వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జలుబు తగ్గడానికి ఏం చేయాలి? అస్సలు చేయకూడని పనులేంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జలుబు చేసినప్పుడు కంగారు పడి మందులు వాడాల్సిన పనిలేదు

"అబ్బబ్బబ్బ...ఈ పడిశం కాలం మహా పాడుకాలం. రెండు రోజుల నుంచి తల దిమ్ముగా ఉంది. నా పాలు తాగి ఈ చంటిదానికి కూడా జలుబు మొదలైంది. ఏదో ఒకటి చెయ్యమ్మా తల బద్దలయిపోతుంది" అంటూ నాలుగు నెలల తన కూతుర్ని కాసేపు ఎత్తుకు తిప్పమని తండ్రికి ఇస్తూ తల్లి ఒడిలో వాలిపోయింది రాగిణి.

"ఈ మాత్రం జలుబుకే అందమైన శీతాకాలాన్ని తిట్టి పోస్తావెందుకు.? కాస్త మిరియాలు, ధనియాల కషాయం కాస్తానుండు" కూతురి తలను దిండు మీదకు సర్ది వంటగది వైపు నడిచారు పద్మమ్మ.

"నీకేం తెలుసమ్మా నా బాధ? ఒక దగ్గర కాదు, ఒళ్లంతా నొప్పులు, ముక్కులోంచి నీళ్లు కన్నీళ్లు కారుతున్నట్లు కారుతున్నాయి. గొంతు నొప్పి. దగ్గీ దగ్గి డొక్కల్లో నొప్పి. నేనెలాగో అవస్థపడుతున్నా, మొన్న సాయంత్రం నుంచి చిన్నతల్లి ఒళ్లు వెచ్చ బడింది’’ అన్నది రాగిణి.

''నిన్నటి నుండీ దానికి ముక్కు పట్టేసింది. రాత్రి అసలు నిద్రే పోలేదు. పాలూ తాగలేకపోతోంది. భుజాన వేసుకు తిప్పితే ఓ అరగంటా, పావుగంటా ఊరుకుంటుంది. పక్కలో వేయనీయదు. మా ఇద్దరికీ రాత్రంతా నిద్దర్లేదు. ఇక, నావల్ల కాదు" అంటూ దుప్పటి మీదకు లాక్కుంది రాగిణి.

అసలే బాలింత, ఏ మందులు పడితే అవి వేసుకోనూ లేదు. ఆపై చంటి పిల్లక్కూడా రొంప మొదలైతే ఏం చేస్తుంది పాపం అనుకుంటూ కషాయంతో పాటు ఆవిరి పట్టేందుకు మరొక గిన్నెతో పొయ్యి మీద నీళ్లు పెట్టారు పద్మమ్మ.

చలికాలంలో దాదాపు ప్రతీ ఇంటి కథా ఇదే. చిన్నా పెద్దా, ఆడా మగా తేడా లేకుండా ఈ చలికాలంలో అందర్నీ పలకరించే చుట్టం జలుబు. అంత పెద్ద అనారోగ్యమూ కాదు, అలాగని బాధ పెట్టకుండా ఉండదు. ఇంట్లో ఒకరికి వస్తే, మిగతా అందరికీ అంటుకుంటుంది.

మూకుమ్మడిగా డాక్టర్ కన్సల్టేషన్లు, హోల్ సేల్‌గా మందుల కొనుగోళ్లు. అన్నీ వేసుకుంటూ పాత కాలం నాటి సామెత గుర్తు చేసుకోవాలి.. "జలుబు మందు వేస్తే వారానికి, వెయ్యకపోతే ఏడు రోజులకు తగ్గుతుంది"

మరైతే మందులు అవసరం లేదనా అర్థం? ప్రత్యామ్నాయ (వంటింటి) వైద్యమైతే ఫలిస్తుందా? అవుననే చెప్పాలి. కాకపోతే కాస్త నెమ్మదిగా, వారానికి తగ్గుతుంది. మరింకేమిటి మార్గం?

జండూబామ్, పసుపు నీళ్లు, కషాయం, కాఫ్ సిరప్, నెబ్యులైజేషన్, ఆవిరి పట్టడం, యాంటీబయోటిక్స్, ఇంజక్షన్స్.. ఏది పనిచేస్తుంది?

జలుబు ఒక రోగ లక్షణం మాత్రమే

పరిష్కారం తెలియాలంటే ముందు సమస్య మూలమేమిటో తెలియాలి. జలుబు ఒక రోగ లక్షణం మాత్రమే. అసలు సమస్య వైరల్ ఇన్ఫెక్షన్. ఫలానా అని చెప్పలేని వందల వైరస్‌లలో ఏదో ఒకటి. సాధారణంగా రైనోవైరస్ అయి ఉంటుంది.

ఇతర ఇన్ఫెక్టెడ్ వ్యక్తుల వల్ల గానీ, గాలిలోంచి గానీ, వైరస్ అంటుకున్న వస్తువుల నుంచిగానీ ఇది మన ముక్కు లేదా నోట్లోకి ప్రవేశిస్తుంది. అక్కడి చర్మపు పొరల్లో ఇంకా అభివృద్ధి చెంది చుట్టుపక్కల అవయవాల్ని ఈ వైరస్ ఇబ్బంది పాలు చేస్తుంది.

రైనోవైరస్ ఇన్ఫెక్షన్ చాలా వరకు ముక్కు, గొంతు, తల భాగాలకు పరిమితమై, సాధారణ జలుబు, దగ్గు, తలనొప్పి కాస్త ఒళ్లు నొప్పులకు పరిమితం అవుతుంది. మరీ చిన్న పిల్లల్లో మాత్రమే అరుదుగా న్యుమోనియా, బ్రోన్కియోలిటిస్ లాంటి సమస్యలు రావచ్చు.

ఇది సాధారణ జలుబు (Common cold) కాబట్టి, అందునా వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి యాంటిబయోటిక్స్ వాడటం శుద్ధ దండగ.

మొదటి మూడు-నాలుగు రోజులు ముక్కు వెంబడి నీళ్లు కారటం (చిక్కటి చీమిడి కాదు), ముక్కు పూడుకుపోవడం, వాసన తెలియక పోవడం, గొంతు పొడి బారడం, దగ్గు, జ్వరం వచ్చినట్లుండడం సహజం.

తరచూ కొంచెం నీళ్లు తాగడం, రెండు పూటలా నోరు, ముక్కు, గొంతు శుభ్రపరుచుకోవడం (salt water gargling) వల్ల దగ్గు, ముక్కు కారడం నుండి ఉపశమనం ఉంటుంది. ఏదైనా బామ్ రాసుకోవడం, వేడినీళ్ల ఆవిరి పెట్టుకోవడం కూడా ప్రయోజనకరమే.

అంతకు మించి రకరకాల దగ్గు మందులు చేసే మ్యాజిక్ ఏమీ లేదు. ఒళ్లు నొప్పులు, శరీరం వెచ్చబడటం, తలనొప్పి లాంటి బాధలకు బరువుకు తగ్గంత పారాసిటమాల్ వేసుకోవచ్చు. గర్భిణీలైనా, బాలింతలైనా సరే నిర్భయంగా ఈ మాత్ర వేసుకోవచ్చు.

ఆ మాటకొస్తే అవసరమైనప్పుడు కొన్ని యాంటీబయోటిక్స్ డాక్టర్ సలహా మేరకు భేషుగ్గా వాడొచ్చు.

సాధారణంగా దగ్గు, జలుబు మందులు వాడకపోయినా వారంలో తగ్గిపోతాయి

డాక్టర్ దగ్గరకు ఎప్పుడు వెళ్లాలి?

కొన్ని సార్లు ఈ సాధారణ జలుబు ఉన్న స్థితిలో, కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చి చేరతాయి. దీన్ని మనం ఎలా గుర్తించాలంటే....ఉన్నట్లుండి జ్వరం తీవ్రత పెరగడం, నాసికాస్రావాలు చిక్కగా, పసుపుపచ్చగా మారడం, గొంతులో కళ్ళె పేరుకుపోవడం లాంటివి కనిపిస్తాయి.

ఇలాంటప్పుడు రోగలక్షణ ఆధారిత వైద్యానికి మించి మందులు అవసరమౌతాయి. తక్షణం డాక్టర్ దగ్గరికి వెళ్లండి. పిల్లల కోసమైతే పిల్లల డాక్టర్నే సంప్రదించండి.

ఎందుకంటే మీకు / మీ పిల్లలకు అసలు యాంటీబయోటిక్స్ అవసరం ఉందా, ఉంటే ఏ రకమైనది, ఎంత మోతాదు, ఎంతకాలం వాడాలో వారే సరిగ్గా చెప్పగలరు. OTC (Over the counter)/ మందుల షాపు నుండి తోచిన యాంటీబయాటిక్ కొనుక్కొచ్చి వాడటం మనకే కాదు, సమస్త మానవాళికే ప్రమాదం.

ఇకపోతే ఈ రైనోవైరస్ వంటి వాటివల్ల వచ్చే జలుబు వారం పది రోజుల్లో (వంటింటి వైద్యాలైనా, అసలేమీ చేయకపోయినా) తగ్గిపోతుంది. మరీ చంటి పిల్లలైతే జ్వరం, ముక్కు దిబ్బడ తగ్గటానికి మందులు వాడొచ్చు.

రొంప బాగా ముదిరి చెవులు పూడుకు పోవడం చంటిపిల్లల్లో చాలా తరచుగా ఎదురయ్యే సమస్య. పాలు తాగుతూ తాగుతూ, ఒకవైపే పడుకుండి పోయిన పిల్లల్లో, రాత్రుళ్లు ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. అర్ధరాత్రి నిద్రలో లేచి చెవుపట్టుకుని మరీ ఏడుస్తారు పిల్లలు.

బిడ్డ ఆపకుండా ఏడుస్తూ ఇంట్లో అందర్నీ పరుగులు తీయిస్తుంది. అయితే ఇది ప్రాణాంతకమేమీ కాదు. పారాసిటమాల్, మరోపక్కకు త్రిప్పి పడుకోబెట్టడంవల్ల ముక్కు బ్లాక్‌కి ఉపశమనం చాలావరకూ రిలీఫ్ దొరుకుతుంది. ప్రత్యేకించి చెవిలో చుక్కల మందులు అవసరం లేదు.

జలుబు చేసినప్పుడు తలనొప్పి కూడా ఇబ్బంది పెడుతుంది

చెయ్య కూడని పనులు

జలుబు వల్ల ఒక్కోసారి చెవులోంచి చీము కారవచ్చు కూడా. దీనికి సత్వర చికిత్స అవసరం. తరచూ జలుబు చేసి చెవులదాకా పాకే పిల్లల్లో దీర్ఘకాలంలో వినికిడి సమస్యలు రావచ్చు.

ముక్కు బ్లాక్ అయితే, జాగ్రత్తగా ఒకటి రెండు సెలైన్ చుక్కలు ముక్కుల్లోకి జారవిడవాలి. సెలైన్ నీటితో నెబ్యులైజేషన్ ఇచ్చినా మంచిదే. ముక్కులో నూనె చుక్కలు వేయడం ప్రమాదకరం.

పిల్లలకు వేడినీటి ఆవిరి పట్టడం ఎంతమాత్రమూ మంచిదికాదు. సున్నితమైన ముక్కు లోపలి పొరలు దెబ్బతినడమేకాకుండా వేడినీరు ఒలికి ఒళ్లు కాలే ప్రమాదం కూడా ఉంటుంది.

నెబ్యులైజేషన్ కోసం ఆస్థమా రోగులు వాడే మందుల్ని ఇచ్చేస్తుంటారు కొందరు. మరికొందరైతే ఇంట్లోనే నెబ్యులైజర్ ఉందని గర్వంగా చెప్పుకుంటారు. అవసరం లేకున్నా మిషన్ ఆడిస్తూనే ఉంటారు. ఇదికూడా సమర్థనీయం కాదు. ఉపశమనం లేకపోగా అనర్థాలే ఎక్కువ.

మార్కెట్‌లో దొరికే వందల రకాల దగ్గుమందులతో సైతం ఫలితం గోరంత, సైడ్ ఎఫెక్ట్స్ కొండంత. మంచి తేనె అయితే పిల్లల దగ్గుకు కాస్త తెరపినిస్తుంది. అదికూడా ఆరు నెలలలోపు పిల్లలకు నిషిద్ధం.

నాలుగైదు రోజుల తర్వాత కొంతమంది పిల్లల్లో కడుపునొప్పి, విరేచనాలు ఉంటాయి. ఇదికూడా వైరస్ ప్రభావమే. జింక్ సిరప్ రెండువారాలపాటు వాడితే, వైరస్ బారిన పడిన శ్వాసకోశ-జీర్ణకోశ వ్యవస్థ తిరిగి బలం పుంజుకుంటాయి. మరీ ఎక్కువ విరేచనాలైతే ORS పట్టించవచ్చు.

జలుబు చేసినప్పుడు హడావుడి పడి సొంత నిర్ణయాలతో మందులు వాడటం మంచిది కాదు

అపోహలు

తాజాగా, వేడిగా, ఇంటి ఆహారం తినడం మినహా వేరే ఏ పత్యాలు అవసరం లేదు. పాలూ పెరుగూ తినకూడదు, మాంసాహారం తినకూడదు, జలుబుచేసిన తల్లి బిడ్డకు పాలివ్వకూడదు అనుకోవడంకూడా కేవలం అపోహలే.

ఒక్కోసారి కొన్ని వైరస్‌ల ప్రభావం మామూలు కంటే కాస్త ఎక్కువగా తగులుతుంది. ఫ్లూ(Influenza virus) ఆ కోవలోనిదే. ఫ్లూ అంటువ్యాధి. ఈ వైరస్ సోకిన రెండు మూడు రోజుల్లో విపరీతమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, తలనొప్పి వస్తాయి.

ముక్కు పట్టేయడం, కళ్ళెర్ర బడటం, పొడి దగ్గు, అది కూడా ఛాతిలోంచి దగ్గినట్లయి ఛాతి నొప్పి కూడా రావచ్చు. పసిపిల్లల్లో, వృద్ధుల్లో, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఫ్లూ న్యూమోనియా వరకూ దారి తీస్తుంది. అరుదుగా ప్రాణాంతకం కూడా.

పిల్లల్లో హెచ్చుగా జ్వరం, పక్కటెముకలు ఎగరేయడం, వేగంగా ఊపిరి పీల్చడం, పాలు తాగక పోవడం, శరీరం నీలి రంగులోకి మారడం, మూలగడం వంటి లక్షణాలు ప్రమాద సూచికలు. అటువంటప్పుడు కషాయాలు, చుక్కల మందులూ అని ఇంట్లో కూర్చోకుండా పిల్లల్ని హాస్పిటల్లో చేర్చాలి.

ఆక్సిజన్, కొన్ని రకాల యాంటీ వైరల్ మందులతో ప్రాణాపాయం నుండి గట్టెక్కవచ్చు. పది నుండి పద్నాలుగు రోజుల్లో ఈ ఫ్లూ నుండి ఉపశమనం దొరుకుతుంది. అలసట, ఆకలి మందగించడం ఇటువంటి లక్షణాలు మరికొద్ది రోజులుండవచ్చు. సరైన పోషకాహారం ఈ సమయంలో ఎంతో అవసరం.

ఇన్‌ఫ్లూయెంజా/ ఫ్లూ టీకా కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. ఆరు నెలలు దాటిన తర్వాత నుంచి పిల్లలకు నెల నిడివితో రెండు డోసులు, ఆపైన సాలీనా తీసుకోవాలి.

కరోనా సోకిన పిల్లల రోగ నిరోధక శక్తిలో మార్పు వచ్చింది

కరోనాతో నేర్చుకున్నదేంటి?

అందరికీ తెలిసిందే అయినా, చివరగా చెప్పుకోవలసింది కరోనా గురించి. మానవాళికి ఈ కొత్త వైరస్ పట్ల ఇమ్యూనిటీ లేకపోవడం, ముందుగా టీకా లేకపోవడం వల్ల ముప్పు శాతం ఎక్కువ.

అందుకే సాధారణ జలుబు నుండి ప్రాణాంతక వ్యాధి వరకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావం చూపుతుంది.

ఈ ప్రాణాంతక వ్యాధి రావడానికి కొన్ని కారణాలు కనుగొన్నా ఇంకా వాటిపై నూరు శాతం స్పష్టత లేదు. ఒక పక్క వ్యాక్సీన్ గ్రహీతల శరీరంలో దాని ఇమ్యూనిటీ తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మరోపక్క రూపాంతరాలు చెందుతూ పోతున్న కరోనా కొత్త కలవరపాటు తెస్తూనే ఉంది.

పిల్లల్లో కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నమాట నిజమే. కానీ కరోనా వచ్చి తగ్గిన చాలామంది పిల్లల్లో సహజ రోగ నిరోధక వ్యవస్థలో వింత వింత మార్పులు చోటు చేసుకుంటున్నాయి. (వాటి గురించి వచ్చే శీర్షికలో చెబుతాను)

అందుకే.. కరోనాయే కాదు అసలు చిన్న జలుబు అయినా ఎందుకు రావాలి? మన ద్వారా వచ్చినదానితో మన పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు ఎందుకు బాధ పడాలి? కాబట్టి, కరోనా విషయంలో మనం పాటించిన జాగ్రత్తలు ఎప్పటికీ పాటిస్తే ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లను కూడా చాలా వరకు నివారించవచ్చు.

కరోనా మొదటి వేవ్ సమయంలో మనలో ఉన్న భయం వల్ల, ఎంతో జాగ్రత్తగా ఉండటం వల్ల, సాధారణ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ సైతం చాలా తక్కువ శాతం నమోదయ్యాయి. నివారణ ఉత్తమ పరిష్కారం అనడానికి ఇదొక ఉదాహరణ.

(వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించడానికి రాసిన కథనం ఇది. ఇందులోని పాత్రలు, నేపథ్యం కల్పితం. నిజమైన వ్యక్తులతో, జీవించి ఉన్న లేదా చనిపోయిన ఎవరితోనైనా ఏదైనా సారూప్యం ఉన్నట్లయితే అది పూర్తిగా యాదృచ్ఛికం. రచయిత వైద్యురాలు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What to do to get rid of Cold and flu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X