పుట్టినప్పుడే నన్ను శపించారు: స్మృతి ఇరానీ
భోపాల్: తాను పుట్టినప్పుడే తనను బరువుగా భావించి ఎవరో శపించారని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. ఈ విషయాన్ని తాను మొదటిసారి బయటకు చెబుతున్నానని, తాను పుట్టినప్పుడు కూతురు బరువు అని తన తల్లితో ఎవరో చెప్పారని, వెంటనే చంపేయాలని కూడా చెప్పారని ఆమె అన్నారు.
అయితే తమ తల్లి చాలా ధైర్యవంతురాలని, ఆ పని చేయలేదని, అందువల్లనే తాను ఈ స్థాయిలో నిలబడగలిగానని ఆమె చెప్పారు. ఆడశిశువుల భ్రూణ హత్యల గురించి ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఆ విషయం చెప్పారు. అటువంటి దుశ్చర్యలను ఆపే కార్యక్రమానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.

ఓ బాలిక చదువుకుంటే ఆమెకే పరిమితం కాదని, కుటుంబమంతా విద్యను పొందుతుందని, ఆ రకంగా దేశ నిర్మాణానికి పాటుపడుతుందని ఆమె చెప్పారు. దేశంలో ఏకీకృత విద్యావిధానం గురించి జాతీయ విద్యా విధానంలో చర్చించనున్నట్లు ఆమె తెలిపారు.
నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి విద్యకు నైపుణ్యం పెంపుదలను జోడించనున్నట్లు ఇరానీ తెలిపారు. పాఠ్యాంశాలను ఆచరణాత్మకంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జాతీయ ఈ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు దానికోసం అంతర్జాతీయ గ్రంథాలయాలతో సంబంధాలు పెట్టుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications