వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... మదుపరులకు ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన మొదటి రోజే పేటీఎం షేర్లు కుప్పకూలాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు.

పేటీఎం చేసే వ్యాపారం, కంపెనీకి ప్రస్తుతం వస్తున్న లాభాలు, నష్టాలు, సంస్థ భవిష్యత్తుపై పెరుగుతున్న భయాలతో ఈ సంస్థలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం కాదని చాలా మంది నిపుణులు ముందే హెచ్చరించారు.

పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి ఎవరూ కూడా అంత సులువుగా చెడుగా మాట్లాడరు. అందుకే పేటీఎంలో పెట్టుబడి పెట్టొద్దని ఎవరూ నేరుగా సూచించలేదు. అందుకే ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయకపోయినా ఫర్వాలేదు అంటూ పరోక్షంగా సూచనలు ఇచ్చారు.

అయితే, పేటీఎం ఐపీఓకి ముందు వచ్చిన రిపోర్టులు.. దీనికి దూరంగా ఉండాలని, ఈ ఐపీఓలో పెట్టుబడి పెట్టొద్దని సూచించాయి.

పేటీఎం

లాభాలు వచ్చే వరకు ఆగాలా లేక...

పేటీఎం ఐపీఓ దేశంలోనే అది పెద్దది. 18,300 కోట్ల రూపాయలను ఇది మార్కెట్ నుంచి సేకరించింది. అయితే, లిస్టింగ్ రోజే ఈ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 39వేల కోట్ల రూపాయలు పడిపోయింది. 2150 రూపాయలకు ఒక షేర్ కొన్న మదుపరులు.. తొలి రోజే కనిష్ఠంగా 9 శాతం, గరిష్ఠంగా 27శాతం నష్టాలను మూటగట్టుకున్నారు.

ఆ తర్వాత కూడా ఈ పతనం ఆగుతుందా లేదా అని చెప్పడం కష్టమైన విషయం. ఎందుకంటే ఒక అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ పేటీఎంకు అండర్‌ఫర్ఫామ్ రేటింగ్ ఇచ్చింది. ఈ సంస్థ సరైన ధర 1200 రూపాయలు మాత్రమేనని చెప్పింది. లిస్టింగ్ రోజు మార్కెట్ ఓపెన్ కాకముందే ఈ రిపోర్ట్ వచ్చింది.

దాంతో మొదటిరోజు పేటీఎం షేర్లు విక్రయించని మదుపర్లు ఇప్పుడు ఏం చేస్తారన్నది సోమవారం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాతే తెలుస్తుంది. నష్టం వచ్చినా పేటీఎం స్టాక్ నుంచి తప్పుకోవడమే మంచిదని చాలామంది నిపుణులు సూచిస్తున్నారు.

నిపుణులు ఎందుకు విఫలం అయ్యారు?

ఇది కేవలం పేటీఎం సంస్థ గురించి మాత్రమే కాదు. నిపుణుల హెచ్చరికలను పట్టించుకోకుండా పేటీఎం ఐపీఓలో పెట్టుబడి పెట్టిన మదుపర్ల గురించి కూడా. వాళ్లు ఏమని ఆలోచించారు? వాళ్లు ఎందుకు ఈ హెచ్చరికలను పట్టించుకోలేదు? చిన్న మదుపర్ల సంగతి పక్కన పెడితే.. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు కూడా తమ డబ్బును ఇందులో ఎందుకు పెట్టారు?

పది మ్యూచువల్ ఫండ్ల మేనేజర్లు యాంకర్ ఇన్వెస్టర్లుగా పేటీఎం ఐపీఓలో ఇన్వెస్ట్ చేశారు. వాళ్లు బాగా చదువుకున్న వాళ్లు. ఈ వ్యాపారం గురించి బాగా తెలిసినవాళ్లు. మ్యూచువల్ ఫండ్‌లో మదుపుచేసిన వారి డబ్బును కాపాడాల్సిన బాధ్యత వాళ్లపై ఉంది. కానీ వాళ్లకు ఏమైంది.?

దానికి సమాధానం నాలుగు అక్షరాల ఇంగ్లిష్ పదం. FOMO. అంటే.. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. అంటే ఈ అవకాశాన్ని మిస్ అవుతామేమోనన్న భయం.

కొన్ని రోజుల క్రితం జొమాటో ఐపీఓ వచ్చింది. ఈ కంపెనీ కూడా పెద్దగా ఆర్జించేది ఏమీ లేదు. పైగా ఇది చాలా నష్టాల్లో నడుస్తోంది. భవిష్యత్తులో లాభాలు ఎప్పుడొస్తాయో కూడా తెలియదు. కానీ, ఈ కంపెనీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయినప్పుడు ఈ షేర్ ధర 53 శాతం పెరిగింది.

