వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీలే భారత్‌లో ఆడిన ఫుట్‌బాల్ మ్యాచ్ ఎందుకు వివాదంగా మారింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

''మిస్టర్ పీలే, యువర్ ఎక్సలెన్సీ అని పిలిపించుకోవడం మీకు ఇష్టమా?'' అని కోల్‌కతాలోని ఒక విలేఖరి బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలేను అడిగారు.

ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు పీలే మూడు రోజుల ఇండియా పర్యటనకు వచ్చారు.

స్టార్‌ ఆటగాళ్లున్న ఆయన జట్టు న్యూయార్క్ కాస్మోస్‌, బెంగాల్‌ స్థానిక క్లబ్ మోహన్ బగాన్‌తో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది.

మోహన్ బగాన్‌ ఆసియాలోని పురాతన ఫుట్‌బాల్ క్లబ్‌లలో ఒకటి.

విలేఖరి ప్రశ్నకు 37 ఏళ్ల బ్రెజిలియన్ స్టార్ పగలబడి నవ్వారని మ్యాచ్‌కు ఒకరోజు ముందు అంటే 1977 సెప్టెంబర్ 24న 'ది హిందుస్తాన్ స్టాండర్డ్ వార్తాపత్రిక రాసింది.

కోల్‌కతాలోని సుప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో 60,000 పైగా ప్రేక్షకులు పీలే మ్యాచ్ చూడటానికి వచ్చారు.

న్యూయార్క్ కాస్మోస్‌ టీంతో ఆడటానికి మోహన్ బగాన్‌ క్లబ్ నేటి విలువ ప్రకారం దాదాపు రూ.16 లక్షలను ఖర్చు చేసినట్లు పత్రికలు తెలిపాయి.

2015లో కోల్‌కతా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పీలే (ఎడమ)

కట్టలు తెంచుకున్న అభిమానం

అభిమానులను నియంత్రించేందుకు దాదాపు 35 వేల మంది పోలీసులను మోహరించారు. టికెట్ ధర రూ. 5 నుంచి 60 వరకు ఉంది.

అప్పట్లో పీలేను స్థానిక పత్రికలు 'కింగ్ పీలే’, 'ది ఎంపరర్’ అని సంబోధిస్తూ కథనాలు రాశాయి.

హిందుస్తాన్ స్టాండర్డ్ పత్రిక ఇంకొంచెం ముందకు వెళ్లి, 'నిరహంకారి, నిరాడంబరుడు అయిన పీలే లియోనార్డో డా విన్సీ, బీథోవెన్ వంటి ఆల్-టైమ్ గ్రేట్‌లకు సరిసమానుడు. ఈ ఆటంటే పడిచచ్చే వాళ్లకు ఆయన ఫుట్‌బాల్ మోనాలిసా, నైన్త్ సింఫనీ లాంటి వాడు’ అని రాసింది.

''ఇక్కడ ఫుట్‌బాల్ వ్యామోహం తీవ్రంగా ఉంది. పీలే రావడం, అందులోనూ కలకత్తాకు రావడం నమ్మశక్యంగా లేదు’’ అని ఓ టీ స్టాల్ దగ్గరున్న ఒక వాల్‌పోస్టర్‌పై రాసి కనిపించింది.

పీలే ఎలా ఆడారో వివరిస్తూ ఒక స్థానిక పేపర్ మొదటి పేజీలో గ్రాఫిక్స్‌తో రూపంలో రాసింది.

ఒక హెల్త్ డ్రింక్స్ అడ్వర్టయిజ్‌మెంట్‌లో ఆయన పేరు కనిపించింది.

లాటరీ డ్రా ద్వారా మ్యాచ్ టిక్కెట్లు అమ్మనుండటంతో, వాటి కోసం స్టేడియం వెలుపల పెద్ద ఎత్తున ఫ్యాన్స్ క్యూ కట్టి కనిపించారు.

ఈ ఉత్సాహానికి విరుద్ధంగా ఈ మ్యాచ్‌లో పీలే అనారోగ్యానికి గురవుతారని, ఆట మొత్తం ఆడలేరంటూ ఒక జ్యోతిష్యుడు జోస్యం చెప్పారు.

సెప్టెంబర్ 22 అర్ధరాత్రి టోక్యో నుంచి పీలే ఇండియా చేరుకున్నారు. ఆ సమయంలో నగరంలో రష్ పెరిగిపోయింది.

ఎయిర్ పోర్టు లోపల, బయట పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారని వార్తా పత్రికలు రాశాయి. 'పీలే వర్ధిల్లాలి’ అని అరుస్తూ అభిమానులు కనిపించారని పేర్కొన్నాయి.

