వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనం ఎందుకు చనిపోతాం? సంతాన సామర్థ్యం.. వృద్ధాప్యానికీ, మరణానికీ దారితీస్తుందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

అసలు మరణం ఎందుకు అందరినీ వెంటాడుతుంది? జెల్లీఫిష్‌లను జాగ్రత్తగా గమనిస్తే ఈ సందేహాలకు మనకు సమాధానం దొరకొచ్చు.

సముద్రాలు, నదుల్లో హాయిగా జీవిస్తున్న అద్భుతమైన జీవుల్లో హైడ్రా ఒకటి. దీని గురించి మనం పెద్దగా పట్టించుకోం. కానీ, దీనిలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. దైవంగా కొలిచే ప్రాచీన గ్రీకు సర్పం పేరును దీనికి పెట్టారు. ఈ గ్రీకు సర్పం తల నుంచి కొత్త జీవులు పుట్టేవని కథల్లో చెబుతుంటారు. హైడ్రా కూడా ఇలానే కొత్త జీవులకు జన్మ నివ్వగలదు. జెల్లీఫిష్‌, అనెమోన్స్, కోరల్స్ జాతికి చెందిన హైడ్రాలు మంచినీటిలో కనిపిస్తాయి.

సన్నంగా, పొడవైన శరీరంతో హైడ్రాలు కనిపిస్తాయి. వీటికి ఒక చివర మీసాల్లాంటి నిర్మాణాలుంటాయి. అంతకుమించి వీటిలో పెద్దగా చూడటానికేమీ ఉండదు. అయితే, శాస్త్రవేత్తలను అబ్బురపరిచే ఓ గుణం వీటిలో ఉందని కనిపెట్టారు. హైడ్రాలను ముక్కలు ముక్కలుగా కోస్తే, ఒక్కో ముక్క ఒక కొత్త జీవిగా మారిపోగలదు.

ఇలా శరీర భాగాల నుంచి కొత్త జీవులను పుట్టించే ఈ విధానంతో అసలు మరణం లేకుండా జీవించొచ్చా? అనే ప్రశ్న శాస్త్రవేత్తలకు తట్టింది. ఎందుకంటే ఈ జీవుల్లో సహజ మరణం అనేది కనిపించదు.

పిల్లలు పుట్టించేందుకు..

వయసు పైబడటానికి గల కారణాలపై 20వ శతాబ్దంలో కొత్త సంగతులు వెలుగుచూశాయి. ప్రత్యుత్పత్తి, కణాల నిర్వహణ వల్లే వయసు పైబడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మొదట్లో జీవులు తమకు అందుబాటులో ఉండే వనరులతో తమ శరీరాన్ని ఆరోగ్యంగా తీర్చిదిద్దుతాయి. అంటే కణాల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తాయి. బాల్యం, యవ్వన దశల్లో ఆరోగ్యంతో జీవించడం, దృఢంగా మారడంపైనే జీవులు దృష్టిపెడతాయి. అయితే, ఒకసారి లైంగిక పరిపక్వత వచ్చిన తర్వాత పిల్లలు పుట్టించడమే ప్రాధాన్యంగా జీవులు ముందుకు వెళ్తాయి. వనరులు పరిమితంగా ఉండటంతోపాటు పిల్లల జననానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఆరోగ్యంగా జీవించాలానే లక్ష్యం నీరుగారుతుంది.

ఉదాహరణకు సాల్మన్ చేపలను గమనించండి. ఇవి గుడ్లు పెట్టడానికి ప్రవాహానికి ఎదురీదుతాయి. అయితే, గుడ్లు పెట్టిన తర్వాత ఇవి మరణిస్తాయి. గుడ్లు పెట్టేందుకు అనువైన ప్రాంతాన్ని వెతికేందుకు ఈ చేపలు తమ శక్తినంతా ధారపోస్తాయి. ఒకసారి మంచి అవకాశం దొరికిన తర్వాత, వెంటనే గుడ్లు పెట్టేస్తాయి. ఆ తర్వాత మళ్లీ అవి ప్రవాహంతోపాటు దిగువకు వచ్చి ఎప్పటిలానే సముద్రంలో జీవించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే, ఏదిఏమైనప్పటికీ తమ జన్యువులను ఇవి విజయవంతంగా భవిష్యత్ తరాలకు బదిలీ చేస్తుంటాయి.

అయితే, అసలు జీవులు ఎందుకు చనిపోతాయనే అంశంపైనే ప్రస్తుతం దృష్టి సారిద్దాం. జీవులు లైంగిక పరిపక్వతకు చేరుకున్నప్పుడు.. నేచరల్ సెలక్షన్ శక్తి బలహీనపడుతుంది. క్రమంగా వయసు పైబడే ప్రక్రియలు మొదలవుతాయి. ''వయసు పైబడటానికి పిల్లలు పుట్టించడం ప్రధాన కారణం. దీన్ని మనం ఇతరులు లేదా భవిష్యత్ తరాలకు మేలు అనే కోణంలో చూసినప్పుడు చాలా గొప్పగా అనిపించొచ్చు’’అని బ్రిటన్‌లోని ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అలెక్సీ మక్లాకోవ్ చెప్పారు.

సాల్మన్

మన జీవిత కాలంలో జన్యువులు పరివర్తనకు గురవుతాయి. వీటినే జీన్ మ్యుటేషన్లుగా పిలుస్తారు. వీటిలో కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతాయి. మరికొన్నింటికి ఆహారం తీసుకునే విధానం, యూవీ కాంతి లాంటి కారణాలు కూడా ఉన్నాయి. చాలా మ్యుటేషన్లతో ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇవి పెద్ద హానికరం కూడా కాదు. అయితే, కొన్ని మ్యుటేషన్లతో ఉపయోగం కూడా ఉంటుంది. ''ఒకసారి జీవి లైంగిక పరిపక్వతకు చేరుకుంటే, తన జన్యువులను భవిష్యత్ తరాలకు బదిలీచేసే సామర్థ్యం దీనికి వస్తుంది’’అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఎవల్యూషనరీ బయాలజిస్టు గాబ్రియెల్లా కౌంటూరైడ్స్ చెప్పారు.

ఇప్పుడు గుడ్లు పెట్టే సాల్మన్ చేపను పరిశీలిద్దాం. గుడ్లు పెట్టే ముందు, ఇది పూర్తి పరిపక్వతకు చేరుకుంటుంది. దీని పిల్లలు కూడా ఇలానే ప్రవాహానికి ఎదురెళ్లి గుడ్లు పెడుతుంటాయి. అయితే, ఒకవేళ గుడ్లు పెట్టిన తర్వాత ఈ చేపల్లో మ్యుటేషన్లు జరిగి, మరో ఏడాదిపాటు ఇవి జీవించగలిగితే, పిల్లలకు మాత్రం ఆ జన్యు మార్పులు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ మ్యుటేషన్లకు ముందే అవి జన్మించి ఉంటాయి.

పిల్లలు పుట్టిన తర్వాత కూడా మళ్లీ ఆరోగ్యంగా ఉండేందుకు జీవులు చేసే ప్రయత్నాల వల్ల అంతగా ప్రయోజనం కనిపించదు. ''పిల్లలు పుట్టిన తర్వాత కూడా జీవులు బతికే ఉంటాయి. కానీ, అప్పుడు నేచురల్ సెలక్షన్ పెద్దగా పనిచేయదు. ఎందుకంటే భవిష్యత్ తరాలకు ఇచ్చేందుకు అప్పుడు ఏమీ ఉండదు’’అని గాబ్రియెల్లా అన్నారు.

అయితే, అన్ని జీవులూ సాల్మన్ చేపల్లా ప్రాణాలకు తెగించి గుడ్లు పెట్టవు. కొన్ని జీవులు పిల్లలు పుట్టించిన తర్వాత కూడా సుదీర్ఘ కాలం జీవిస్తాయి. మన డీఎన్ఏలోని చాలా మ్యుటేషన్లు నెగెటివ్ స్పందనలు లేదా ఎలాంటి స్పందనలూ లేకుండా ఉంటాయి. అయితే, ఇలా దెబ్బతిన్న డీఎన్ఏలను బాగుచేసుకునే సామర్థ్యం మన శరీరాలకు ఉంటుంది. అయితే, ఇలా మరమ్మతులు చేసుకునే సామర్థ్యం కూడా క్రమంగా తగ్గిపోతుంది.

ఆ తర్వాత, కణజాలంలో వృద్ధ కణాలు పేరుకుంటాయి. దీంతో ఇన్‌ఫ్లమేషన్ చుట్టుముడుతుంది. వయసు పైబడటంతో వచ్చే వ్యాధులకు ఇది ముందు దశ.

రెండు విధాలుగా..

అయితే, వయసు పైబడటం, మరణం అనేది రెండు విధానాల్లో జరుగుతుంది. వీటిలో మొదటిది శరీరంలో నెగెటివ్ మ్యుటేషన్లు పేరుకోవడం. వీటి వల్ల పిల్లలు పుట్టించే సామర్థ్యం పెరగొచ్చు. కానీ, ఆ తర్వాత కాలంలో ఇవి ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.

బీఆర్‌సీఏ జన్యు మ్యుటేషన్‌ను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీటివల్ల రొమ్ము, అండాశయ క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది. అయితే, ఈ మ్యుటేషన్లు ఎక్కువగా ఉండే మహిళల్లో సంతాన సాఫల్య రేటు కూడా ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. వాటి ప్రకారం, పిల్లలు పుట్టే అవకాశాలు పెరిగేందుకు తోడ్పడే బీఆర్‌సీఏ లాంటి జన్యు మ్యుటేషన్లు భవిష్యత్‌లో ముప్పుగా పరిణమిస్తాయి.

''తొలి నాళ్లలో కనిపించే సమస్యలు కొన్ని పిల్లలు పుట్టే దశలో కనిపించవు. ఎందుకంటే పిల్లలు పుట్టే దశ అనేది చాలా ముఖ్యమైనది’’అని ఆరేగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన బయోలజిస్టు కైట్లిన్ మెక్‌హ్యూజ్ చెప్పారు.

జీవిత తొలి దశల్లో ఉపయోగపడి, తర్వాత దశల్లో ముప్పుగా పరిణమించే వాటిలో ''సెల్ సెనెస్సెన్స్’’ కూడా ఒకటి. ఈ ప్రక్రియలో కణాలు విభజనకు గురికావడం నిలిచిపోతుంది. దెబ్బతిన్న డీఎన్ఏ కలిగిన కణాల సంఖ్య పెరగకుండా మొదట్లో ఇది మనకు రక్షణ కల్పిస్తుంది. అయితే, తర్వాత దశలో ఈ కణలాలు కణజాలంలో పేరుకుంటాయి. ఫలితంగా ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది.

కొన్ని మినహాయింపులు కూడా..

దాదాపు అన్ని జీవుల్లోనూ వయసు పైబడే సంకేతాలు కనిపిస్తాయి. అయితే, దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. కొన్ని చెట్లలో సెల్ సెనెస్సెన్స్ (వయసు పెరుగుతున్న కొద్దీ క్షీణించడం) కనిపించదు. అందుకే అవి వేల ఏళ్లపాటు జీవిస్తుంటాయి. యూటాలోని ఫిష్‌లేక్ నేషనల్ ఫారెస్ట్‌లో పండో చెట్లు ఇలాంటివే. వేళ్లన్నీ కలిపేవుంటూ ఒకేలాంటి జన్యవులతో ఏళ్లుగా ఈ చెట్ల సమూహం జీవిస్తోంది. దాదాపు వంద ఎకరాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. వీటి బరువు 6000 టన్నులకుపైనే ఉంటుంది. వీటి వయసు పది వేల ఏళ్లకుపైనే ఉండొచ్చు.

హైడ్రాతో లాంటి జీవులు కూడా ఇలానే ఏళ్లపాటు జీవిస్తున్నాయి. ఏదైనా దెబ్బ తగిలినా, వ్యాధి వచ్చినా, ఒత్తిడికి గురైనా వయసు పైబడిన దశను మళ్లీ ఇవి మొదట దశలోకి తీసుకెళ్తుంటాయి.

''అయితే, దీన్ని అదే జీవిగా పరిగణించాలా? లేదా కొత్త జీవిగా చూడాలా అనేదే అసలు ప్రశ్న’’అని మెక్‌హ్యూజ్ అన్నారు.

''మరోవైపు కొన్ని జీవులు వయసు పెరిగేకొద్దీ మరింత ఆరోగ్యంగా ఉంటాయనే వాదన కూడా ఉంది. దీన్ని నెగెటివ్ సెనెస్సెన్స్‌గా చెబుతారు. అయితే, దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేవు’’అని మక్లాకోవ్ అన్నారు.

కొన్ని జీవుల్లో వయసు పైబడినప్పటికీ, సంతాన సామర్థ్యంలో ఎలాంటి మార్పూ ఉండదు. ''వీటిని నెగెటివ్ సెనెస్సెన్స్‌కు ఉదాహరణగా చెప్పలేం. ఎందుకంటే ఇలాంటి జీవులపై చేపట్టిన అధ్యయనాల్లో ఎలాంటి స్పష్టమైన ఫలితాలు వెల్లడికాలేదు’’అని మాక్లాకోవ్ చెప్పారు.