దీనిలాగే నైకా కంపెనీ ఈమధ్యే స్టాక్ మార్కెట్లో నమోదైంది. ఈ కంపెనీ నష్టాల్లో లేదు. లాభాల బాట పట్టింది. కానీ, ఆర్జించే లాభాలతో పోలిస్తే దీని షేర్ ధర చాలా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో మదుపు చేసిన వారి డబ్బు మొదటిరోజే రెట్టింపు అయింది.

అలాంటి ఐపీఓలు చాలా ఉన్నాయి. మదుపర్ల సంపదను రెట్టింపు చేసిన ఐపీఓలు చాలా వచ్చాయి. ఇలాంటి కంపెనీల షేర్ల కోసం లక్షలాది మంది దరఖాస్తు చేస్తే కొద్దిమందికి మాత్రమే షేర్లు దొరికాయి.

పేటీఎం

కోపం, నిరాశ...

ఒకదాని తర్వాత మరొక ఐపీఓకు దరఖాస్తు చేసినప్పటికీ షేర్లు దొరకని కొందరు మదుపర్లు.. కోపం, నిరాశతో వచ్చిన ప్రతి ఒక్క ఐపీఓకు దరఖాస్తు చేస్తున్నారు. తమ చుట్టూ ఉన్న వాళ్లు ఐపీఓల్లో లాభాలు ఆర్జించడం చూసి దీన్ని కొనసాగిస్తున్నారు.

దాంతో కొందరు వచ్చిన ప్రతి ఐపీఓకు అప్లై చేస్తూ తరచూ చేతులు కాల్చుకుంటున్నారు. 2021లో చాలా ఐపీఓలు వచ్చాయి. సుమారు 50 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. వాటిలో సగటున 31 శాతం కంపెనీలు లిస్టింగ్ రోజున లాభాలు పంచాయి.

కానీ ప్రతి ఐపీఓ లాభాలను తెస్తుందని కచ్చితంగా చెప్పలేం. పేటీఎంది అత్యంత భయంకరమైన కథ. ఎందుకంటే మొదటి రోజు ఈ కంపెనీ షేర్ ధర ఇష్యూ ధర కంటే ఒకదశలో 27.5 శాతం పడిపోయింది. దీనికంటే ముందు కూడా కొన్ని కంపెనీలు లిస్టింగ్ రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి.

కల్యాణ్ జువెల్లర్స్, విండ్‌లాస్ బయోటెక్ షేర్లు లిస్టింగ్ రోజున 10శాతం కంటే ఎక్కువే పడిపోయాయి.

అయితే, లిస్టింగ్ రోజున నష్టాలు వచ్చినంత మాత్రానా ఆ కంపెనీ వ్యాపారం బాగా లేదని అర్థం కాదు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కొన్ని కంపెనీల ఐపీఓలు పూర్తిగా సబ్‌స్క్రైబ్ కాకపోయినా.. లిస్టింగ్ రోజున నష్టాలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత కాలంలో ఆ షేర్లు మంచి రాబడిని తెచ్చిపెట్టాయి.

ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతి షేర్లే దీనికి ఉదాహరణ. ఈ కంపెనీలు ఐపీఓకు వచ్చినప్పుడు పూర్తిగా సబ్‌స్క్రైబ్ కావడమే కష్టమైంది. కానీ ఆ తర్వాత కాలంలో మదుపర్లకు ఇవి కాసుల వర్షం కురిపించాయి.

స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం గురించి మాట్లాడేటప్పుడు చాలామంది ఈ కంపెనీలను ఉదాహరణగా చూపిస్తారు. మొదట్లో ఎవరూ ఈ కంపెనీలను పట్టించుకోలేదని, ఆ తర్వాత వీటిని గుర్తించినా అప్పటికే బాగా ఆలస్యం అయిపోయిందని చెబుతారు.

అలాంటి కంపెనీలు సహజంగా ఒక కొత్తరకమైన వ్యాపారం చేస్తూ ఉంటాయి. మీరు ఆ కంపెనీ ఉత్పత్తి లేదా సేవలను వాడుతూ ఉండొచ్చు. కానీ ఐపీఓకు అప్లై చేయడానికి మీరు ధైర్యం చేయకపోయి ఉండొచ్చు. ఎంతో మంచి అవకాశం చేజార్చుకున్నామని ఆ తర్వాత అర్థమవుతుంది.