ఎయిర్ పోర్టు బయట రాత్రి సమయంలో ఇంతమంది జనాలను తానెప్పుడూ చూడలేదని బెంగాలీలో అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న ఆనందబజార్ పత్రికకు చెందిన రిపోర్టర్ ఒకరు వ్యాఖ్యానించారు. నగరం నలుమూలల నుంచి అభిమానులు తరలి వచ్చారని పేర్కొన్నారు.

పీలే రావడంతో భద్రతా వలయాన్ని ఛేదించుకుని బోయింగ్ 707 విమానం వైపు అభిమానులు దూసుకెళ్లారు.

''పీలే విమానం నుంచి బయటికి వచ్చారు. వి (విజయం) సింబల్ చూపించి, తిరిగి లోపలికి వెళ్లారు’’ అని వార్తాపత్రికలు రాశాయి.

భార్య రోజ్ మేరీతో పీలే

విమానాశ్రయంలో అద్దాలు ధ్వసం.. పోలీసుల లాఠీఛార్జ్

పోలీసులు విమానాశ్రయంలో అభిమానుల గుంపును చెదరగొట్టిన అనంతరం పీలే ఆయన భార్య రోజ్‌మెరీ, జట్టు సభ్యులతో బయటికొచ్చారు.

వరల్డ్‌కప్ గెలిచిన బ్రెజిల్ జట్టులోని ఆటగాడు కార్లోస్ అల్బెర్టో టోర్రెస్, ఇటాలియన్ ప్లేయర్ జార్జియో చినాగ్లియా వంటి స్టార్లూ ఇందులో ఉన్నారు.

వాళ్లు టెర్మినల్ భవనానికి వెళ్లారు. అక్కడ విలేఖరుల వేచి ఉండటంతో పీలే "నేను అలసిపోయాను, ఫీల్డ్‌లో కలుసుకుందాం" అని అన్నారు.

పీలే గురించి ఎక్కువ వార్తలు కవర్ చేయాలనుకున్న విలేఖరులు, పీలేతోపాటు విమానంలో వచ్చిన ఒక జపనీస్ సహ-ప్రయాణికుడిపైనా ప్రశ్నల వర్షం కురిపించారు.

"ఫ్లైట్‌లో నేను ఆయనతో మాట్లాడాలనుకున్నా. కానీ ఇంగ్లిష్ ఎక్కువ రాదు. ఆయన్ను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. పైగా పీలే ఫ్లైట్‌లో పడుకున్నారు" అని ఆ ప్రయాణికుడు చెప్పారు.

అయితే తమ దిగ్గజాన్ని చూడలేకపోవడంతో విమానాశ్రయం లోపల అభిమానులు రణరంగం స‌ృష్టించారు. అక్కడి అద్దాలు పగులగొట్టి, బూట్లు విసిరారు.

దీంతో పోలీసులు అభిమానులపై లాఠీఛార్జ్ సైతం చేయాల్సి వచ్చింది. బయట వేలాది మంది అభిమానులు కారు పార్కింగ్ చుట్టూ చేరారు.

''పీలే వెళ్లిపోతున్నారు, పీలే వెళ్లిపోతున్నారు అంటూ ఒక్కసారిగా ఎవరో గట్టిగా అరిచారు. దీంతో జట్టును నగరానికి తీసుకెళ్లే వాహనం ఎక్కడుందో కనుక్కోవడానికి అభిమానులు పరుగులు పెట్టారు’’ అని వార్తా పత్రికలు రాశాయి.

కలకత్తా నడిబొడ్డున ఉన్న ఒక లగ్జరీ హోటల్‌కు తీసుకెళ్లేందుకు పోలీసులు పీలే, కాస్మోస్ ఆటగాళ్లను బస్సు ఎక్కించారు. హోటల్ లాబీ అభిమానులతో కిక్కిరిసింది.

వార్తా పత్రికల కథనాల ప్రకారం పీలే రెండు రోజుల పాటు ఆయన భార్యతో గదిలోనే ఎక్కువగా ఉన్నారు.

పక్క గదిలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అమెరికా ఎంబసీ, మోహన్ బగాన్ క్లబ్ నిర్వహించిన రెండు కార్యక్రమాలకు పీలే హాజరయ్యారు.

"మేం ఈ ప్రేమ కోటలో చిక్కుకున్నాం" అని పీలే భార్య రోజ్ మేరీ ఒక విలేఖరితో వ్యాఖ్యానించారు.

పీలే

మ్యాచ్ ఆడేందుకు పీలే నిరాకరించారా?

స్థానిక వార్తా పత్రికల కథనం ప్రకారం పీలే వారాంతంలో జరిగే మ్యాచ్ కోసం తన జట్టుతో కలిసి ఈడెన్ గార్డెన్స్‌కు వచ్చారు.

గ్రౌండ్‌ తడిగా, బురదగా ఉన్నప్పటికీ 90 నిమిషాల పాటు ఆడతానని పీలే చెప్పినట్లు పత్రికలు రాశాయి.

నోవీ కపాడియా అనే ఫుట్‌బాల్ రచయిత మాత్రం తన పుస్తకం 'బేర్‌ఫుట్ టు బూట్స్: ది మెనీ లైవ్స్ ఆఫ్ ఇండియన్ ఫుట్‌బాల్‌’ లో మరో విధంగా రాసుకొచ్చారు.

''గ్రౌండ్ జారుతుండటంతో ఆడేందుకు పీలే నిరాకరించినంత పని చేశారు. పోలీసు అధికారులు ఆయన్ను వేడుకున్నారు. మీరు ఆడకపోతే ప్రేక్షకులు మోహన్ బగాన్ క్లబ్ అధికారులను కొడతారని చెప్పారు. దీంతో పీలే ఒప్పుకున్నారు. కానీ, మ్యాచ్ అంతటా జాగ్రత్తగా ఉన్నారు’’ అని పుస్తకంలో రాశారు.

వార్తా పత్రికలు ఎందుకు విమర్శించాయి?

పీలే

అంతకు ముందు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో దెబ్బతిన్న మైదానంలో మోహన్ బగాన్ జట్టుపై పీలే జట్టు సరిగా ఆడలేకపోయింది. దీంతో మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది.

పీలే మైదానం వీడగానే అక్కడ నిశ్శబ్దం అలుముకున్నట్లు పత్రికలు తెలిపాయి. ఇందుకు భిన్నంగా మోహన్ బగాన్ జట్టు మైదానాన్ని విడగానే వేలాది మంది చప్పట్లు కొట్టారు.

కోల్‌కతాకు పీలేపై ఉన్న పిచ్చి అభిమానం కరిగిపోవడం మొదలైందని పత్రికలు రాశాయి.

ఓ పత్రిక తన హెడ్‌లై‌న్‌లో ''పీలేకు ముసలితనం వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది’’ అని రాసింది.

స్థానిక ఫుట్‌బాల్ పండితులు పీలే జట్టు ఆట తీరుపై పెదవి విరిచారు.

"పీలేను కోల్‌కతాకు ఆహ్వానించారు. మన యువ ఫుట్‌బాల్ ప్లేయర్లు ఆట గురించి మరింత తెలుసుకునే అవకాశం దక్కింది. నిర్వాహకులు కూడా మాకు అదేమాట చెప్పారు. అయితే, ఏమీ చేయకుండా మైదానంలో 90 నిమిషాలు గడపడం ఎలా అన్నది మన వాళ్లు నేర్చుకున్నారు’’ అని ఆనంద బజార్ పత్రికలో బెంగాలీ క్రీడా రచయిత మోతీ నంది రాశారు.

ఈ మ్యాచ్ తర్వాత పీలేపై ఉన్న పిచ్చి ఆవిరైపోయింది. హోటల్ బయట ఆయన కోసం ఎదురు చూసే అభిమానులు తగ్గిపోయారు.

ఓ అభిమాని అయితే అధికార పార్టీకి చెందిన ఓ మంత్రిని ఉద్దేశించి "నకిలీ పీలేని కలకత్తాకు తీసుకువచ్చారు" అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

"మీరు మ్యాచ్ టిక్కెట్ డబ్బును తిరిగి చెల్లించాలి" అని అదే మంత్రిని కమ్యూనిస్టు ఎంపీ ఒకరు డిమాండ్ చేశారు.

పీలే ఆదివారం రాత్రి న్యూయార్క్‌కు బయలుదేరినప్పుడు విమానాశ్రయానికి కూడా జనం పెద్దగా రాలేదు.

"ది కింగ్స్ డిప్రెసింగ్ డిపార్చర్" (కింగ్ నిరుత్సాహపరిచే నిష్క్రమణ) అంటూ ఒక వార్తాపత్రిక కథనాన్నిరాసింది.

అభిమానుల ఉత్సాహం తగ్గిపోయిందని పేర్కొంది.

ప్రముఖ పాత్రికేయుడు సంతోష్ కుమార్ ఘోష్ మాట్లాడుతూ '' కాస్మోస్ జట్టు కోసం నిర్వాహకులు చేసిన ఖర్చులోని కొంతభాగంతో నగరంలోని అనేక రోడ్లను అందంగా తీర్చిదిద్దవచ్చు’’ అని వ్యాఖ్యానించారు.

"కాస్మోస్ ఆటగాళ్లు వారి సామర్థ్యంలో 25% కంటే ఎక్కువ ఆడలేదు. వాళ్లు టైమ్ పాస్ చేయడానికే ఆసక్తి చూపించారు’’ అని ప్రసిద్ధ క్రీడా వ్యాఖ్యాత అరిజిత్ సేన్ రాశారు.

''వాళ్లకు కావాల్సింది దక్కింది. పేద భారతీయులు కష్టపడి సంపాదించిన డబ్బుతో వారి గల్లాపెట్టె నిండిపోయింది’’ అని విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why did Pele's football match in India become a controversy?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X