వాళ్లిద్దరు ఏమైపోయారు?: జయ మృతి తర్వాత అదృశ్యం, నిజాలు బయటకొస్తాయనా!
వారిద్దరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? తిరిగి ఎక్కడికెళ్లారు? అన్న ప్రశ్నలు వెంటాడుతున్నాయి.
చెన్నై: వేదనిలయంలో జయలలిత జీవితం గురించి బయటి ప్రపంచానికి తెలియని నిజాలు చాలానే ఉన్నాయన్న ప్రచారం ఉంది. జయ మరణం తర్వాత అవి వెలుగులోకి వస్తాయని భావించినప్పటికీ.. ఆ తర్వాత కొద్దిరోజులకు వాటి ఊసే లేకుండా పోయింది.
జయలలిత చనిపోయిన ఇన్నాళ్ల తర్వాత దీనికి సంబంధించి ఇప్పుడో ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. జయలలితకు సేవకులుగా 20ఏళ్ల లోపు వయసున్న ఇద్దరు యువతులు ఉండేవారని.. కానీ ఆమె మరణం తర్వాత వారిద్దరు ఏమైపోయారన్నది ఇప్పటికీ స్పష్టత లేదనేది దాని సారాంశం. ఈ యువతుల మిస్టరీ గురించే ఇప్పుడు చెన్నైలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

వేదనిలయం గుట్టు:
జయలలిత జీవించి ఉన్నన్ని రోజులు వేదనిలయం గుట్టు గురించి ఎవరికీ తెలియదు. అసలు అందులో ఎన్ని గదులు ఉంటాయో.. ఎవరెవరు ఉంటారో.. జయలలిత ఏ గదిలో ఉంటారో.. వంటి విషయాలేవి ఎవరికీ తెలియవు. పార్టీ నేతలెవరికీ ఇంట్లోకి అనుమతి ఉండేది కాదు.
ఆఖరికి పన్నీర్ సెల్వం లాంటి నమ్మినబంటును కూడా జయలలిత తన ఇంట్లోకి అనుమతించేవారు కాదు. శశికళ, ఆమె బంధువు ఇళవరసి మాత్రమే కొన్నాళ్లు జయలలితకు తోడుగా వేదనిలయంలో ఉన్నారు. వీరితో పాటు 20ఏళ్ల వయసున్న మరో ఇద్దరు యువతులు ఉండేవారన్న ప్రచారం ఉంది.

ఎవరా యువతులు?.. మోడీ పంపించారా?
జయలలితకు సేవకులుగా ఉన్న ఆ ఇద్దరు యువతులు ఎవరన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ప్రధాని మోడీయే ఆ ఇద్దరిని జయలలిత వద్దకు పంపించారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.జయలలితపై కుట్ర జరుగుతున్నట్లు తెలియడంతో ప్రధాని మోడీ వారిని ఆమె వద్దకు పంపించినట్లుగా ఒక ప్రచారం ఉంది.
మరో ప్రచారం ఏంటంటే.. శశికళే తన బంధువులైన ఆ ఇద్దరు అమ్మాయిలను జయలలిత సేవకురాళ్లుగా నియమించిందని. జయలలిత వద్దకు వేరే వారిని రానివ్వని శశికళ.. వేరెవరు ఆమెకు దగ్గరవవద్దన్న ఉద్దేశంతోనే వారిని నియమించినట్లు చెబుతారు.

వాళ్లేం చేసేవారు?:
జయలలిత మేకప్, టైమ్ కు మెడిసిన్స్ అందివ్వడం, ఇతరత్రా పనులన్ని ఆ ఇద్దరు యువతులే దగ్గరుండి చూసుకునేవారట. జయలలిత మరణం తర్వాత వీరిద్దరు ఉన్నట్లుండి కనిపించకపోవడంతో.. అసలు వీరెవరు? ఎక్కడికి వెళ్లిపోయారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జయలలిత ఆసుపత్రిలో చేరిన తర్వాత నుంచి వీరి గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వీరి మిస్టరీపై చర్చ జరుగుతోంది.

నిజాలు బయటకు వస్తాయనేనా?:
ఆ ఇద్దరు యువతులను అజ్ఞాతంలోకి పంపించడానికి కారణం.. వేదనిలయం నిజాలు బయటకు రావద్దనే! అన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. వేదనిలయంలోని పరిస్థితులను, జయలలిత జీవితాన్ని దగ్గరగా చూసినవారు కావడంతో.. బయటి ప్రపంచానికి తెలియని విషయాలు వీరికి మాత్రమే తెలిసే అవకాశం ఉంది. దీంతో వేదనిలయానికి సంబంధించిన నిజాలు బయటపడవద్దనే వీరిద్దరిని అజ్ఞాతంలోకి పంపించారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ఆ విషయాలు బయటపడుతాయనా?
ముఖ్యంగా జయలలిత అనారోగ్యానికి గురికావడం కన్నా ముందు ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు వంటి విషయాలు వీరికి మాత్రమే తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికీ జయలలిత మరణంపై అనుమానాలు తొలగిపోకపోవడంతో.. వీరిని బయట ఉంచడం కన్నా అజ్ఞాతంలో ఉంచడమే మేలన్న ఆలోచనతోనే బయటిప్రపంచంలో వారిని కనిపించకుండా చేశారని చాలామంది అనుమానిస్తున్నారు. వాళ్లిద్దరు బయటకొస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని అమ్మ అభిమానులు ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications