వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిల్లలకు ఎప్పుడు ఏ వ్యాక్సీన్ వేయించాలి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పోలియో డ్రాప్స్

పిల్లలకు సమయానికి రోగ నిరోధక టీకాలు వేయించాలి. దానికో క్రమ పద్ధతి ఉంటుంది. నిర్దిష్ట సమయంలో నిర్ణీత వ్యాక్సినేషన్ చేయించాలి. అపుడే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. ఈ వ్యాక్సీన్ల వల్ల ప్రాణాంతకమైన 20 రకాల వ్యాధుల బారిన పడకుండా పిల్లల్నికాపాడుకోవచ్చు.

పిల్లలకు పుట్టిన వెంటనే నేషనల్ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్లు ఇవ్వడం వల్ల డిఫ్తీరియా, పెర్ట్యూసిస్, టెటనస్, పోలియో, మీజిల్స్, బీసీజీ, టీబీ,హెపిటైటిస్-బి, హిమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బి, డయేరియా, మంప్స్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించవచ్చు.

ముఖ్యంగా 12 వాక్సినేషన్లు అత్యంత కీలకం. చికెన్‌పాక్స్, డిఫ్తీరియా, టెటనస్, పెర్టూసిస్ వ్యాక్సీన్, హెపటైటిస్ ఎ, హెపటైటిస్ బి వ్యాక్సీన్, ఇన్‌ఫ్లూయెంజా టీకా, హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సీన్, జపనీస్ ఎన్సెఫలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) టీకా, మీజిల్స్, మంప్స్ వ్యాక్సీన్, మెనింగోకోకల్ వ్యాక్సీన్, న్యూమోకోకల్ టీకాలను మరిచిపోకుండా ఇప్పించాలి.

వ్యాక్సినేషన్ల వల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరిగి ప్రమాదకరమైన జబ్బుల బారిన పడకుండా ఉంటారు. సమయానికి వ్యాక్సీన్లు ఇప్పించకపోతే చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది.

చిన్నారులు వ్యాక్సినేషన్

ఈ వైరస్‌లు పిల్లలకు ప్రమాదకరం

బాక్టీరియాల వల్ల కలిగే డిఫ్తీరియా, పెర్ట్యూసిస్, టెటనస్‌ల నుంచి చిన్నారులను డీటీపీఎ వ్యాక్సీన్ రక్షిస్తుంది. పెర్ట్యూసిస్ శ్వాసకోశ వ్యవస్థకు చెందిన ఇన్ఫెక్షన్. ఆరు నెలలలోపు పిల్లలకు ఇది ఎక్కువగా వస్తుంది. ఊపిరితిప్పుకోకుండా విపరీతంగా దగ్గు వస్తుంది.

దీనివల్ల చిన్నారులు తాగలేరు, తినలేరు, ఊపిరి తీసుకోలేరు. తీవ్రమైన దగ్గు వారాల తరబడి చిన్నారిని బాధిస్తుంది. ఇది కొన్ని సందర్భాలలో బిడ్డ ప్రాణం మీదకు కూడా వస్తుంది.

బోర్డెటెల్లా పెర్ట్యూసిస్ అనే బాక్టీరియా వల్ల ఇది వస్తుంది. పైగా ఇది అంటువ్యాధి. దగ్గు, తుమ్ముల ద్వారా ఒక చిన్నారి నుంచి ఇంకో చిన్నారికి ఇది సోకే అవకాశం ఉంటుంది. దీన్ని నిరోధించడానికి పెర్ట్యూసిస్ వ్యాక్సీన్ బాగా పనిచేస్తుంది.

టెటనస్ విషపదార్ధాలు ఉత్పత్తిచేసే బాక్టీరియా వల్ల వస్తుంది. నరాల వ్యవస్థ ముఖ్యంగా దవడ, మెడ కండరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇది ప్రాణాలకు ప్రమాదం. టెటనస్ ఇన్ఫెక్షన్ వల్ల ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడతారు. ఫలితంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

హెపటైటిస్ బీ ఆందోళనకరమైంది. ఇది కాలేయానికి వచ్చే ఇన్ఫెక్షన్. దీనివల్ల లివర్ సిరోసిస్, కాలేయం క్యాన్సర్ తలెత్తే ప్రమాదం ఉంది. వ్యాన్సిన్‌తో వీటిని నిరోధించవచ్చు.

మెనింగోకోకల్ బాక్టీరియా శరీరంలోని ఏ భాగంలోనైనా అంటే చర్మం, జీర్ణ కోశం (గాస్ట్రోఇంటస్టైనల్ ట్రాక్), శ్వాసకోశ వ్యవస్థ ఇలా ఎక్కడైనాఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. మెదడు, వెన్నెముక మీద ఇది ప్రభావం చూపుతుంది.

దీనివల్ల కొందరు దీర్ఘకాలికంగా వినికిడి లోపంతో, మెదడు, నరాల సమస్యలతో బాధపడతారు. అవయవ లోపం ఏర్పడే (కాళ్లు, చేతులు పడిపోవడం లాంటి) ప్రమాదం కూడా ఉంది.

ఈ సమస్య రావడానికి బాక్టీరియా, వైరస్ రెండూ ప్రధాన కారణాలు. ముఖ్యంగా మెనింగోకోకల్ శరీర రోగనిరోధకశక్తిని దెబ్బతీస్తుంది. ఈ వైరస్ నుంచి మెనింగోకోకల్ వ్యాక్సీన్ చిన్నారులను రక్షిస్తుంది.

ఇన్‌ఫ్లూయెంజా వైరస్ నుంచి ఫ్లూ వాక్సీన్ చిన్నారులను రక్షిస్తుంది. ఇన్‌ఫ్లూయెంజా.. గొంతు, ముక్కు, ఊపిరితిత్తులతోపాటు శరీరంలోని ఇతర భాగాలపై ప్రభావం చూపుతుంది. పిల్లలకు దీనివల్ల ముప్పు ఎక్కువ.

పిల్లల్లో ఏర్పడే మరో సమస్య డిఫ్తీరియా. ఇది ఊపిరితిత్తులు, చర్మంపై ప్రభావం చూపుతుంది. ప్రధానంగా గొంతు, కొన్ని సందర్భాలలో టాన్సిల్స్‌పై కూడా ప్రభావం చూపుతుంది.

డిఫ్తీరియా అడ్వాన్స్ స్టేజీలో గుండె, మూత్రపిండాలు, నరాల వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. చిన్నారులకు ఇది అత్యంత ప్రమాదకరమైంది.

బీసీజీ వాక్సీన్ క్షయ వ్యాధికి ఇచ్చే టీకా. దీనికి న్యుమోకోకల్ పాలిశాచిరైడ్ (పీపీవీ)వ్యాక్సీన్ను రెండేళ్లు పైబడిన పిల్లలకు ఇస్తారు. 'న్యూమోకోకల్ న్యూమోనియా'లో జ్వరం, దగ్గు, ఊపిరి సరిగా ఆడకపోవడం, ఛాతి నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.

కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. న్యూమోనియా ఊపిరితిత్తులకు సోకుతుంది. దీని ఇన్ఫెక్షన్ వల్ల ఐదు సంవత్సరాలలోపు చిన్నారులు చాలామంది చనిపోతున్నారు.

పోలియో డ్రాప్స్

పోలియో

పోలియోను వ్యాక్సినేషన్‌తో నిరోధించవచ్చు. పోలియో వల్ల పక్షపాతం వస్తుంది. మీజిల్స్ వల్ల మెదడు వాపు వస్తుంది. కంటిచూపు దెబ్బతింటుంది. టిటనస్ వల్ల కండరాల్లో బాగా నొప్పలుంటాయి.

ఊపిరితీయడం కష్టమవుతుంది. ఏదైనా తినాలన్నా కష్టమవుతుంది. ముఖ్యంగా ఈ సమస్యలు నవజాతశిశువుల్లో తలెత్తుతాయి.

చికిన్ ఫాక్స్ వల్ల చర్మం మీద, చిన్నారుల టిష్యూలలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. చర్మం చిట్లడం, దద్దుర్లు, అల్సర్లు ఏర్పడతాయి. హెర్పిస్ వైరస్ లాంటిది ఇది. ముఖం, లింబ్స్, గొంతు, నోటిపై దీని ప్రభావం ఉంటుంది.

