మమత బెనర్జీని ఏం చేశారు..ఆ రహస్యం ఏంటి?: ఉప రాష్ట్రపతిని నిలదీసిన సీఎం
జైపూర్: మొన్నటివరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పని చేసిన జగ్‌దీప్ ధన్‌కర్.. ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీతో ఆయనకు రాజకీయంగా ఎన్నో విభేదాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో ప్రభుత్వ పనితీరును బహిరంగంగా ప్రశ్నించారు. గవర్నర్‌గా పని చేసినన్ని రోజులూ మమత బెనర్జీ-జగ్‌దీప్ ధన్‌కర్ ఉప్పు-నిప్పుల్లా వ్యవహరించారు. తన రాజ్యాంగ పరిధిని దాటి జగ్‌దీప్ వ్యవహరిస్తోన్నారంటూ అటు మమత బెనర్జీ కూడా పలుమార్లు విమర్శించారు.
అలాంటి మమత బెనర్జీ- ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. జగ్‌దీప్ ధన్‌కర్‌కు గానీ, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు గానీ ఆమె మద్దతు ప్రకటించలేదు. తటస్థంగా వ్యవహరించారు. ఓటింగ్‌కు దూరంగా ఉన్నందునకు మమతా బెనర్జీకి ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌కర్ ఇప్పుడు తాజాగా కృతజ్ఞతలు తెలిపారు. తాను పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నప్పుడు మమతా బెనర్జీ గౌరవానిక భంగం కలిగించేలా ఒక్క మాట కూడా మాట్లాడలేదని జగ్‌దీప్ ధన్‌కర్ అన్నారు.

జగ్‌దీప్ ధన్‌కర్‌ను రాజస్థాన్ ప్రభుత్వం ఇవ్వాళ సన్మానించింది. అసెంబ్లీలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సహా మంత్రులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్‌దప్ మాట్లాడారు. తాను ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌కు రాష్ట్రానికి గవర్నర్‌గా లేనని, తాను రాజ్యాంగానికి విరుద్ధంగా ఎప్పుడూ పని చేయలేదని అన్నారు. మమత బెనర్జీ గౌరవానికి వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడ లేదని పేర్కొన్నారు. ఏది చేసినా బహిరంగంగా చేశానని వ్యాఖ్యానించారు.
అనంతరం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన మాట్లాడుతూ మమత బెనర్జీ వంటి ఉక్కుమహిళను ఏం చేశారని సరదాగా నిలదీశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండేలా ఏం మ్యాజిక్ చేశారని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను ఎదిరించిన మహిళగా మమత బెనర్జీకి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. గవర్నర్‌తో మమత బెనర్జీకి సత్సంబంధాలు లేవనే విషయం దేశప్రజలందరికీ తెలుసని అన్నారు. అలాంటి మమత బెనర్జీని ఓటింగ్‌కు ఎలా దూరంగా ఉంచారో ఆ రహస్యం చెప్పాలని అన్నారు.












Click it and Unblock the Notifications