వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్‌లో ‘చింతామణి’ని ఎందుకు నిషేధించారు, వందేళ్ల కిందటి ఈ నాటకంలో ఏముంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

వైశ్య కులానికి చెందినవారిని అనుకరిస్తూ, హేళన చేసేలా 'చింతామణి’ నాటకంలో ఒక పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నాటక ప్రదర్శనలను నిషేధించింది.

దీంతో ఈ చింతామణి నాటకం ఇప్పుడు చర్చనీయమవుతోంది. ఈ నాటకం ఎన్నడూ చూడనివారు కూడా ఇందులో ఏం ఉందా అని ఇప్పుడు ఆసక్తి కనబరుస్తున్నారు.

పేరుమోసిన 'చింతామణి’

ఇప్పడు సినిమాలకు క్రేజ్ ఉన్నట్లే ఒకప్పుడు నాటకాలకు విపరీతమైన ఆదరణ ఉండేది. స్టేజ్‌పై నాటకాలు వేస్తుంటే ప్రేక్షకుల ఈలలు చప్పట్లు మార్మోగేవి.

పౌరాణికాలతో పాటూ సామాజిక సమస్యలపైనా నాటకాలు ఉండేవి. గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం, కాళ్లకూరి నారాయణ రావు రాసిన చింతామణి, వరవిక్రయం.. బలిజేపల్లి లక్ష్మీకాంతం రాసిన సత్య హరిశ్చంద్ర.. ఇలా జాబితా పెద్దదే.

సమాజంలోని వ్యసనాలను ఎత్తి చూపుతూ, నైతిక విలువలు బోధించే సందేశంతో పాటూ రసవత్తరంగా ఉండేలా నాటకాలు రాసేవారు. అలాంటి సాంఘిక నాటకాల్లో తెలుగునాట విశేష ఆదరణ పొందినవాటిలో చింతామణి కూడా ఒకటి.

చింతామణి ఒక వేశ్య పేరు. వేశ్యలపై మోజుతో కుటుంబాలు ఎలా దెబ్బతింటున్నాయి, చదువుకున్న వారు కూడా ఎలా దిగజారిపోతున్నారు, ఆస్తులు ఎలా కరిగిపోతాయి వంటి అంశాలతో చింతామణి కథ నడుస్తుంది.

చింతామణి అనే వేశ్యపాత్ర, ఆమె దగ్గరకు వచ్చే విటులు, ఆ వేశ్య తల్లిపాత్ర ఇలా చాలా పాత్రలున్నాయి ఆ నాటకంలో.

ప్రస్తుతం వివాదానికి కారణం ఆ వేశ్య దగ్గరకు వెళ్లే విటుల్లో ఒకరైన సుబ్బిశెట్టి అనే పాత్ర పాతకాలం వ్యాపారులను అనుకరిస్తుంది. నిజానికి విటుల పాత్రలు రెండు బ్రాహ్మణకులాన్ని ప్రతిబింబించేవి కూడా ఉన్నాయి.

అయితే ఈ నాటకం వేసేందుకు అనేక సంస్థలు, సంఘాలు లేదా బృందాలు ఉంటాయి. ఇప్పటి కాలంలో బ్యాండ్స్ లాగా అన్నమాట.. ఫలానా నాటక సమాజం వారు ఫలానా నాటకం బాగా వేస్తారు. ఫలానా నాటక సమాజం నుంచి ఫలానా నటుడు ఆ పాత్ర బాగా వేస్తారు.. ఇలా వారికి విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇప్పుడు సినిమా యాక్టర్లకున్న క్రేజ్ ఒకప్పుడు వీరు అనుభవించారు.

''ఉన్న అన్ని నాటకాల్లోనూ చింతామణి నాటకానికే ఇప్పటికే ఎక్కువ ప్రజాదరణ ఉంది. మేమే కనీసం వంద సార్లు తక్కువ కాకుండా చింతామణి నాటకం వేశాం. అంత పాపులర్ అది. ఒక నాటక సమాజం మీద ఆధారపడి 10-15 మంది నటిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం వీరందరి పొట్టా కొట్టినట్టే’’ అని బీబీసీతో చెప్పారు నెల్లూరు నాట్య మండలి తరపున చింతామణి నాటకంలో శ్రీహరి పాత్ర చేసే నెల్లూరి సంగీత్ కుమార్ . ఈయన విజయనగరం కేంద్రంగా నాటకాలు వేస్తుంటారు.

ఇక చింతామణి నాటకం రాసింది 1923 ప్రాంతంలో. ఈ నాటకం రాసి వచ్చే ఏడాదికి వందేళ్లవుతుంది. వందేళ్లలో వేలు, లక్షల సార్లు ఈ నాటకం ప్రదర్శితమైంది.

''సాంఘిక నాటకాల్లో సూపర్ హిట్ ఇది. మేం సురభి ఆడుతుంటే ఆడవాళ్లు కుటుంబంతో సహా వచ్చి చూస్తారు. అసభ్యం, అశ్లీలం ఉండేది కాదు. 1997-98 ప్రాంతంలో వరంగల్ పోతన ఆడిటోరియంలో వరుసగా 150 సార్లు చింతామణి ప్రదర్శించాం. అన్నిసార్లూ జనం టికెట్ కొనుక్కునే చూడటానికి వచ్చారు. ఒరిజినల్ నాటకం 4-5 గంటలు ఉంటుంది. మేం పద్యాలు అవీ తగ్గించి, 2 గంటల సేపు ప్రదర్శిస్తాం.’’ అంటూ ఆ నాటక ప్రాధాన్యం వివరించారు సురభి వాసుదేవ రావు. ఈయన హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సురభి నాటక సమాజానికి చెందినవారు.

సమస్య ఏమిటి?

నాటకాన్ని రక్తి కట్టించడానికో, లేక ఆదరణ తగ్గుతోన్న క్రమంలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికో కానీ చాలా నాటక సమాజాల వారు చింతామణిలో కొన్ని సీన్లను తిరగ రాశారు. ముఖ్యంగా సుబ్బిశెట్టి పాత్రను కాస్త అడల్ట్ కామెడీ పాత్రగా మలిచారు.

చింతామణి, ఆమె తల్లి శ్రీహరి (శ్రీహరి అనేది స్త్రీ పాత్ర పేరే), సుబ్బిశెట్టి ఇలా.. వీరి మధ్య అసలైన నాటకంలో లేని కొన్ని మాటలు, సన్నివేశాలు సృష్టించి దాని ద్వారా మరింత మంది ప్రేక్షకులను రప్పించేలా చేయడం మొదలుపెట్టారు. ఈ తంతు మొదలై కూడా దశాబ్దాలు గడుస్తోంది.

రానురాను సుబ్బిశెట్టి పాత్ర మరీ శృతిమించుతోందని భావించిన వైశ్య కుల సంఘాలు తరచూ ఆ పాత్ర చిత్రణపై అభ్యంతరం చెప్పేవి. వారి అభ్యంతరాలు పరిగణించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా నాటకాన్నే నిషేధించింది.

అయితే ఒక పాత్ర విషయంలో సమస్య ఉంటే మొత్తం నాటకాన్నే నిషేధించడం సరికాదని నాటక రంగ అభిమానుల మాట. నాటకాలకు ఎంత ఆదరణ తగ్గినా ఇప్పటికీ గ్రామాల్లో జరిగే ఉత్సవాల్లోనూ, కొన్ని నగరాల్లోని ఆడిటోరియంలలో ఈ నాటకాలు ప్రదర్శితమవుతూనే ఉన్నాయి.

నూటికో కోటికో ఒకసారి టికెట్ కొని నాటకాలు చూసే వారు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో చాలా నాటక సమాజాలను బతికించే చింతామణిని నిషేధించడాన్ని ఆ రంగం వారు అంగీకరించలేకపోతున్నారు.