ఇన్‌ఫ్లూయెంజా అనే బాక్టీరియా వల్ల హిమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా హెచ్ వస్తుంది. హెమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా వల్ల చెవి ఇన్ఫెక్షన్, రక్త సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి.

పిల్లల్లో, పసివాళ్లల్లో హిమోఫిలస్ హెచ్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బి బాక్టీరియల్ వల్ల తీవ్రమైన మెనింజిటిస్ వస్తుంది. దీనికి వ్యాక్సినేషన్ ఉంది. మెనింగోకోకల్ వైరస్ నుంచి మెనింగోకోకల్ టీకా కాపాడుతుంది. బ్రెయిన్, రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్ల నుంచి కూడా చిన్నారులను ఈ వ్యాక్సీన్ రక్షిస్తుంది.

దీర్ఘకాలిక అంగవైకల్యం రాకుండా ఈ టీకా నిరోధిస్తుంది. ఈ వ్యాక్సినేషన్లను పిల్లలకు సరైన టైంలో, క్రమ పద్ధతిలో ఇప్పించకపోతే పిల్లల ప్రాణాలను చేజేతులారా ప్రమాదంలో పడేసినట్టవుతుంది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద 0-10 చిన్నారులకి వ్యాక్సీన్లు ఇస్తారు.

రోటా వైరస్

ఉచిత వ్యాక్సీన్లు

ఈ ఇమ్యూనైజేషన్ కార్యక్రమం మనదేశంలో 1978లో ఎక్స్‌పాండెడ్ ప్రొగ్రామ్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ (ఈపీఐ)గా ప్రారంభమైంది.1989-90 నాటికి యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంగా దశల వారీగా దేశమంతా చేపట్టారు.

ఈ వ్యాక్సీన్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇస్తారు. ప్రజలకు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్లు అందుబాటులో ఉంటాయి. ఊళ్లల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గ్రామీణ ఆరోగ్య నర్సులు, హెల్త్ వర్కర్లు వ్యాక్సినేషన్ చేస్తారు.

పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా ఇస్తారు. ప్రైవేటు ఆసుపత్రులలోకూడా ఇమ్యూనైజేషన్ వ్యాక్సినేషన్లు అందుబాటులో ఉంటాయి. కానీ వాటికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

వ్యాక్సినేషన్ ప్రోగ్రాం

వ్యాక్సీన్ ఎప్పుడిస్తారు?

ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ కింద వ్యాక్సీన్లు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా ఇస్తారు. చికిన్ పాక్స్ టీకా రెండు డోసులు ఇస్తారు.

మొదటి డోసు 12-15 నెలల మధ్యలో ఇస్తారు. రెండవ డోసు 4-6 సంవత్సరాల వయసులో ఇస్తారు.

డిఫ్తీరియా, టెటనస్, పెర్ట్యూసిస్, డీటీఏపీ‌లకు ఐదు డోసుల డీటీఏపీ వ్యాక్సీన్ పిల్లలకు ఇస్తారు. మొదటి డోసు రెండు నెలలకు, రెండవ డోసు నాలుగు నెలలప్పుడు, మూడవడోసు ఆరు నెలల వయసులో, నాల్గవ డోసు 15-18 నెలలున్నప్పుడు, ఐదవ డోసు 4-6 ఏళ్ల వయసులో ఇస్తారు.

పెంటావ్యాక్సిన్ కంబైన్డ్ వాక్సీన్. ఇది పిల్లలను డిఫ్తీరియా, టిటనస్, పెర్ట్యూసిస్, హెమోఫిలిస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బి ఇన్ఫెక్షన్, హెపిటైటిస్ బి అనే ఐదు జబ్బుల నుంచి రక్షిస్తుంది. ఇది ఇంట్రామస్కులర్ వ్యాక్సీన్. 6, 10, 14 వారాల వయసు తేడాతో డోసులు ఇస్తారు.

'రోటా వైరస్ డయేరియా' నుంచి రోటావైరస్ వ్యాక్సిన్ రక్షణ ఇస్తుంది. దీనిని 6, 10, 14 వారాల్లో వయసుకు అనుగుణంగా ఇస్తారు.

'న్యుమోకోకల్ కంజుగేటివ్ వ్యాక్సిన్' న్యుమోనియాను నివారిస్తుంది. 6, 14 వారాల వయసప్పుడు ప్రైమరీ డోసులు ఇస్తారు. 9-12 వయసప్పుడు బూస్టర్ డోస్ ఇస్తారు.

హెమోఫిలిస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బి (హిబ్) రాకుండా వ్యాక్సీన్ బ్రాండును బట్టి మూడు లేదా నాలుగు డోసులు ఇస్తారు. మొదటి డోసు రెండు నెలలప్పుడు, రెండవ డోసు నాలుగు నెలల వయసప్పుడు, మూడవ డోసు (అవసరమైతే) ఆరు నెలల వయసప్పుడు ఇస్తారు. నాల్గవ, చివర డోసు 12-15 నెలల వయసు మధ్యలో ఇస్తారు.

హెపటైటిస్ -ఎకి రెండు డోసుల హెపటైటిస్ -ఎ టీకా ఇస్తారు.

మొదటి డోసు ఒక ఏడాది వయసున్నప్పుడు, రెండవ డోసు 6-18 నెలల వయసు మధ్యలో ఇస్తారు. హెపటైటిస్ బి వ్యాక్సీన్ బ్రాండ్‌ని బట్టి మూడు లేదా నాలుగు డోసులు ఇస్తారు.

మొదటి డోసును బిడ్డ పుట్టినప్పుడు, రెండవ డోసును 1-2 నెలల మధ్యలో ఇస్తారు. మూడవ డోసును నాలుగు నెలలున్నప్పుడు (అవసరమైతే) ఇస్తారు. చివరి డోసు 6-18 నెలల వయసు మధ్యలో ఇస్తారు. ఇన్‌ఫ్లూయెంజా (ఫ్లూ) వ్యాక్సినేషన్ ఆరు నెలల చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అవసరం.

తొమ్మిదేళ్లకన్నా తక్కువ ఉన్న కొద్దిమంది పిల్లలకు రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లల డాక్టర్ సలహా మీద రెండవ డోసు మీ చిన్నారికి అవసరమో లేదో తెలుసుకుని వేయించుకోవాలి.

మరిన్ని వ్యాక్సీన్లు కూడా..

మీజిల్స్, మంప్స్, రుబెల్లాకు (ఎంఎంఆర్) రెండు డోసుల ఎంఎంఆర్ వ్యాక్సీన్ తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోసు 12-15 నెలల మధ్యలో ఇస్తారు. రెండవ డోసు 4-6 సంవత్సరాల మధ్యలో ఇస్తారు.

మెనింగోకొకల్ వ్యాక్సిన్‌ని కొన్ని ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇస్తారు. ఒకటి లేదా అవసరాన్ని బట్టి రెండు మెనింగోకోకల్ డోసులు ఇస్తారు.

న్యూమోకోకల్‌కు నాలుగు డోసుల ప్రివనార్ (పిసివి13) అవసరం అవుతుంది. మొదటి డోసు రెండు మాసాలున్నప్పుడు ఇస్తారు. రెండవ డోసు నాలుగు నెలలున్నపుడు ఇస్తారు. మూడవ డోసు ఆరు మాసాల వయసులో, నాల్గవ డోసు 12-15 నెలల మధ్యలో ఇస్తారు.

పోలియోకి చిన్నారులకు నాలుగు డోసుల పోలియో వ్యాక్సినేషన్ (ఐపీవీ) ఇస్తారు. మొదటి డోసు రెండు మాసాలకు, రెండవ డోసు నాలుగు మాసాలకు , మూడవ డోసు 6-18 మాసాల మధ్యలో, నాల్గవ డోసు 4-6 సంవత్సరాల మధ్యలో ఇస్తారు.

రోటావైరస్‌ (ఆర్‌వీ)ని నిరోధించేందుకు బ్రాండును బట్టి చిన్నారులకు రెండు లేదా మూడు డోసుల రోటావైరస్ వ్యాక్సినేషన్ చేయాలి. ఇది డయేరియా వైరస్. మొదటి డోసు రెండు నెలలప్పుడు, రెండవ డోసు నాలుగు నెలల వయసులో, మూడవది (అవసరమైతే) ఆరు నెలలప్పుడు ఇస్తారు.

జపనీస్ ఎన్సెఫలిటిస్ వల్ల బ్రెయిన్ ఫీవర్ వస్తుంది. దీన్ని నిరోధించడానికి 9-12 నెలల వయసులో వ్యాక్సిన్ ఒక డోసు, 16-24 నెలల వయసులో రెండవ డోసు ఇస్తారు.

వ్యాక్సీన్ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు

ఇన్ఫెక్షన్ జబ్బుల నుంచి ఇమ్యూనైజేషన్ వాక్సినేషన్లు రక్షిస్తాయి. లేకపోతే పిల్లలు ఒత్తిడికి, రకరకాల జబ్బులకు గురవడంతోపాటు ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు పెరిగే కొద్దీ బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా తల్లి శరీరం నుండి అందే పోషకాలు తగ్గి రకరకాల జబ్బుల బారిన పడే అవకాశం ఉంది.

పది సంవత్సరాల వరకు ఇమ్యూనైజేషన్ వాక్సీన్లు అన్నీ ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీంతో పిల్లలు ప్రమాదకర జబ్బుల బారిన పడరు. జబ్బుకు కారణమైన బాక్టీరియా లేదా వైరస్‌ను వ్యాక్సీన్ నిరోధిస్తుంది. వ్యాక్సీన్లలోని యాంటీబాడీలు ప్రాణాంతకమైన జబ్బులకు గురికాకుండా పిల్లల్ని కాపాడతాయి. ప్రాణాంతక వ్యాధులు తలెత్తకుండా నిరోధిస్తాయి.

బీసీజీ (క్షయ వ్యాక్సీన్), పోలియో, హెపటైటిస్ బి వంటి టీకాలు బిడ్డ పుట్టగానే ఇస్తారు. మిగతా వ్యాక్సీన్లను వయసు ప్రకారం నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం ఇస్తారు. టైము ప్రకారం వ్యాక్సీన్ వేయించలేని పక్షంలో మీ ఏరియాలోని ఆశా వర్కర్ లేదా ఏఎన్ఎంలను కలిసి పెండింగ్ వ్యాక్సీన్ ఎలా తీసుకోవాలని అడిగి తెలుసుకొని ఆ ప్రకారం ఇప్పించాలి.

పిల్లలను వాక్సినేషన్‌కు తీసుకువెళ్లేటప్పుడు ఎంసీసీ కార్డును తీసుకెళ్లడం మర్చిపోవద్దు. దేశంలో దొరికే వ్యాక్సిన్లన్నింటికీ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఉంటుంది. కాబట్టి ఇవి సురక్షితమైనవి. వీటి నాణ్యత గురించి ఏమాత్రం భయపడనవసరం లేదు.

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇవే వాక్సీన్లు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ ఆమోదం పొంది లైసెన్స్ ఉన్న తయారీదారుల నుంచే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు వాక్సీన్లను తీసుకుంటాయి.

వ్యాక్సీన్ల ధరలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ కింద టీకాలను ఉచితంగా ఇస్తారు. చిన్నతరహా ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్స్‌లో 200 రూపాయల నుంచి 400 రూపాయలకు వ్యాక్సీన్లను అందజేస్తున్నారు. కొన్ని వ్యాక్సీన్ల ధర రెండు వేల రూపాయలు మించి ఉంది.

ఉదాహరణకు న్యుమోకోకల్ వ్యాక్సీన్ ధర 2,195 రూపాయలు ఉంది. రోటా వైరస్ టీకా 990 రూపాయలు ఉంది. ఎంఎంఆర్ వ్యాక్సీన్ 600 రూపాయలు ఉంది. డిఫ్తీరియా, టిటనస్, పెర్ట్యూసిస్, హెపటైటిస్ బి, హెమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా అన్నింటికీ కలిపి ఇచ్చే మల్టీవ్యాక్సిన్ పెంటావాక్ పీఎఫ్ఎస్ వ్యాక్సీన్ 412 రూపాయలు ఉంది.

