రైలు చివరి బోగీ వెనకాల X గుర్తు ఎందుకు ఉంటుంది?
మనదేశంలో అత్యంత సురక్షితమైన, చవకైన రవాణా సాధనం ఏది అంటే ఠక్కున చెప్పే పేరు రైలు బండి అని. దేశవ్యాప్తంగా కొన్నివేల కిలోమీటర్ల మేర విస్తరించిన రైల్వేలు ప్రతిరోజు కోటిన్నర మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రైలు ప్రయాణం ఎంత బాగుంటుందో, ఎంత సంతోషాన్ని కలగజేస్తుందో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే.
తరుచుగా రైలు ప్రయాణం చేసేవారు కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది. రైలు లోపల చైన్ దగ్గర రాసివున్న అక్షరాల నుంచి బోగీ చివర ఉండే X గుర్తు వరకు ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. చాలామంది దీన్ని గమనించివుంటారుకానీ అర్థం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయరు. అలా ఎందుకు రాసివుంటుందో, దాని ఉపయోగం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి రైలు చివరి బోగిపై తెలుపు లేదా పసుపు రంగుతో 'X' గుర్తును వేస్తారు. ఈ రైలుకు ఇదే చివరి బోగీ అని తెలిపేందుకు అలా వేస్తారు. ప్రయాణంలో ఎటువంటి కోచ్ లను రైలు వదల్లేని, అన్నిటినీ తీసుకువెళుతోందని దీనిద్వారా అర్థం. ఒకవేళ చివరి బోగీపై X గుర్తు లేకపోతే ఆ రైలుకు ఏదో ప్రమాదం జరిగిందనే అర్థం వస్తుంది. స్టేషన్ నుంచి రైలు క్రాసింగ్ అయ్యే సమయంలో కూడా గార్డు X మార్కును గుర్తించిన తర్వాతే అన్ని బోగీలు సరిగానే ఉన్నాయనే అర్థంతో వెళ్లడానికి ఆకుపచ్చ జెండాను చూపిస్తారు.
ఒకవేళ చివరి బోగీపై X గుర్తు లేకపోతే స్టేషన్ మాస్టర్ వెంటనే హెచ్చరికను జారీ చేస్తారు. దీంతో అధికారులంతా అప్రమత్తమవుతారు. X గుర్తుతోపాటు LV అనికూడా రాసివుంటుంది. లాస్ట్ వెహికల్ అని దీనికి అర్థం. చివరి బోగీపై ఎరుపు రంగు లైట్ ఉంటుంది. రాత్రివేళ ఈ బోగీని గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. రైలు మధ్యలో ఉండే బోగీలుకానీ, ముందుండే బోగీలకు కానీ ఎక్కడా ఇలాంటి గుర్తులు ఉండవు. కేవలం చివరి బోగీకి మాత్రమే ఉంటాయి.












Click it and Unblock the Notifications