రైతులపై నిందలు అందుకే , దీప్ సిద్దూను ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు : సంజయ్ రౌత్ ఫైర్
పార్లమెంట్లో వ్యవసాయ చట్టాలు, రైతులు చేస్తున్న నిరసనలపై ఈరోజు చర్చ వాడీ వేడిగా సాగింది . పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో రైతుల ఆందోళనపై జరుగుతున్న చర్చ సందర్భంగా బిజెపిని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు సంధించారు శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్.
రైతుల ఆందోళనలో చీలిక .. కిసాన్ పరేడ్ లో హింసతో ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించిన రెండు రైతు సంఘాలు

ఢిల్లీలో జరిగిన విధ్వంసానికి ప్రధాన కారకుడైన దీప్ సిద్దూను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు ?
జనవరి 26 వ తేదీన ఢిల్లీలో జరిగిన విధ్వంసానికి ప్రధాన కారకుడైన దీప్ సిద్దూను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన బిజెపి ప్రభుత్వాన్ని నిలదీశారు. విధ్వంసంతో సంబంధం లేని వారిపై కేసులు పెట్టి ప్రధాన నిందితుడిని ఎందుకు వదిలేశారని ప్రభుత్వం పై ప్రశ్నలు సంధించారు సంజయ్ రౌత్.
అంతేకాదు రైతుల ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విరుచుకు పడిన సంజయ్ రౌత్ రెండు నెలలకు పైగా రైతులు ఆందోళన చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఎర్రకోటపై దాడి
దేశ రాజధానిలో విధ్వంసం జరగడానికి, అవమానకరమైన పరిస్థితులు తలెత్తడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని, ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రైతులపై నిందలు వేస్తోందని ఆరోపించారు సంజయ్ రౌత్.
రిపబ్లిక్ డే రోజు ఎర్రకోట ఎక్కి నానా హంగామా చేసిన వారు ఎవరికి సన్నిహితంగా ఉన్నారో బహిర్గతం చేయాలంటూ సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

ఢిల్లీలో ఏం జరిగిందో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సంజయ్ రౌత్
ఢిల్లీలో జరిగిన విధ్వంసంలో ప్రధాన నిందితుడు దీప్ సిద్ధూ అని, ఆ మాట అతనే స్వయంగా చెప్పాడని, అయినప్పటికీ అతనిపై చర్య ఎందుకు తీసుకోలేదు అంటూ ప్రశ్నించారు. ఇప్పటివరకు అతన్ని అరెస్ట్ చేయలేకపోయారని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. దేశ ప్రజలకు ఆ రోజు ఢిల్లీలో ఏం జరిగిందో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల ఆందోళన తప్పు దారి పట్టించటం కోసం కేంద్రం ఇదంతా చేస్తుందని ఆరోపించారు .

దీప్ సిద్దు బిజెపి నేత అని ఆరోపణలు .. అతడినే టార్గెట్ చేసిన సంజయ్ రౌత్
ఢిల్లీ విధ్వంసం తర్వాత ఢిల్లీ పోలీసులు 37 మంది పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విధ్వంసానికి ప్రధాన కారకుడని చెబుతున్న దీప్ సిద్ధుని మాత్రం ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. అయితే దీప్ సిద్దు బిజెపి నేత అని, ప్రభుత్వమే అతన్ని దాస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం పై, ఢిల్లీ పోలీసులపై విమర్శలు వెల్లువగా మారాయి. ఈ నేపథ్యంలో దీప్ సిద్దు వ్యవహారాన్ని ప్రధానంగా టార్గెట్ చేస్తూ సంజయ్ రౌత్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.