కంపెనీలను బట్టి టీకాల ధరలు ఉంటాయి. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికెన్ పాక్స్ వాక్సీన్ 2,220 రూపాయలు ఉంది. పోలియో, హెపిటైటిస్ బి, బీసీజీ వాక్సీన్లు వంద రూపాయలలోపు ఉన్నాయి. ఎంఎంఆర్ (మీజిల్స్, మంప్స్, రుబెల్లా) వాక్సీన్ 600 రూపాయలు ఉంది. హెపిటైటిస్ ఎ టీకా 2099 రూపాయలు ఉంటే, న్యూమోకోకల్ వాక్సిన్ 3,991 రూపాయలు ఉంది. రోటా వైరస్ 1,175 రూపాయలు, ఇన్ఫుయెంజా వాక్సిన్ 1,975 రూపాయలు ఉంది.

వ్యాక్సీన్లు

వ్యాధుల నుంచి రక్షణకు వ్యాక్సీన్లు

-డాక్టర్ బాలాంబ, రిటైర్డ్ ప్రభుత్వ వైద్యురాలు

వ్యాక్సినేషన్లు ప్రాణాంతక జబ్బుల నుంచి చిన్నారులను కాపాడతాయి. అందుకే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి వ్యాక్సినేషన్లు ఇస్తారు. పిల్లలకు స్వతహాగా రోగనిరోధక శక్తి ఉండదు. తల్లే వారికి కావాల్సిన రోగనిరోధకశక్తిని తన శరీరం నుంచి అందిస్తుంది. పుట్టగానే పోలియో, బీసీజీలు ఇస్తారు. ఇవి కాకుండా ఎంఎంఆర్ తదితర మిగతా వ్యాక్సిన్లు క్రమపద్ధతిలో బిడ్డకు 0-10 సంవత్సరాల దాకా వారాలు, నెలలు, సంవత్సరాల వారీగా ఇస్తారు. పదేళ్లకు టైఫాయిడ్, కలరాలకు వ్యాక్సిన్లు ఇస్తారు.

పుట్టగానే హెపిటైటిస్ బి వాక్సిన్ మూడు డోసులు ఇస్తారు. ఆడపిల్లలకు సర్వికల్ కాన్సర్ రాకుండా హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సీన్ ఇస్తారు. పలు దేశాలలో దీనిని యూనివర్సల్ వాక్సినేషన్ షెడ్యూల్లో చేర్చారు. కానీ మనదేశంలో దీన్ని ఇంకా వ్యాక్సినేషన్ జాబితాలో చేర్చలేదు. ఈ వ్యాక్సినేషన్‌ని 9-15 సంవత్సరాల మధ్య రెండు డోసులు ఇస్తారు. ఈ వయసులో వీళ్లల్లో యాంటీబాడీలు ఎక్కువగా ఉంటాయి. పదిహేనేళ్లు వస్తే మాత్రం శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందడం తగ్గిపోతుంది. కాబట్టి మూడు డోసులు ఇస్తారు.

మలేరియా, డెంగ్యూలకు వ్యాక్సినేషన్ లేదు. నిజానికి వీటివల్ల చనిపోతున్నవారు ఎక్కువ మంది ఉంటున్నారు. మలేరియా వ్యాక్సినేషన్ ట్రయల్స్‌లో ఉంది. డెంగ్యూకి కూడా వ్యాక్సినేషన్ వస్తే చాలా ప్రాణాలు కాపాడినట్లవుతుంది. మందుల కన్నా వ్యాక్సినేషన్లు శక్తివంతంగా పనిచేస్తాయి.

చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకూ వచ్చే చాలా జబ్బులకు పారిశుద్ధ్యం, సురక్షిత నీరు, పరిశుభ్రత లోపాలతో పాటు కాలుష్యం, పర్యావరణ వినాశనం వంటివి కారణాలు.

వీటివల్ల మనుషుల్లో రోగనిరోధకశక్తి తగ్గుతుంది. ఈ పరిణామాలను ఇప్పటికే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మనుషులను వచ్చే రకరకాల జబ్బుల నివారణకు వ్యాక్సీన్లు చాలా ముఖ్యం. స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ వాటికి కూడా వ్యాక్సినేషన్లు ఉన్నాయి.

న్యుమోకోకల్ వ్యాక్సీన్, రోటా వైరస్ వ్యాక్సీన్ కూడా ముఖ్యమైనవి. ఇవి వ్యాక్సినేషన్ జాబితాలో లేవు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
పిల్లలకు ఎప్పుడు ఏ వ్యాక్సీన్ వేయించాలి?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X