• search
  • Live TV
శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహాత్మా గాంధీకి పొందూరు ఖాదీ వస్త్రాలకు ఉన్న అనుబంధం ఎలాంటిది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పొందూరులో ఖాదీ నేస్తున్న కార్మికుడు

మహాత్మా గాంధీ ఆశయాలైన మహిళా సాధికారత, కుటీర పరిశ్రమల చేతన, ఖాదీ వినియోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు. దేశంలోనే అత్యంత సన్నని నూలుపోగును తయారు చేయడం పొందూరు మహిళల ప్రత్యేకత.

ఈ ఖాదీ వస్త్రాలను ధరిస్తే సౌకర్యంతో పాటు హుందాతనం ఉట్టిపడుతుండడంతో దీన్ని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అంతా ఇష్టపడుతున్నారు.

పొందూరులోని ప్రతి గడప నుంచి మగ్గం శబ్దం లయబద్దంగా వినిపిస్తూనే ఉంటుంది. ప్రతి ఇంటి ముందు చరఖా తిరుగుతూనే ఉంటుంది. ఈ శబ్దమే సంగీతంలా వెంటాడుతుంటుంది.

సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఇక్కడ నాణ్యమైన సన్నఖాదీని ఇంటిల్లిపాది తయారు చేస్తూ కనిపిస్తారు

పొందూరు ఖాదీకి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

కుమారుడిని పంపిన గాంధీ

పొందూరు పేరు చెప్పగానే ఖాదీతో పాటు మహాత్మా గాంధీ కూడా గుర్తొస్తారు. పొందూరులో కూడా మహాత్మగాంధీ పేరుతోనే ఖాధీ దుకాణాలు ఉంటాయి. ఇక్కడ ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం ప్రాంగణంలో గాంధీ విగ్రహాం ఉంటుంది.

దీనిని ఆయన మనుమరాలు తారా భట్టాచార్జీ గాంధీ 1997లో ఆవిష్కరించారు.

''స్వదేశీ ఉద్యమ సమయంలో పొందూరు ఖాదీ గురించి విన్న గాంధీజీ ఆయన కుమారుడు దేవదాస్ గాంధీని వివరాలు తెలుకోమని పొందూరు పంపారు. ఇక్కడి వస్త్రాల తయారీ, నాణ్యత తదితర వివరాలతో పాటు పొందూరు ఖాదీని గాంధీజీకి అందించారు. వాటి నాణ్యతను చూసిన గాంధీజీ ఆశ్చర్యపోయి పొందూరు ఖాదీ ప్రత్యేకతను తన యంగ్ ఇండియా పత్రికలో వ్యాసం రాశారు. దాంతో పొందూరు ఖాదీకి దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది'' అని పొందూరుకు చెందిన ఈశ్వర్రావు వెల్లడించారు.

గాంధీజీ వ్యాసం తర్వాత అనేక మంది నాయకులు, స్వాతంత్రోద్యమకారులు పొందూరు రావడం మొదలైందని మా నాన్నగారు మాతో చెప్పేవారని ఈశ్వర్రావు అన్నారు.

"క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో దేశవ్యాప్త పర్యటనల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని పొందూరుకు పది కిలోమీటర్లు దూరంలో ఉన్న దూసి రైల్వే స్టేషన్‌లో గాంధీజీ 15 నిముషాలు ఆగారు. ఆయనను చూసేందుకు వచ్చిన వారిలో కొందరు పొందూరు ఖాదీ వస్త్రాలను బహుకరించారు. గాంధీ మనుమరాలు తారా భట్టాఛార్జీ గాంధీ పొందూరులో మూడుసార్లు పర్యటించారు. పొందూరు ఖాదీ పరిశ్రమ, తయారీ విధానం వంటి వివరాలతో పొందూరు ఖాదీ చరిత్రపై డాక్యుమెంటరీ రూపొందించారు. ఇలా గాంధీజీ కుటుంబానికి, పొందూరుకు విడదీయరాని బంధం ఉంది'' అని ఈశ్వర్రావు అన్నారు.

వినోభాభావేకు ఖాదీ తులాభారం

భూదాన ఉద్యమంలో భాగంగా ఆచార్య వినోభాభావే కూడా 1955తో పొందూరు గ్రామాన్ని సందర్శించారు. చేనేత సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. అప్పుడు ఆయనకు చేనేత కుటుంబాలు సన్ననూలుతో తులాభారం నిర్వహించారు.

వినోభాభావే శంకుస్థాపన చేసిన భవనమే నేడు ఆంధ్రా ఫైన్‌ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం (ఏఎఫ్‌కేకే సంఘం)గా మారింది. ఈ సంఘం పరిధిలో సుమారు 26 గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తున్నారు.

వీరిలో 200మంది నేతకార్మికులు, 1500 మంది నూలు వడికేవారు ఉన్నారు. వీరిలో మహిళలే అధికం.

''వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండటం పొందూరు సన్నపోగు ఖాదీ వస్త్రాల ప్రత్యేకత'' అన్నారు ఖాదీ వస్త్ర వ్యాపారి రమేశ్.

''ప్రముఖ కవి సి. నారాయణరెడ్డి, కర్నాటక మాజీ సీఎం యాడ్యురప్ప, ఏపీ మాజీ సీఎంలు వై.ఎస్. రాజశేఖర రెడ్డి, రోశయ్య వంటి వారు పొందూరు ఖాదీని నిత్యం ధరించేవారు. అక్కినేని నాగేశ్వరరావు చివరి వరకూ పొందూరు ఖాదీ పంచెలనే ధరించేవారు. ఆయన పేరుతో ఇక్కడ 'అక్కినేని అంచు పంచెలు' బాగా అమ్ముడవుతాయి. పంచెపై అంచుని నాగేశ్వరరావు గారే స్వయంగా డిజైన్ చేశారు. అందుకే ఈ డిజైను ఉన్న పంచెలకు అక్కినేని అంచు పంచె అంటారు'' అని రమేశ్ బీబీసీతో అన్నారు.

'నూరు కౌంట్' పొందూరు స్పెషల్

''దేశంలో ఖాదీ కమిషన్ సర్టిఫై చేసిన 2 వేల వరకూ ఖాదీ పరిశ్రమలున్నా, పొందూరు ఖాదీ ప్రత్యేకతే వేరు. ఇక్కడ తయారయ్యే ఫైన్ ఖాదీ మరెక్కడ తయారు కాదు. అత్యంత సన్నని పోగుతో ఇక్కడ వస్త్రాలను తయారు చేస్తారు. దీనినే 'నూరు కౌంట్' అంటారు. ఇదే పొందూరు ఖాదీ పరిశ్రమ ఖ్యాతిని వంద రెట్లు పెంచింది'' అన్నారు ఏఎఫ్‌కేకే సంఘం సెక్రటరీ డి. వెంకటరమణ

రెడ్‌ కాటన్‌తో తయారు చేసే వస్త్రాలకు 48 నుంచి 63 వరకు, హిల్ కాటన్ (కొండపత్తి)తో తయారు చేసే వస్త్రాలకు 71 నుంచి 100 వరకు నాణ్యతను బట్టి కౌంట్ ఇస్తారు. వంద కౌంట్ వచ్చిన దారాన్నే నూరుకౌంట్ సన్నపోగు అంటారు.

ప్రస్తుతం దూసి రైల్వేస్టేషన్

''పొందూరులో సన్నపోగు దారంగా మారి మగ్గానికి చేరే ముందు 8 దశల్లో పత్తి శుద్ధి అవుతుంది. ఏరటం, నిడవటం, ఏకటం, పొల్లు తియ్యటం, మెత్త బరచటం, ఏకు చుట్టడం, వడకటం, చిలక చుట్టడం అనేవి ఈ ఎనిమిది దశలు. ఇవన్నీ కూడా అత్యంత నాణ్యమైన సన్నపోగుదారాన్ని తయారు చేయడానికే. అంతకు మించి సన్నని దారాన్ని ఇక తయారు చేయలేం. చేప ముల్లుతో ఏకిన పత్తితోనే నూరు కౌంట్ దారాన్ని తయారు చేయగలం. ఈ చేపముల్లే నాణ్యమైన ఖాదీ తయారీకి మూలస్తంభం'' అన్నారు వెంకటరమణ.

పొందూరు ఖాదీ నేతలో చేపముల్లు చాలా కీలకం

చేప దవడను కర్రకు కట్టి...

ఖాదీ తయారీలో మొట్టమొదటి ఎనిమిది దశలే కీలకం. ఇక్కడ ఎంత నాణ్యమైన దారం వస్తే...వస్త్రాలు అంత నాణ్యత, సౌకర్యంగా ఉంటాయి. కొండపత్తి (పత్తిలో ఒక రకం) తీసుకుని వచ్చిన తర్వాత దానిని చేపముల్లుతో శుభ్రం చేస్తారు.

