నా కొడుకే పార్టీ చీఫ్, పప్పూ నా కొడుకై ఉంటే: లాలూ ప్రసాద్
పాట్నా: ఆర్జేడీకి తన కొడుకు కాకుండా మరెవరు అధ్యక్షుడు అవుతారని, కాబోయే అధ్యక్షుడు తన తనయుడేనని ఆ పార్టీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ కుండబద్దలు కొట్టారు. పప్పూ యాదవ్ తన కొడుకు అయి ఉంటే ఆయనే కాబోయే చీఫ్ అయ్యేవాడన్నారు.
తన తర్వాత తన కుమారుడు పార్టీ అధ్యక్ష పదవి చేపడతారని ప్రకటించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆయనకున్న ఇద్దరు కుమారుల్లో ఎవరు పార్టీ అధ్యక్ష పదవి చేపడతారు, ఎప్పుడు చేపడతారు అనేది మాత్రం స్పష్టం చేయలేదు. తన కుమారుడు పార్టీ అధ్యక్ష పదవి చేపట్టటం ఇష్టం లేని వారు పార్టీ నుండి వెళ్లిపోవచ్చునని స్పష్టం చేశారు.

లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల పార్టీ సీనియర్ నాయకులను తన ఇంటికి పిలిపించుకుని ఈ విషయం చెప్పారు. తన నిర్ణయాన్ని వ్యతిరేకించే వారు పార్టీలో కొనసాగేందుకు వీలులేదన్నారు. ఇది నా పార్టీ అని, తన కుమారుడే పార్టీ అధ్యక్ష పదవి చేపడతాడని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు.
లాలూకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్‌లలో ఎవరు అధ్యక్ష పదవి చేపడతారనేది లాలూ వెల్లడించటం లేదు. సరైన సమయంలో పేరు ప్రకటిస్తానని ఆయన అంటున్నారు. బీహార్ శాసన సభకు ఈ సంవత్సరాంతంలో జరిగే ఎన్నికల్లో లాలూ ఇద్దరు కుమారులు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా 16వ లోకసభకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవటం తెలిసిందే. లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడిని తన రాజకీయ వారసుడిగా ప్రకటించటాన్ని పార్టీ మధేపురా లోకసభ సభ్యుడు పప్పు యాదవ్ వ్యతిరేకిస్తున్నారు.












Click it and Unblock the Notifications