• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ అభ్యంతరాలను పట్టించుకోకుండా పాకిస్తాన్‌కు అమెరికా ఎందుకు సైనిక సాయం చేస్తోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్‌లోని ఎఫ్-16 యుద్ధ విమానాల నిర్వహణ కోసం ప్రత్యేక పథకానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

భారత్ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఈ విషయంలో అమెరికా ముందుకు వెళ్లింది.

పాకిస్తాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆ దేశంలో ఇప్పటికే ఉన్న ఎఫ్-16 యుద్ధవిమానాల నిర్వహణను అమెరికా కంపెనీలు చేపడతాయి. వాటికి మరమ్మతులు చేయడం, విడిభాగాలను అందించడం వంటి ఇందులో ఉంటాయి.

అయితే యుద్ధవిమానాల్లో కొత్త ఆయుధ వ్యవస్థలను చేర్చడం లేదా కొత్త ఫంక్షన్స్ ఏర్పాటు చేయడం కానీ చేయడం లేదని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోపరేటివ్ ఏజెన్సీ వెల్లడించింది.

టెర్రరిజాన్ని పాకిస్తాన్ సమర్థంగా ఎదుర్కొనేందుకు సహకరించడం మాత్రమే ఆ ఒప్పందం ఉద్దేశమని, కానీ ఆ దేశ సైనిక బలాన్ని పెంచడం కాదని అమెరికా చెబుతోంది.

యుధ్దవిమానం

ఒప్పందంలో ఏముంది?


 • పాకిస్తాన్‌ వద్ద ఉన్న ఎఫ్-16 యుద్ధవిమానాల నిర్వహణ సేవలను అమెరికా అందిస్తుంది
 • యుద్ధవిమానాలకు అవసరమైన హార్డ్‌వేర్‌ను అందించడంతోపాటు సాఫ్ట్‌వేర్‌లోనూ మార్పులు చేస్తారు.
 • ఇంజిన్లకు మరమ్మతు చేయడం, కొత్త విడిభాగాలను బిగిస్తారు.
 • ఇతర అవసరమైన సామాగ్రిని అందిస్తారు.
 • ఈ డీల్ విలువ 450 మిలియన్ డాలర్లు
 • అమెరికాకు చెందిన డిఫెన్స్ కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్ ఈ సేవలు అందిస్తుంది.

వ్యతిరేకించిన భారత్

ఎఫ్-16 యుద్ధవిమానాలకు సంబంధించి పాకిస్తాన్‌తో అమెరికా చేసుకున్న ఒప్పందాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. గతంలో అమెరికా అధికారి 'డోనల్డ్ లు' భారత పర్యటనకు వచ్చినప్పుడు, భారత విదేశాంగశాఖ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిందని 'ది హిందూ' రిపోర్ట్ చేసింది.

'ది హిందూ' కథనం ప్రకారం డోనల్డ్ లు భారత్‌కు వచ్చిన ప్రతిసారీ ఇక్కడి అధికారులు తమ ఆందోళనను తెలియజేశారు. క్వాడ్ ఉన్నతాధికారులను కలిసేందుకు డోనల్డ్ లు భారత్‌కు వస్తూ ఉండేవారు.

ప్రధానంగా పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధవిమానాలకు అమెరికా అందిస్తున్న సాంకేతిక సాయం మీద భారత్ తన ఆందోళన వ్యక్తం చేసింది. టెర్రరిజాన్ని అరికట్టేందుకు ఇది అవసరమని పాకిస్తాన్ అంటూ ఉంటే కాదు తమకు వ్యతిరేకంగా వాటిని వాడుతుందని భారత్ వాదిస్తోంది.

అయితే అమెరికా తీసుకున్న ఆ నిర్ణయం వల్ల రెండు దేశాల సంబంధాల మీద ఎటువంటి ప్రభావం ఉండకపోవచ్చని భారత్ భావిస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. తమ భద్రతకు ప్రమాదం వాటిల్లే ఆ నిర్ణయం తీసుకునే ముందు అమెరికా ఒక్క మాట కూడా చెప్పక పోవడం మీద భారత్ కోపంగా ఉన్నట్లు ఆ కథనంలో రాశారు.

గత నాలుగేళ్లలో అమెరికా, పాకిస్తాన్ మధ్య కుదిరిన అతి ముఖ్యమైన రక్షణ ఒప్పందంగా దీన్ని చూస్తున్నారు.

డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ఉన్నప్పుడు 2018లో పాకిస్తాన్‌కు మంజూరు చేసిన 3 బిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని నిలిపి వేశారు. తాలిబాన్లు, హక్కానీ నెట్ వర్క్ వంటి గ్రూపులను అరికట్టడంలో పాకిస్తాన్ విఫలం కావడమే ఇందుకు కారణమని నాడు ట్రంప్ అన్నారు.