ఇది కొత్త విషయం కాదు. అలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. ఆ కంపెనీల విషయంలో జరిగినట్లు భారీ మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశాన్ని కోల్పోతామేమో అని వాళ్లు భయపడి ఉంటారు. పేటీఎం విషయంలో కూడా ఇదే జరిగింది.

తన వ్యాపారంలో పేటీఎం ఒక పెద్ద కంపెనీ. పేటీఎం ఐపీఓకు అప్లై చేసిన వారిలో చాలామంది రోజుకు రెండు నుంచి నాలుగుసార్లు పేటీఎం వాడే వాళ్లే ఉంటారు. అలాంటి వాళ్లు, ఈ కంపెనీ బాగానే పని చేస్తుందని, దీనిలో మదుపు చేయడం వల్ల వచ్చే నష్టం ఉండదన్న భావనలో ఉండి ఉంటారు.

కానీ ఈ కంపెనీ ఆర్జిస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం బ్యాంకులకే పోతోందన్న విషయం చాలా కొద్దిమందే చూడగలిగారు. ఈ కంపెనీ చాలా నష్టాల్లో ఉంది. ఈ విషయాలన్నీ తెలిసి కూడా చాలామంది పేటీఎం ఐపీఓకు అప్లై చేశారు.

ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఈ షేర్ ధర పరుగులు పెడితే, ఆ అవకాశాన్ని తాము కోల్పోతామన్న ఆందోళనతోనే వాళ్లు దరఖాస్తు చేశారు. దీన్నే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీస్ - FOMO అని పిలుస్తారు.

మార్కెట్లు ఆల్‌టైం హైలో ఉన్నాయి. చాలా కంపెనీలు కొత్తగా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. మర్చెంట్ బ్యాంకర్లు, లీడ్ మేనేజర్లు.. ఆ కంపెనీకి బంగారు భవిష్యత్తు ఉంటుందని కలలు కంటున్నారు. వాళ్లు ఎక్కువ ధరకు షేర్లను అమ్మగలుతున్నారు.

కానీ మార్కెట్లో ఆ ధరకు కొనేవాళ్లు లేనప్పుడు, లేదా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నప్పుడు.. జనం నష్టాలు మూటగట్టుకోవడం మినహా చేసేదేమీ ఉండదు. కానీ చాలా మంది మదుపర్లు అలాంటి సమయంలో మార్కెట్‌ను వదిలేసి పరిగెడతారు. మళ్లీ ఎప్పుడూ స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టొద్దని శపథం చేస్తారు. గతేడాది నుంచి సుమారు రెండు కోట్ల మంది కొత్త ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టారు.

ఇలా కొత్తగా వచ్చిన వారు ఐపీఓలో డబ్బులు పెట్టి చేతులు కాల్చుకుంటే భవిష్యత్తులో మళ్లీ స్టాక్ మార్కెట్ మొహం కూడా చూడరు. అందుకే ఈ వ్యాపారంలో ఉండే నష్టాల గురించి ఐపీఓ ప్రకటనల్లో పెద్ద అక్షరాల్లో రాయాలని ఒత్తిడి చేస్తున్నామని సెబీ చెబుతోంది.

స్టాక్ మార్కెట్

షేర్లలో మదుపు చేయడానికి ఐపీఓ ఒక్కటే సువర్ణ అవకాశం కాదు. దీర్ఘకాలం స్టాక్ మార్కెట్లో ఉండాలనుకుంటే కొన్ని మంచి కంపెనీల షేర్లను కొంటే సరిపోతుందని నిపుణులు చెబుతూ ఉంటారు. ఐపీఓలకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తూ ఉంటారు. ఓపెన్ మార్కెట్‌లో షేర్లు కొనడం వల్ల మీరు మరింత ఎక్కువ సంపాదించొచ్చని అంటున్నారు.

అయితే, ఐపీఓకు వచ్చిన కంపెనీ గురించి సమగ్ర సమాచారం సేకరించి, భావోద్వేగాలకు లోనుకాకుండా, వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే నష్టం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

అయితే, చాలా మంది మదుపర్లు ఈ పని చేయరు. కొందరు అనలిస్టులు ఇచ్చిన సిఫార్సుల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సరిగా అధ్యయనం చేయకుండా ఐపీఓలో డబ్బులు పెట్టి చేతులు కాల్చుకుని, ఆ తర్వాత స్టాక్ మార్కెట్‌ను నిందించడం కూడా సరికాదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why did Paytm share price collapse on the first day,What is the lesson to be learned from this IPO for investors
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X