Chandrayaan-3 : చంద్రయాన్ ఇప్పుడు ఎక్కడుంది ? రేపు మధ్యాహ్నం కీలక దశ ..!
చంద్రుడిలో నిగూఢ రహస్యాలు తెలుసుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 నౌక విజయవంతంగా తన ప్రయాణం సాగిస్తోంది. క్రమంగా ఒక్కో దశ పూర్తి చేసుకుంటూ చంద్రుడి దిశగా సాగిపోతోంది. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై వియవంతంగా ల్యాండ్ అయ్యేందుకు దూసుకుపోతోంది. ఈ నేపధ్యంలో అసలు ఇప్పుడు చంద్రయాన్ -3 ఎక్కడుంది ? ఎన్ని దశలు పూర్తిచేసుకుందన్న దానిపై ఇస్రో తాజా అప్ డేట్ ఇచ్చింది.
ఈ నెల 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 నౌక ఇవాళ్టికి సరిగ్గా పది రోజుల ప్రయాణం పూర్తి చేసుకుంది. ఈ పది రోజుల్లో నాలుగు కక్షల్ని విజయవంతంగా దాటి ఐదో కక్షలోకి ప్రవేశించిందని ఇస్రో తాజాగా ప్రకటించింది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఈ అంతరిక్ష నౌక ఇప్పుడు భూమి చుట్టూ 71351 కిమీ x 233 కిమీ కక్ష్యలో ఉందని ఇస్రో ధృవీకరించింది. ఇదే దూకుడుతో ప్రయాణం సాగిస్తే ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై రోవర్ సాఫ్ట్ ల్యాండ్ అవుతుందని అంచనా వేస్తోంది.

జూలై 14న చంద్రయాన్ 3 ప్రయాణం ప్రారంభించిన తర్వాత తర్వాత రోజు అంటే జూలై 15న తొలి విన్యాసం పూర్తయింది. అలాగే జూలై 16న రెండో విన్యాసం, మూడో విన్యాసం జూలై 18న, నాలుగోది జూలై 20న పూర్తయినట్లు ఇస్రో తెలిపింది. అలాగే ఒక్కో విన్యాసానికీ వేగం పెంచుకుంటూ పోతున్నట్లు కూడా వెల్లడించింది. జూలై 25న అంటే రేపు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య చంద్రయాన్ 3 ఐదో విన్యాసం పూర్తి చేసుకోబోతోంది.
ఈ కార్యక్రమంలో అంతరిక్ష నౌక కక్ష్య ఎత్తును పెంచడానికి ఖచ్చితమైన-థ్రస్టర్ ఫైరింగ్‌లు ఉంటాయి. ఆ తర్వాత ఇంజన్ బర్నింగ్ సిరీస్ లు ఉంటాయి. అనంతరం అంతరిక్ష నౌక భూమి నుంచి చంద్రుడి కక్షలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత చంద్రుడి గురుత్వాకర్షణ దాన్ని లోపలికి లాక్కుంటుంది. చంద్రుడి కక్షలోకి ప్రవేశించిన తర్వాత మరిన్ని దశలు పూర్తి చేసుకుని అంతిమంగా చంద్రయాన్ 3 ల్యాండర్ చందమామపై సాఫ్ట్ ల్యాండ్ కావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications