వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతదేశంలో వ్యవసాయ దిగుబడి ఎందుకు తగ్గుతోంది? లోపం రైతుల్లో ఉందా ? విధానాలలో ఉందా ?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మహిళా రైతు

భారత్‌లో వ్యవసాయం ఒక వ్యక్తితో నడిచే పనికాదు. అది ఒక సామూహిక వ్యవహారం. రైతు సేద్యం చేస్తారు. ప్రభుత్వం అతనికి విద్యుత్, ధరల విషయంలో చట్టపరమైన సహకారం అందిస్తుంది. ప్రైవేటు వ్యాపారులు పంటకు విలువను జోడిస్తారు. దాన్ని వినియోగదారుడి దగ్గరకు చేర్చే పాత్రను మార్కెట్‌ పోషిస్తుంది.

అయితే, ఈ వ్యవస్థలోని కొందరి అసమర్థత కారణంగా దేశంలో అదనపు ఉత్పత్తి ముఖ్యంగా వరి, గోధుమల విషయంలో ఎక్కువగా జరిగింది. 1950లో సుమారు 5 కోట్ల టన్నులుగా ఉన్న ఈ అదనపు ఉత్పత్తి, నేడు 50 కోట్ల టన్నులకు చేరుకుంది.

కానీ, ఇప్పటికీ దేశంలోని పంటల దిగుబడి రేటు మాత్రం తక్కువగానే ఉంది. ప్రపంచ సరాసరి దిగుబడితో పోల్చినప్పుడు ఈ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికా తర్వాత అత్యధిక శాతం వ్యవసాయ భూమి ఉన్న దేశం భారత్. దిగుబడిలో మాత్రం ఆ దేశం కన్నా నాలుగురెట్లు వెనకబడి ఉంది.

ఉత్పత్తి ఎక్కువగా ఉన్నా భారతదేశంలో దిగుబడి శాతం తక్కువగా ఉంది

భారత్‌తో పోల్చినప్పుడు చైనాలో సేద్యపు భూమి తక్కువ, కానీ దిగుబడి ఎక్కువ. భారతదేశపు సగటు వ్యవసాయ భూకమతం వినియోగం 1.08 హెక్టార్లు కాగా చైనాలో అది 0.67 హెక్టార్లుగా ఉంది. కానీ ఆ దేశ వ్యవసాయోత్పత్తి భారత్‌ కన్నా మూడింతలు ఎక్కువ.

“వ్యవసాయంలో వైవిధ్యంతోపాటు పరిశోధన, అభివృద్ధి మీద వారు ఎక్కువ దృష్టిపెడతారు’’ అని వ్యవసాయ ఆర్ధికవేత్త ప్రొఫెసర్‌ అశోక్‌ గులాటీ చెప్పారు.

అయితే, ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే, భారతదేశం తలచుకుంటే తన వ్యవసాయోత్పత్తిని రెండింతలు చేయగలదు. దురదృష్టం ఏంటంటే దీన్ని సాధించాలంటే ఇంకా ఒకట్రెండు తరాలు పడుతుంది.

రైతు

దిగుబడిఎందుకు తక్కువగా ఉంది?

భారతదేశంలో వ్యవసాయం అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. రుతుపవనాలు, భూగర్భజలాలు నీటి యాజమాన్య నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తాయి. సేద్యానికి ఆరోగ్యకరమైన, పోషకాలున్న నేల అవసరం. అనేక జీవ క్రియలు జరిగేందుకు అవసరమైన వాతావరణం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇలాంటి ఆరోగ్యకరమైన నేల ఉపరితలం భూసారాన్ని కాపాడి పోషక విలువలున్న పంటలను అందిస్తుంది.

అయితే అనేక కారణాల వల్ల ఈ వ్యవసాయ రంగంలోఈ శృంఖలం(చైన్‌) తెగిపోయిందని, దీన్ని వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మహిళా రైతు

నేలకు ప్రాణం ఉంటుంది

భారతదేశంలోని వ్యవసాయ యోగ్యమైన నేలలో 40శాతం ఇప్పటికే దెబ్బతిన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి చెడిపోవడం వల్ల అది నిస్సారంగా మారుతుంది.

అశాస్త్రీయమైన వ్యయసాయ పద్దతులు, నేలను పదేపదే ఉపయోగించడం, నీటివృథా, అడవుల నరికివేత, రసాయన ఎరువుల అతి వాడకంలాంటివన్నీ భూసారం తగ్గడానికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూమికి కూడా ప్రాణం ఉంటుందని అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీలో పని చేస్తున్న భారత సంతతి శాస్త్రవేత్త డాక్టర్‌ రతన్‌లాల్‌ అన్నారు. ఆయన ఇటీవలే సుప్రసిద్ధ 'వరల్డ్‌ ఫుడ్ ప్రైజ్‌’ను గెలుచుకున్నారు. డాక్టర్‌ రతన్‌లాల్‌ అభిప్రాయం ప్రకారం భూమి ఒక జీవం ఉన్న పదార్ధం.

“సారవంతమైన నేలలో అనేక జీవులు ఉంటాయి. మనిషిలాగే భూమికి కూడా ఆహారం అవసరం. అది తీసుకునే ఆహారంలో పశువులు, మనుషులు, పొలాల నుంచి వచ్చే వ్యర్థాలు కీలకమైనవి. ఇలాంటి వ్యర్థాలను కాల్చేయడం వల్ల భూమికి నష్టంతోపాటు కాలుష్యం కూడా ఏర్పడుతుంది.( శీతాకాలంలో దిల్లీలో అధిక కాలుష్యానికి ఇదే కారణం ). వీటిని మనం తిరిగి భూమిలోకి పంపాలి’’ అన్నారు డాక్టర్‌ రతన్‌లాల్‌.

భూమి, మొక్కలు, జంతువులు, మనుషులు, ఇతర పర్యావరణం ఒకటేనని, ఒకదాన్నుంచి మరొకటి విడదీయలేనివని లాల్‌ అంటారు. నీటిని వడకట్టడంలాంటి అనేక చర్యలను భూమి నిర్వహిస్తుందని ఆయన అన్నారు.

భూమిలో సేంద్రీయత 3-4శాతం ఉండాలని, కానీ ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని నేలల్లో కేవలం 0.2శాతం మాత్రమే సేంద్రీయత ఉందని లాల్‌ అన్నారు. ఇంత తక్కువ సేంద్రీయత ఉండటం వల్ల పంటల దిగుబడితోపాటు, పోషక విలువలు కూడా తక్కువగా ఉంటాయని డాక్టర్‌ లాల్ చెప్పారు.

ఆరోగ్యవంతమైన నేలను ఉపయోగించడం వల్ల తక్కువ భూమిలో ఎక్కువ పంటలను పండించవచ్చని లాల్‌ అన్నారు. తక్కువ విద్యుత్‌, రసాయన ఎరువులతోనే అధిక దిగబడులు సాధించవచ్చని లాల్‌ పేర్కొన్నారు.

నేలలోని సారాన్ని కాపాడుకోలేక పోవడమే భారతదేశపు అతి పెద్ద సమస్య అంటారు డాక్టర్ రతన్‌లాల్. వర్షాలు వరదలు వచ్చినప్పుడు భూసారం కొట్టుకుని పోతుందని, వర్షాలు రానికాలంలో అక్కడ కరువు కాటకాలు ఏర్పడుతున్నాయని ఆయన వివరించారు.

ఒక ప్రాంతంలో నేల 2.5 సెంటీమీటర్ల మందంలో సారవంతంగా మారడానికి 500 సంవత్సరాలు పడుతుందని, కానీ అది నాశనం కావడానికి కేవలం ఒక దశాబ్దం చాలని ఐక్య రాజ్య సమితి రూపొందించిన ఒక నివేదిక వెల్లడించింది.

మహిళా రైతు

దగ్గరి దారుల్లేవు

భారతదేశంలో భూసారాన్ని అవసరమైన స్థాయికి పెంపొందించడానికి ఒకటి లేదా రెండు తరాలు పడుతుందని రతన్‌ లాల్ చెప్పారు. “సారవంతమైన భూమిలో మంచి సేద్యపద్దతులు ఉపయోగించినప్పుడు ఒక హెక్టారు 2.1 టన్నుల దిగుబడి సాధించవచ్చు. ఇప్పటికిప్పుడు భూసారం పెంపొందించడం మొదలుపెట్టినా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే 2050 వరకు వేచి చూడాల్సి ఉంటుంది. నేను 1980లో ఒక చైనా బృందానికి ట్రైనింగ్‌ ఇచ్చాను. వారు నేటికి నేలను అవసరమైన మేరకు సారవంతం చేసుకోగలిగారు” అని రతన్‌లాల్‌ వివరించారు.

“పంటకు పంటకు మధ్య మేమొక పప్పు ధాన్యాన్ని విత్తుతాం. తర్వాత వాటిని దున్ని భూమిలో కలిపేస్తాం. దీనివల్ల నేలలో సారం పెరుగుతుంది. యూరియా అవసరం ఎక్కువగా ఉండదు’’ అని కిసాన్‌ శక్తి సంఘ్‌ నేత పుష్పేంద్ర సింగ్‌ అన్నారు.

డాక్టర్‌ లాల్‌ చెప్పిన విధానంలో భూమిని సేంద్రియం చేయాలంటే ఇదొక్కటే సరిపోదని పుష్పేంద్ర సింగ్‌ అన్నారు. ఈ విధానాలు పాటించాలంటే రైతుకు చాలా ఖర్చవుతుందని, దాన్ని భరించడం వారివల్ల కాదని పుష్పేంద్ర సింగ్‌ అన్నారు.

“ ఇంతకు ముందు ప్రతి రెండు పంటలకు మధ్య కొంతకాలం భూమిని సేద్యం చేయకుండా వదిలేసే వాళ్లం. కానీ ఇప్పుడు ఖర్చుల నుంచి బైటపడటానికి అలా చేయడం కుదరడం లేదు. రెండో పంట ఆదాయాన్ని ప్రభుత్వం ఇవ్వగలిగితే ఎవరూ ఆ పని చేయరు. కానీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు’’ అన్నారాయన.

మహిళా రైతు

వర్షాధార వ్యవసాయం

భారతదేశంలో సగం వ్యవసాయం వర్షాల మీదే ఆధారపడి ఉంటుంది. వాతావరణాన్నిబట్టి రైతులు ఆదాయాల్లో మార్పు ఉంటుంది.

గత 60 ఏళ్లలో భారతదేశలో 2.2 కోట్ల బావులను తవ్వారని ఐక్యరాజ్యసమితి పరిశోధనలో వెల్లడైంది. రాను రాను బావుల లోతు పెరుగుతోందని, అయినా నీళ్లురావడం కష్టంగా ఉందని స్పష్టమైంది.

పశ్చిమ భారతదేశంలో 30శాతం బావులు ఎండిపోయాయి. పలు రాష్ట్రాలలో భూగర్భ జలాలు నానాటికి తగ్గిపోతున్నాయి. రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో ఎడారీకరణ పెరిగిపోతోంది.

నీటి వనరులు సద్వినియోగం కోసం శాస్త్రవేత్తలు అనేక విధానాలను రూపొందించారు. ఇజ్రాయెల్‌లాంటి దేశాలు ఇలాంటి ప్రయోగాలలో ముందున్నాయి. అక్కడ 80శాతం భూమి పొడినేల. నీటి వసతి తక్కువ. కానీ ఈ విధానాల వల్ల తక్కువ నీటితో ఎక్కువ పంట దిగుబడిని సాధించడం సాధ్యమైంది.

బిందు సేద్యం(డ్రిప్‌ ఇరిగేషన్‌) అత్యుత్తమైన నీటి నిర్వహణ విధానంగా ప్రసిద్ధికెక్కింది. ఇది మొక్క వేళ్ల వరకు నేరుగా నీటిని తీసుకుపోవడం వల్ల నీటి వృథా తక్కువ అవుతోంది.

పంజాబ్‌లో భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతున్నాయి. దీనికి కారణం ఇక్కడ వరిలాంటి నీరు ఎక్కువ అవసరమైన పంటలను అధికంగా పండిస్తున్నారు. చెరకు, సోయాబీన్‌లాంటి పంటలకు కూడా నీరు అధికంగా కావాల్సి ఉంటుంది. అయితే బిందు సేద్యం వల్ల తక్కువ నీటితో పంటలు పండించవచ్చు.

భారతదేశంలో బిందు సేద్య విధానం దశాబ్దం కిందటే వచ్చినా, ఇప్పటికీ కేవలం 4% వ్యవసాయ భూమిలో మాత్రమే ఈ విధానాన్ని ఉపయోగించగలుగుతున్నారు.

“బిందు సేద్యం చెరుకుతోపాటు మరికొన్ని ఇతర పంటలకు వాడొచ్చు. కానీ వరికి ఇది ఉపయోగపడదు’’ అన్నారు పుష్పేంద్ర సింగ్‌. “టెక్నాలజీ బాగానే ఉంది. కానీ రైతులు వాటిని భరించాలి కదా’’ అంటారాయన.

మహిళా రైతు

వైవిధ్యం లేని వ్యవసాయం

కేవలం వరి, గోధుమ, చెరకు, పత్తి, సోయాబీన్‌లాంటి పంటలేకాకుండా ఇతర పంటలపై కూడా దృష్టి పెట్టాలని భారతీయ రైతులకు సూచిస్తున్నారు రతన్‌లాల్‌.

“ఉత్తర భారతదేశంలో నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి, చెరకు, గోధుమలాంటి పంటలనే పండిస్తున్నారు. ఇది సరికాదు’’ అన్నారాయన.

పండ్లు,పూలు, కూరగాయల్లాంటి ఇతర పంటలపై కూడా రైతులు దృష్టిపెడితే మంచిదని ఆయన అన్నారు. అతిగా సాగు చేయడం వల్ల వరి, గోధుమల ఉత్పత్తి ఇబ్బడిముబ్బడిగా పెరిగిందని, వాటిని దాచుకోవడానికి స్థలం కూడా లేదని డాక్టర్‌ లాల్‌ అన్నారు. పైగా అందులో 30శాతం ధాన్యాలు చెడిపోతున్నాయని రతన్‌లాల్‌ గుర్తు చేశారు.

పంటలలో వైవిధ్యం చూపాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్‌ గులాటీ కూడా అభిప్రాయపడ్డారు. చైనాలో రైతుల ఆదాయం పెరగడానికి అదే కారణమని అన్నారాయన. పంజాబ్‌లో సహజ వనరుల కొరతకు వరి అధికంగా పండించడమే కారణమని ప్రొఫెసర్‌ గులాటి అన్నారు.

అయితే పంటలలో వైవిధ్యం అంతగా ఉపయోగపడదని రైతు సంఘం నాయకుడు పుష్పేంద్ర సింగ్‌ అంటున్నారు. రైతుకు మద్ధతు ధర ముఖ్యమని ఆయన వాదించారు.

"వరి పండించే రైతులను పూలు, పళ్లు పండించని అడిగే ముందు వారికి కనీస మద్దతు ధర ప్రకటించాలి. లేకపోతే రైతుకు లాభం ఏంటి'’ అని పుష్పేంద్ర సింగ్‌ ప్రశ్నించారు.

ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటే దిగుబడులు పెరుగుతాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు

చిన్నకమతాలు- సాంకేతికత వినియోగం

2011లో నిర్వహించిన సర్వే ప్రకారంలో భారతదేశంలో సరాసరి వ్యవసాయ కమతం వైశాల్యం రెండు హెక్టార్లకంటే తక్కువగా ఉందని తేలింది. గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ భూమిలో నాలుగింట ఒకవంతు కమతాలు 0.4 హెక్టార్లకన్నా తక్కువేనని తేలింది.

ఆధునిక వ్యవసాయ విధానాలు, సమర్ధవంతమైన భూ వినియోగం, నీటి వనరుల నిర్వహణ దిగుబడిని పెంచడానికి చాలా ముఖ్యమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూసారం పెంచడంతోపాటు, సాంకేతికతను అధికంగా వాడినప్పుడు దిగుబడులు పెరుగుతాయని, శాటిలైట్ల ద్వారా భూసార పరిస్థితులను గుర్తించి వాటిని మెరుగుపరచడం ద్వారా ఫలితాలు సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రుతుపవనాలపై స్పష్టమైన అంచనా దిగుబడిపై ప్రభావం చూపుతుందని వారు అంటున్నారు.

“అమెరికాలో కేవలం 2%మంది వ్యవసాయదారులు ఆ దేశానికి సరిపడా ఆహారధాన్యాలు పండించగలుగుతున్నారు’’ అన్నారు రతన్‌లాల్‌. అమెరికా, చైనాలు అనుసరించిన విధానాలను భారత్‌ కూడా చేపట్టాల్సి ఉందని ఆయన అంటున్నారు.

“అమెరికాలో 2 శాతంమంది వ్యవసాయంపై ఆధారపడగా, భారతదేశంలో 60-70శాతంమంది ఈ వృత్తిలో ఉన్నారు. మార్పు మొదలు కావాల్సిన సమయం ఇది. ఈ రంగంలో ఎక్కువమంది ఉండటం వల్ల ప్రయోజనం లేదు’’ అన్నారు రతన్‌లాల్‌.

2018-19 సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలు భారత జీడీపీలో 17శాతం మాత్రమే భాగస్వామ్యం పంచుకున్నాయని తేలింది. కానీ 60శాతానికి పైగా ప్రజలు ఈ రంగంపై ఆధారపడ్డారు.

భారత ఆర్ధికవ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న సేవారంగం 54.3శాతం, పారిశ్రామిక రంగం 29.6శాతం భాగస్వామ్యాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ రెండు రంగాలు అతి కొద్దిమందితో నడుస్తూ, మూడింట రెండువంతుల జీడీపీని అందిస్తున్నాయి.

సాంకేతికతను పెంచడం, మెరుగైన సాగునీటి పద్దతులు అవలంబించడం వల్ల దిగుబడులను పెంచడానికి అవకాశం ఉంటుంది. తక్కువ భూమిలో ఎక్కువ పంటను తీయడంవల్ల శ్రామికుల అవసరం తగ్గుతుంది.

అందుకే రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం సంస్కరణల దిశగా దృష్టిసారించాల్సి అవసరం ఉందని డాక్టర్‌ లాల్‌ సూచిస్తున్నారు. ఇందులో భాగంగా వారు ప్రత్యామ్నాయ పంటలవైపు వెళ్లినప్పుడు,లేదంటే పరిశ్రమలు, సేవారంగాలలో వారు ఉపాధి పొందేలా వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని డాక్టర్‌ లాల్‌ సూచించారు.

“ఇది ఇప్పటికైనా మొదలు పెట్టకపోతే రాబోయే తరాలకు అన్యాయం చేసిన వారమవుతాం’’ అన్నారు డాక్టర్‌ రతన్‌లాల్‌

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
agricultural yields declining in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X