పాకిస్తాన్‌తో పాటు బహ్రెయిన్, బెల్జియం, ఈజిప్ట్, తైవాన్, డెన్మార్క్, నెదర్లాండ్స్, పోలండ్, థాయిలండ్ వంటి దేశాలకు ఎఫ్-16 యుద్ధవిమానాలను అమెరికా విక్రయించింది.

భారత్‌తోనూ అమెరికా రక్షణ సంబంధాలు కొనసాగిస్తోంది. అపాచీ హెలికాప్టర్లు విక్రయించేందుకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

సాధారణంగా భారత్ ఆయుధాలను ఎక్కువగా రష్యా నుంచే కొనుగోలు చేస్తూ ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో అమెరికా వంటి దేశాల నుంచి ఆయుధాలు కొనడం కూడా పెరుగుతోంది.


ఎఫ్-16 చరిత్ర ఏంటి?


 • 1972లో జనరల్ డైనమిక్స్ అనే కంపెనీ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని రూపొందించింది.
 • ఎఫ్-16 పూర్తి పేరు ఫైటింగ్ ఫాల్కాన్
 • ఒకే ఇంజిన్, ఒకే సీటు ఉండే ఈ విమానాలు ధ్వని వేగానికి రెండు రెట్లు అధిక వేగంతో ప్రయాణిస్తాయి.
 • మిసైళ్లు, బాంబులను మోసుకొని పోగలవు.
 • ఆ తరువాత జనరల్ డైనమిక్స్‌ను లాక్‌హీడ్ మార్టిన్ కొనుగోలు చేసింది.
 • తొలి బ్యాచ్ ఎఫ్-16 యుద్ధవిమానాలు 1978లో అమెరికా వైమానిక దళంలో చేరాయి.

భారత్-అమెరికా సంబంధాలు ఎలా ఉండనున్నాయ్?

అమెరికా విదేశాంగ విధానంలో భారత్‌కు కీలక స్థానం ఉంది. జీ-20, క్వాడ్, ఇండోఫసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ వంటి కూటముల్లో రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయి.

ఆసియాలో భారత్, పాకిస్తాన్ మధ్య విభేదాలు అందరికీ తెలిసినవే. కాబట్టి పాకిస్తాన్, అమెరికాల మధ్య రక్షణ ఒప్పందాలను భారత్ కోరుకోదు.

కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని భారత్‌ అంగీకరించాల్సిందేనని విదేశీ వ్యవహారాల నిపుణుడు మనోజ్ జోషి అన్నారు.

'పాకిస్తాన్ ఉన్న ప్రాంతం, స్థితి వల్ల అది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఇటీవల కాలంలో అమెరికా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. కానీ విభేదాలు తొలగిపోతే రెండు దేశాలు కలిసి పని చేస్తాయనే సందేశాన్ని అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఇస్తోంది.

భారత్ వైపు మాత్రమే ఉండి పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ వంటి దేశాలను పక్కన పెట్టాలని అమెరికా అనుకోవడం లేదు. ఇరాన్‌కు దగ్గరగా ఉండే ఈ దేశాలతో సంబంధాలు ఎంత ముఖ్యమో అమెరికాకు తెలుసు.

ప్రస్తుతం అఫ్గానిస్తాన్ తాలిబాన్ల చేతిలో ఉంది. అక్కడి నుంచి అమెరికాను వెళ్లగొట్టారు. కాబట్టి ఇప్పుడు ఆసియాలో అమెరికాకు ఒక స్థావరం కావాలి. అక్కడి నుంచి అఫ్గానిస్తాన్, ఇరాన్ వంటి వాటి మీద నిఘా పెట్టాలి.

యుక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన తరువాత భారత్ తీరుపై అమెరికా అంత సంతోషంగా లేదు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయొద్దని భారత్‌కు అమెరికా చాలా సార్లు చెప్పింది.

భారత్‌లోని తన ప్రయోజనాల దృష్ట్యా అమెరికా ఆచితూచీ వ్యవహరిస్తోంది. అందువల్లే భారత్ తీసుకునే కొన్ని నిర్ణయాలను చూసి చూడనట్లు వదిలేస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్‌తో సంబంధాలు స్థిరంగా ఉంటాయని అమెరికా భావిస్తోంది' అని మనోజ్ జోషి అన్నారు.

పాకిస్తాన్ విషయంలో అమెరికా డిప్లొమాటిక్ గేమ్ ఆడుతోందని రక్షణరంగ నిపుణుడు సుశాంత్ సర్నీ అన్నారు.