ఇది వాలుగ చేపకు చెందిన ముల్లు. ఇది అన్ని చేప ముల్లుల్లా ఉండదు. వాలుగ చేప పైదవడ, కింది దవడల నుంచి దీన్ని తయారు చేస్తారు. ఈ దవడలను నాలుగు భాగాలుగా విభజించి...తర్వాత వాటిని అరచేతి పొడవంత కర్రలను కట్టి...దానితోనే ముడి పత్తిని శుభ్రం చేస్తారు. వాలుగ చేప తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని లభిస్తుంది. అక్కడ నుంచి ఈ చేప ముల్లును కొని తీసుకుని వస్తారు.

"కొండపత్తిని సొసైటీ వాళ్లు ఇస్తారు. పొందూరులో ప్రతి ఇల్లూ ఖాదీ కుటీర పరిశ్రమే. ఇందులో ఎక్కువ మంది మహిళలే ఉంటాం. మా ఇంట్లో ముసలోళ్ల నుంచి పిల్లల వరకు అయిదుగురు ఆడోళ్లం ఉన్నాం. కొండపత్తిని శుభ్రం చేసి సన్నపోగు తయారు చేస్తుంటాం. చేపముల్లుతో శుభ్రం చేయడం మొదలు మగ్గం ఎక్కేముందు చేసి శిల్ప తయారు చేయడం (సన్నపోగు దారాన్ని జంధ్యం రూపంలో మడతపెట్టడం) వరకు అన్ని మేమే చేస్తాం. ఇలా చేపముల్లుతో శుభ్రం చేసిన పత్తిని చేతితో వడికి నూలును తీసి మగ్గంపై వస్త్రం నేస్తారు'' అని మహేశ్వరి బీబీసీతో చెప్పారు.

పొందూరులో నేతపనిలో మహిళలు

పేరొస్తుంది...పూట గడవట్లేదు

పొందూరులో నూలు వడికే వారిది ప్రత్యేకమైన నైపుణ్యం. మొత్తం చేతిపనితోనే వస్త్రాలు తయారుకావడం, రసాయనాలు వాడకపోవడంతో పొందూరు కాటన్ నాణ్యత బాగుంటుందని వస్త్ర ప్రియులు చెప్తున్నారు.

అయితే పొందూరు ఖాదీకి ఎంత పేరున్నా దానిని తయారు చేసే చేనేత కుటుంబాలు మాత్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. యువత ఖాదీ వస్త్రాల తయారీపై ఆసక్తి చూపడం లేదు.

ఖాళీ సమయంలో తల్లిదండ్రులకు సాయం చేయడమే కానీ...ఈ పనిని జీవనోపాధి కోసం ఎంచుకోవడం లేదు. అందుకే పొందూరులో ఖాదీ వస్త్రాలు నేసేవారిలో ఎక్కువ మంది 50 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులే కనిపిస్తారు.

వీరిలో కూడా ఆరోగ్య సమస్యలు, వయోభారంతో ఒక్కొక్కరుగా ఈ పనికి దూరమైపోతున్నారు.

''ఈ రంగాన్ని బతికించాలంటే యువతకు ప్రభుత్వమే భృతి కల్పించి, శిక్షణ ఇవ్వాలి. నాణ్యమైన ఉత్పత్తులు తయారుచేసేలా ప్రోత్సహించాలి. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా సరికొత్త డిజైన్ల తయారీలో శిక్షణ ఇవ్వడం, వాటికి మార్కెటింగ్ సదుపాయం కల్పించడం ముఖ్యం. జమ్దానీ కాటన్ నేసేవారు పొందూరులో దాదాపు కనుమరుగైయ్యారు. అలాగే నేతపని చేసే మాలాంటి వారికి వయసు మీరుతోంది. మా తర్వాత ఈ పనిని చేసేవారేవరు లేరు. మేమే చివరి ఖాదీ కార్మికులుగా మిగిలిపోతామేమో" అని మగ్గం పని చేసే 55 ఏళ్ల ప్రకాశ రావు అన్నారు.

ప్రకాశరావు పదేళ్ల వయసు నుంచి ఇదే పని చేస్తున్నారు. మగ్గం పని చేస్తుంగానే హార్ట్ ఎటాక్ వచ్చింది. ప్రస్తుతం ఎక్కువ సేపు పని చేయలేకపోతున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం తప్పడం లేదని చెప్పారు.

అక్కినేని నాగేశ్వరరావు అంచు పంచె

ఆధునికత అవసరం

పొందూరులో ఆంధ్రా ఫైన్‌ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘ పరిధిలో 1,200 మంది కార్మికులున్నారు. వీరికి రోజుకు కనీసం రూ.150 కూడా గిట్టుబాటు కావడం లేదు. మజూరీ పెంచాలని ఏళ్లతరబడి డిమాండ్‌ చేస్తున్నా ఫలితం లేదు.

''అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో కార్మికులను పూర్తి స్థాయిలో ఆదుకోలేకపోతున్నాం. క్లస్టర్‌ ఏర్పాటు చేసి వసతులు కల్పించాలి'' అని ఆంధ్రా ఫైన్‌ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘ కార్యదర్శి వెంకట రమణ అన్నారు.

నలుగురు ఉన్న కుటుంబంలో అంతా పని చేసినా కూడా వారికి నెలకు ఐదారువేలకు మించి రావని చెప్పారు.

''ఖాదీయేతర వస్త్ర రంగం నుంచి పోటీని తట్టుకుని నిలదొక్కుకోవాలంటే ఆధునికత వైపు దృష్టి సారించాలి. ఆధునిక మగ్గాలు, చరఖాల వంటివి కావాలి. అమ్మకాలు పెరిగే విధంగా మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. పోచంపల్లి హ్యాండ్‌లూమ్‌ పార్క్‌లాగా పొందూరులోనూ ఖాదీ విలేజ్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలి. పొందూరు పేరుతో అనేక నకిలీలు వచ్చాయి. వాటిని అరికట్టాలి'' అని వెంటకరమణ చెప్పారు.

పొందూరు ఖాదీని ప్రభుత్వాలు బతికిస్తే అది మహాత్మగాంధీకి ఘనమైన నివాళి అవుతుందని ఆయన అన్నారు.

ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పొందూరు వచ్చినప్పుడు, ఇక్కడి ఖాదీ పరిశ్రమను ఆదుకుంటామని చెప్పారు. "పొందూరు ఖాదీ పరిశ్రమను అన్నివిధాలుగా ఆదుకుంటాం. పొందురు ఖాదీ అభివృద్ధికి సంబంధించి అధ్యయనం చేస్తాం. పొందూరు ఖాదీ పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. దాని కోసం మంగళగిరి తరహాలో చేనేత మోగా క్లస్టర్ ఏర్పాటు చేస్తాం" అని ఆమె హామీ ఇచ్చారు.

పొందూరులోని ఖాదీ సంఘం భవనం

ఖాదీ గంగానదైతే...పొందూరు గంగోత్రి

పొందూరు ఖాదీ విశేషాలను వివరిస్తూ ఇక్కడ పరిశ్రమ ఎలా నిలదొక్కుతుంది ? ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కుంటోంది, పొందూరు ఖాదీపై ప్రముఖులేమన్నారు లాంటి అంశాలతో పొందూరు చెందిన ఉపాధ్యాయులు వాండ్రంగి కొండలరావు 'పొందూరు మరో పోరుబందర్' అనే పుస్తకం రచించారు.

''ఖాదీ గంగానదైతే పొందూరు ఆ గంగకి జన్మనిచ్చిన గంగోత్రి. గాంధీయే ఖాదీ...ఖాదీయే గాంధీ. చేతి నేతతో నాణ్యమైన ఖాదీని తయారు చేస్తూ మహాత్మగాంధీకి పొందూరు నిత్యం నివాళ్లు అర్పిస్తూనే ఉంది. గాంధీజీ కలలుగన్న మహిళ సాధికారత, ఖాదీ భారతం పొందూరులో కనిపిస్తుంది. పొందూరు ఖాదీ కేవలం వస్త్రం మాత్రమే కాదు...ఇక్కడ జరుగుతున్న చేతి పని నిజాయితీకి నిదర్శనం'' అని పొందూరులో గాంధీజీ విగ్రహా ఆవిష్కరణ సందర్భంగా మహాత్మగాంధీ మనవరాలు తారా భట్టాఛార్జీ చేసిన ప్రసంగాన్ని వాండ్రంగి కొండలరావు తన పుస్తకంలో ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
What was Mahatma Gandhi's affinity for the khadi cloths of Ponduru?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X