"ఒకరు తప్పు చేస్తే అందరికీ శిక్ష వేస్తారా? చింతామణి కథతో ఎన్టీఆర్, ఎస్వీఆర్, భానుమతి సినిమా తీశారు. ఆ సినిమాను ఏం చేస్తారు? కొందరు ఆర్టిస్టులు చేసే తప్పులకు వందేళ్ల నాటకాన్ని బలి చేయడం, అన్ని నాటక సమాజాలను శిక్షించడం సరికాదు. కావాలంటే ఆ ఒక్క పాత్ర చిత్రణా మార్చవచ్చు లేదా తీసేయవచ్చు" అని అన్నారు వాసుదేవ రావు.

"పరస్త్రీ వంక కన్నెత్తి చూడని బిల్వ మంగళ వంటి పాత్ర కూడా చింతామణి మాయలో పడుతుంది. సమాజానికి సందేశమిస్తూ కాళ్లకూరి నారాయణ రావు మంచి ఉద్దేశంతో రాసిన నాటకం ఇది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొన్ని నాటక సమాజాలు రాను రాను దీన్ని అశ్లీలంగా మార్చేశాయి. కానీ వాళ్లెంత చేసినా జబర్దస్త్ అంత అయితే కాదు. ఇప్పుడు టీవీలు, సినిమాల్లో డబుల్ మీనింగ్ కాదు, నేరుగా బూతులే పెడుతున్నారు. వాటినేమీ అనరు. ఎందుకంటే సినిమా వారికి నోరుంది, మా నాటకాల వాళ్లకి అంత బలం, పలుకుబడి లేవు. పల్లెల్లో రికార్డింగు డాన్సుల కంటే ఈ నాటకం అశ్లీలం కాదు కదా?" అని ప్రశ్నించారు వాసుదేవ రావు.

''1923లో కాకినాడలో ఈ నాటకం తొలి కాపీ విడుదల అయింది. నాటకం ప్రదర్శన ప్రారంభం అయిన కొన్ని రోజుల్లోనే దాదాపు 400 ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పటికి అన్ని సమాజాలూ కలపి ఈ నాటికాన్ని వేలు, లక్షల సార్లు ప్రదర్శించి ఉంటారు. కొన్ని సమాజాల వారు ద్వంద్వ అర్థాలు (డబుల్ మీనింగ్) వచ్చేలా కొంత మార్చారు. రాసినప్పుడు పరిస్థితులను బట్టే ఇందులో పాత్రల చిత్రణ ఉంది. పాత్రను చూడాలి కానీ కులాన్ని కాదు’’ అన్నారు సంగీత్ కుమార్.

మరోవైపు విజయనగరంలో ఈ నాటకంపై నిషేధం ఎత్తివేయాలంటూ ధర్నా చేసారు. ఆ జిల్లాకు చెందిన రంగస్థల కళాకారులతో కలసి ఈ విషయమై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కి వినతిపత్రం ఇస్తామని చెప్పారు విజయనగరం జిల్లా పౌర వేదిక అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ. అశ్లీలతను నిషేధించాలా? లేక నాటకాన్ని నిషేధించాలా అన్న స్పష్టత కూడా ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు.

చింతామణి నాటక ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని కోరుతున్న కళాకారులు

''ప్రభుత్వ నిర్ణయం చిటికిన వేలుకు దెబ్బ తగిలితే చేయి తీసేయమన్నట్టుంది. ఆ పాత్రలో లోపం ఉంటే మార్చమని అడగవచ్చు. కన్యాశుల్కంలో బ్రాహ్మణుల గురించి ఎంతో రాశారు. ఇప్పుడు కన్యాశుల్కాన్ని నిషేధిస్తారా? కాటికాపరిగా భార్యను అమ్మేశాడు కాబట్టి రాజుల మనోభావాల సమస్య వస్తుందని హరిశ్చంద్ర నాటకాన్ని నిషేధిస్తారా? కంచె ఐలయ్య ఇంతకంటే తీవ్రమైన భాష వాడారు. ఆ పుస్తకాన్ని నిషేధిస్తారా?’’ అని ప్రశ్నించారు బాబ్జీ.

ఇప్పటి సినిమాలు, మరీ ముఖ్యంగా జబర్దస్త్ కంటే ఎక్కువ అయితే చింతామణిలో ఏమీ లేదు అన్నారాయన. ఇలా నిషేధిస్తూ పోతే ఏ రచయితా ఏమీ రాయలేడన్నారాయన.

కాళ్లకూరి నారాయణ రావు నాటి జీవన స్థితిగతులను కళ్లకు కట్టారు. నైతిక జీవనం గురించి చెప్పారు. కేవలం చెప్పి ఊరుకోలేదు. ఆయన స్వయంగా ఆ వృత్తికి చెందిన మహిళను వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఆయన స్వయంగా సంస్కర్త. ఇలాంటివి ఇంకెన్నో నాటకాలు ఆయన రాశాడు. అంటూ కాళ్లకూరి నారాయణ రావు గురించి వివరించారు ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావు. చింతామణి నాటక పరిరక్షణ సమితి ఏర్పాటు చేశారు ఆయన.

చట్టపరంగా నిలుస్తుందా?

''కాళ్లకూరి నారాయణ రావు గొప్ప సంస్కర్త. వరకట్నం, వేశ్యలోలత్వం వంటి అంశాలపై ఆయన నాటకాలు రాశారు. ఎందరో ఈ అంశాలపై రాశారు. వేశ్యాకాంతలు, కౌతుక వర్ధిని, వేశ్యా ప్రియ ప్రహసనం, కనకాంగి, వారకాంత, నాచ్చి పార్టీ, వేశ్యా మధురం, వేశ్యాలంపటం, వేశ్యహిత బోధిని, వేశ్యామృతం, శ్రీ చింతామణి విలాసం, వేశ్యా ప్రభోదమం.. ఇంకా చాలా పేర్లతో నాటకాలు వచ్చాయి. ఆ పదుల నాటకాల్లో కాళ్లకూరి చింతామణిప్రదర్శనలకు బాగా ఆదరణ ఉండేది’’ అంటూ వేశ్య వృత్తి ఇతివృత్తంగా వచ్చిన నాటకాలను గురించి చెప్పారు ప్రముఖ న్యాయ నిపుణులు మాడభూషి శ్రీధర్.

అయితే ఈ ఉత్తర్వులు న్యాయస్థానంలో నిలబడబోవని ఆయన అభిప్రాయపడ్డారు. భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే ఉత్తర్వులు కోర్టులో నిలబడవని బీబీసీతో చెప్పారు శ్రీధర్.

''ఒక కులంలో పుట్టినా వాళ్లంతే తప్పుడు వాళ్లే అని తిడితే అప్పుడు ప్రశ్నించవచ్చు. కానీ కళలు, కథలను పాత్రల కులం నుంచి చూస్తే ఇక సాహిత్యం బతుకుతుందా? సుబ్బిశెట్టి పాత్రను అసభ్యంగా మారిస్తే దానిపై అభ్యంతరం పెట్టవచ్చు. సినిమాల్లో అశ్లీలతో ఉంటే సెన్సార్ బోర్డు సినిమా మొత్తాన్ని నిషేధించడం లేదు కదా? అయినా ఇప్పటి ఇంటర్నెట్ అశ్లీలం ముందు అదెంత?"

"శాంతిభద్రతల పరిరక్షణ, విస్తృత ప్రజా ప్రయోజనం తప్ప మరే సందర్భంలోనూ భావ ప్రకటనను ఆపే హక్కు ప్రభుత్వాలకు లేదు. నాటకం మొత్తాన్ని నిషేధించడం అనాలోచితం. ఒరిజినల్ వెర్షన్ ఉన్నదున్నట్టు చేయాలి తప్ప సుబ్బిశెట్టి పాత్రకు అదనంగా ఏమీ జోడించకూడదు అంటే సరిపోయేది. బ్రాహ్మణ సంఘాలు వద్దంటే కన్యాశుల్కాన్నీ నిషేధిస్తారా? వాస్తవానికి ఈ నిషేధం చింతామణికి ఇంకా పాపులారిటీ పెంచి, కొత్త వారికి కూడా ఆ నాటకం గురించి తెలియచేస్తుంది’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why Chintamani stage drama is banned in AP, what was there 100 years before
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X