'భారత్‌కు మంచి స్నేహితుడినని అమెరికా చెబుతూ ఉంటుంది. కానీ రష్యా-యుక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి భారత్ వైఖరి మీద అమెరికా కోపంగా ఉంది. రష్యాతో భారత్ సంబంధాలు కొనసాగుతూ ఉండటమే అందుకు కారణం.

కాబట్టి భారత్ తనకు ఇష్టం వచ్చినట్లు ఆడుతూ పోతే మేం మా ఆటలో పాకిస్తాన్‌ను తీసుకొస్తామనే సందేశాన్ని అమెరికా ఈ నిర్ణయం ద్వారా ఇస్తోంది' అని సుశాంత్ అభిప్రాయపడ్డారు.


1981లో తొలిసారి పాకిస్తాన్‌కు


 • 9/11 దాడుల తరువాత ఉగ్రవాదం మీద పోరాడేందుకని పాకిస్తాన్‌కు 18 అత్యాధునిక ఎఫ్-16 విమానాలను అమెరికా విక్రయించింది.
 • పాకిస్తాన్‌కు ఎఫ్-16 విమానాలను అమ్మేందుకు 700 మిలియన్ డాలర్ల విలువైన డీల్‌ను 2016లో అమెరికా కుదుర్చుకుంది.
 • 2020 నాటికి పాకిస్తాన్ వద్ద 85 ఎఫ్-16 యుద్ధవిమానాలున్నాయి.

ఎఫ్-16 యుద్ధ విమానం

రఫేల్‌తో పోలిస్తే ఎఫ్-16 ఎంత శక్తిమంతమైనవి?

పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధవిమానాల మరమ్మతుకు అమెరికా అంగీకరించడం వల్ల ఆ దేశ సైనిక బలం పెరుగుతుందా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.

భారత్‌లోనూ అనేక యుద్ధవిమానాలున్నాయి. వాటిలో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన అధునాతన రాఫెల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి.

'ఎఫ్-16 యుద్ధవిమానాలు 3.5 జనరేషన్‌కి చెందినవి. రఫెల్ విమానాలు 4.5 తరానివి. వాటి కంటే కూడా మెరుగైనవి. సుఖోయ్-30, మిరాజ్-2000 కూడా ఎఫ్-16తో పోటీ పడగలవు.

అమెరికా చెప్పినట్లుగా ఎఫ్-16 యుద్ధవిమానాలకు మరమ్మతు చేయడం తప్పితే కొత్తగా ఆయుధాలు ఇవ్వడం ఉండదు. కాబట్టి ఈ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభావం పెరుగుతుందని చెప్పలేం. ఎఫ్-16 యుద్ధవిమానాలను పాకిస్తాన్ ఎప్పటి నుంచో వాడుతోంది' అని రక్షణరంగ నిపుణుడు రాహుల్ బేడీ తెలిపారు.


 • భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సమయంలో 2019 ఫిబ్రవరి 27న పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానం సరిహద్దుల్లో కనిపించింది.
 • నాడు ఇండియా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిగ్-21 పాకిస్తాన్‌కు చెందిన పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చినట్లు ఐఏఎఫ్ తెలిపింది.

అమెరికా, చైనాల మధ్య సంబంధాలు మరింతగా దిగజారుతున్న తరుణంలో అమెరికాకు పాకిస్తాన్ దగ్గర కావాలని చూస్తోందా అనే సందేహం కూడా ఇప్పుడు వస్తోంది.

'అమెరికా నుంచి ఒక చేతితో చైనా నుంచి మరొక చేతితో పాకిస్తాన్ ఆయుధాలు తీసుకుంటుందనేది వాస్తవం. పాకిస్తాన్‌కు అవసరమైన అన్నిరకాల ఆయుధాలను అమెరికా ఇవ్వదు. అందుకే చైనా వైపు పాకిస్తాన్ చూస్తుంది. ఇది అమెరికాకు కూడా తెలుసు. కాకపోతే పాకిస్తాన్ తనకు వ్యతిరేకంగా హద్దులు దాటదనే నమ్మకం అమెరికాకు ఉంది' అని మనోజ్ జోషి తెలిపారు.

అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం వల్ల పాకిస్తాన్‌ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని రాహుల్ బేడీ అన్నారు. 'గత కొంత కాలంగా పాకిస్తాన్‌ను అమెరికా వదలి వేసిందనే భావన ఉండేది. కానీ సమయం వస్తే పాకిస్తాన్‌కు అండగా అమెరికా ఉంటుందనే సందేశాన్ని ఈ నిర్ణయం ఇస్తోంది' అని రాహుల్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why is America providing military aid to Pakistan despite India's objections?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X