి ఝావో లిజియాన్‌ను మెక్సికో ఎంఎస్‌టీవీ ప్రశ్నించింది.

''ఈ అంశాన్ని మేం జాగ్రత్తగా గమనిస్తున్నాం. జమ్మూకశ్మీర్ విషయంలో చైనా వైఖరిని ఇప్పటికే చాలాసార్లు సుస్పష్టం చేశాం. దీనిలో ఎలాంటి మార్పూలేదు. ఈ వివాదాన్ని ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుగుణంగా రెండు దేశాలు పరిష్కరించుకోవాలి. సమస్యను సంక్లిష్టం చేసేలా ఎవరూ ఏకపక్షంగా వ్యవహరించకూడదు. దీనికి చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం దొరుకుతుంది. ప్రాంతీయ శాంతి, భద్రతలకు ఇది అనివార్యం’’అని లిజియాన్ చెప్పారు.

''ఆర్థిక రంగంలో సహకారానికి జీ-20 లాంటి సదస్సులు చాలా ముఖ్యం. ఆర్థిక వ్యవస్థలు గాడి తప్పేలా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని మేం ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ సదస్సుతో రాజకీయాలు చేయకూడదు. దీన్ని ఆర్థిక వ్యవస్థల అభివృద్ధికి ఉపయోగించుకోవాలి’’అని ఆయన వ్యాఖ్యానించారు.

చైనా వస్తుందా?

జమ్మూకశ్మీర్‌లో జరిగే సదస్సుకు చైనా హాజరు అవుతుందా? ఒకవేళ కశ్మీర్‌ను వివాదాస్పద ప్రాంతంగా భావిస్తే.. దీని మీదుగా చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపెక్)ను ఎందుకు నిర్మిస్తున్నారు?.. చైనా విదేశాంగ అధికార ప్రతినిధికి పీటీఐ ప్రతినిధి ఈ ప్రశ్నలు అడిగారు.

''రెండు భిన్నమైన ప్రశ్నలను మీరు అడుగుతున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి పాకిస్తాన్‌లో చైనా కొన్ని ప్రాజెక్టులు చేపడుతోంది. వీటిలో కొన్ని పాకిస్తాన్ ఆధీనంలోనున్న కశ్మీర్‌లోని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను పీడిస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు కొన్ని చైనా సంస్థలు పనిచేస్తున్నాయి. దీని వల్ల కశ్మీర్‌పై చైనా వైఖరేమీ మారదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, జీ-20 సదస్సుకు చైనా హాజరవుతుందా? అని మరోసారి పీటీఐ ప్రతినిధి ప్రశ్నించారు. ''మేం ఇప్పటికే మా వైఖరిని స్పష్టంచేశాం. ఈ సదస్సుకు మేం హాజరు అవుతామో లేదో చూద్దాం’’అని లిజియాన్ సమాధానం ఇచ్చారు.

జీ20 సదస్సును కశ్మీర్‌లో నిర్వహించాలని భారత్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే, సదస్సును అక్కడ నిర్వహించడం అంత తేలిక కాదు.

పాకిస్తాన్, చైనాలతోపాటు టర్కీ, సౌదీ అరేబియాల నుంచి కూడా ఈ విషయంలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పాకిస్తాన్ తర్వాత ఈ మూడు దేశాలు కూడా కశ్మీర్‌లో జీ-20 సదస్సును వ్యతిరేకిస్తూ స్పందించినట్లు పాకిస్తాన్ న్యూస్ వెబ్‌సైట్ ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. ఈ విషయంపై అమెరికా, బ్రిటన్ లాంటి అగ్ర దేశాలతోనూ పాకిస్తాన్ చర్చలు జరుపనున్నట్లు పేర్కొంది.

ఒకవేళ ఈ సదస్సు జమ్మూకశ్మీర్‌లో జరిగితే, అక్కడ అంతా సవ్యంగానే ఉందని, భారత్ వైఖరికి మద్దతు తెలుపుతున్నామని ప్రపంచ దేశాలు అంగీకరించినట్లు అవుతుందని పాకిస్తాన్ చెబుతోంది.

మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా?

ఈ విషయంపై జులై 3న బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. జమ్మూకశ్మీర్‌లో జీ-20 సదస్సును నిర్వహించాలనే నిర్ణయం నుంచి మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు ఆయన చెప్పారు.

https://twitter.com/Swamy39/status/1543491854628376576

''జీ-20 సదస్సు నుంచి మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మొదట దీన్ని జమ్మూకశ్మీర్‌లో నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ, చైనా, పాకిస్తాన్ మొరగడంతో మోదీ ప్రభుత్వం భయపడింది. అందుకే ఇప్పుడు దీన్ని దిల్లీలో నిర్వహించబోతున్నారు. బహుశా ప్రగతి మైదాన్‌లో నిర్వహిస్తారు. 54 అంగుళాల ఛాతీ..’’అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, ప్రభుత్వం నుంచి ఏమైనా సమాచారం అందిందా? అని బీబీసీ ఆయన్ను ప్రశ్నించింది. దీనిపై బీబీసీతో మాట్లాడుతూ.. ''దిల్లీలోనే ఈ సదస్సు నిర్వహిస్తారని సమాచారం అందింది. దీన్ని ప్రగతి మైదాన్‌లో నిర్వహిస్తారని నేను చెప్పగలను. అదే జరిగితే.. భారత్‌కు ఎదురు దెబ్బే కదా?’’అని ఆయన వ్యాఖ్యానించారు.

''ఇప్పుడే నేనేమీ చెప్పలేదు. కానీ, ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి’’అని ఆయన అన్నారు.

తమకు నచ్చిన ప్రాంతంలో ఈ సదస్సు నిర్వహించుకునే హక్కు భారత్‌కు ఉందని సౌదీ అరేబియా సహా చాలా దేశాలకు భారత రాయబారిగా పనిచేసిన తల్మీజ్ అహ్మద్ అన్నారు. ''జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. దీనిపై భారత్‌కు సార్వభౌమత్వం ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌పై మాత్రమే వివాదం ఉంది. జమ్మూకశ్మీర్‌లో జీ-20 సదస్సు నిర్వహిస్తే.. టర్కీ, సౌదీ అరేబియాలకు అభ్యంతరం ఏమీ ఉండదనే అనుకుంటున్నాను’’అని ఆయన చెప్పారు.

''అసలు పాకిస్తాన్.. జీ-20లోనే లేదు. అప్పుడు ఆ అభ్యంతరాలను పట్టించుకోవడం ఎందుకు. మరోవైపు ఈ సదస్సుకు రాబోవడంలేదని చైనా కూడా ఏమీ చెప్పలేదు. ఒకవేళ టర్కీ, సౌదీ అరేబియాలకు ఏదైనా సమస్య ఉంటే.. దౌత్యపరమైన మార్గాల్లో చర్చలు జరపొచ్చు. కశ్మీర్ అంశాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని షిమ్లా ఒప్పందంలో పాకిస్తాన్ అంగీకరించింది. ఇక వివాదం ఎక్కడుంది?’’అని ఆయన ప్రశ్నించారు.

ఏమిటీ జీ-20?

20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమే జీ20. జీ-20 దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల పరిమాణం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 80 శాతం వరకు ఉంటుంది. ప్రపంచ జనాభాలో జీ-20 దేశాల జనాభా 60 శాతం వరకు ఉంటుంది.

అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, భారత్, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, బ్రిటన్, అమెరికాలను జీ-20 దేశాలుగా పిలుస్తారు.

1999లో జీ-20 ఏర్పాటైంది. భారత్‌ అప్పటినుంచీ ఈ కూటమిలో సభ్యదేశంగానే ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is the controversy over holding the G-20 summit in Jammu and Kashmir? Why does Pakistan not want it?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X