సెక్స్ ప్రధాన పాత్ర..

అయితే, వయసు పైబడటంలో సెక్స్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే తరచూ సెక్స్‌లో పాల్గొనే మహిళల్లో మెనోపాజ్ ఆలస్యంగా వస్తుందని యూనివర్సిటీ కాలేజీ లండన్‌కు చెందిన మేఘన్ ఆర్నట్, రూత్ మేస్‌లు చేపట్టిన అధ్యయనంలో తేలింది.

కానీ, జంతువుల్లో సంతాన సామర్థ్యం ఎక్కువగా ఉంటే, వయసు కూడా త్వరగా పైబడుతుంది. ఉదాహరణకు తక్కువ కాలంలోనే ఎక్కువ పిల్లలను కనే గబ్బిలాలు తక్కువ కాలం జీవిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. ఎందుకంటే పిల్లలు పుట్టించడానికి అవి తమ శక్తిని మొత్తం ధారపోస్తుంటాయి. ''ఇక్కడ సమయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. యవ్వనంతో ఉండేటప్పుడు జీవుల్లో సంతాన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అయితే, వయసు పెరిగేకొద్దీ ఇది తగ్గుతుంటుంది’’అని మెక్‌హ్యూజ్ అన్నారు. అయితే, ఈ సిద్ధాంతానికి హైడ్రాలు మినహాయింపుగా చెప్పుకోవాలి. ఎందుకంటే వయసు పెరిగేటప్పుడు వాటి సంతాన రేటు తగ్గిపోవడం లాంటిదేమీ ఉండదు.

కొన్ని జీవుల్లో ఆడ, మగ జీవుల మధ్య జీవిత కాలంలోనూ తేడా ఉంటుంది. చీమలు, తేనెటీగలు, చెద పురుగులను తీసుకోండి. వీటిలో రాజు లేదా రాణి లాంటి జీవులు ఉంటాయి. ఇవి మిగతా జీవులతో పోల్చినప్పుడు సుదీర్ఘ కాలం జీవిస్తుంటాయి. వీటి సంతాన రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే, పిల్లలు పుట్టినప్పుడు వీటి జీవిత కాలం ఎందుకు తగ్గిపోవడం లేదు? ఎందుకంటే ఇక్కడ రాజు లేదా రాణి జీవులకు ముప్పులు చాలా తక్కువగా ఉంటాయి. ఆ ముప్పులను కార్మిక జీవులు తీసుకుంటాయి. వీటి జీవన శైలి కూడా భిన్నంగా ఉంటుంది. అందుకే సాధారణ సిద్ధాంతాలు ఇక్కడ వర్తించవు.

వృద్ధులు

ఒకవేళ జీవిత కాలంపై పిల్లలు పుట్టించే సామర్థ్యం ప్రభావం చూపితే.. మనుషులు మాత్రం పిల్లలు పుట్టిన తర్వాత కూడా సుదీర్ఘ కాలం ఎలా జీవిస్తున్నారు?

ఇప్పుడు ''గ్రాండ్‌మథర్ హైపోథీసిస్’’ గురించి చెప్పుకోవాలి. ఇక్కడ వయసు పైబడిన వారు చుట్టుపక్కల ఉండటం చాలా అవసరం. ఎందుకంటే పిల్లలు పుట్టడం అనేది చాలా ముప్పులతో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ గ్రాండ్‌మథర్‌లు జీవితాంతం మనవళ్లు, మనవరాళ్లతో గడుపుతూ వారిలోని వచ్చే జన్యు మార్పులనే పిల్లల్లోనూ వచ్చేందుకు కారణం అవుతుంటారు. ''ఉదాహరణకు ఇంట్లో పెద్దవారుండే కుటుంబాల్లో రీప్రొడక్టివ్ ఫిట్‌నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కనడంపై తల్లులు దృష్టిసారిస్తే, వారిని పెంచడాన్ని పెద్దవారు చూసుకుంటారు’’అని కౌంటూరైడ్స్ అన్నారు.

ఇప్పుడు, పిల్లలను కన్న తర్వాత మనలో ప్రతికూల ప్రభావాలు వస్తాయనే వాదన దగ్గరకు వద్దాం. ప్రతికూల ప్రభావాలు వచ్చినప్పటికీ పరిణామక్రమంలో ముందుకు వెళ్లేందుకు వీటిని మనం భరించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why do we die? Does fertility lead to old age and death?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X