టీటీడీకి అరుదైన కానుకలు- ఒక్కోటి 2.25 కిలోలు
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 89,403 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 44,234 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.00 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది.
టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పట్టింది. 2.55 లక్షల మందికి అన్నప్రసాదాలు వడ్డించారు టీటీడీ సిబ్బంది. రికార్డు స్థాయిలో 4.14 లక్షల లడ్డూలు అమ్ముడుపోయాయి. అలాగే.. అనారోగ్యం బారిన పడ్డ 3,631 మంది భక్తులకు టీటీడీ వైద్య సిబ్బంది ట్రీట్ మెంట్ అందించారు. పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో తిరుమలలో మొత్తం 16 వైద్య కేంద్రాలను అందుబాటులో తెచ్చింది టీటీడీ. ఇందులో అశ్వనీ ఆసుపత్రి ప్రధాన ఆసుపత్రి. దీనికి అనుబంధంగా అపోలో హార్ట్ సెంటర్ పనిచేస్తోంది.

కాగా- శ్రీవారికి మంగళవారం అరుదైన కానుకలు అందాయి. చెన్నైకు చెందిన గోపాల కృష్ణ, పురుషోత్తం అనే భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామి వారికి వెండి నక్షత్ర హారతులను విరాళంగా అందించారు. ఒక్కో నక్షత్ర హారతి స్టాండ్ బరువు 2.25 కేజీలు. మొత్తం నాలుగున్నర కేజీల బరువు ఉండే రెండు నక్షత్ర హారతులను టీటీడీకి విరాళంఅందించి, తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో డిప్యూటీ ఈవో లోకనాథంకు వీటిని అందజేశారు.
అదేవిధంగా మంగళవారం మైసూరుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు అయిదు బంగారు పతకాలను విరాళంగా అందించారు. వీటి విలువ 1.10కోట్ల రూపాయలు. ఆయన విజ్ఞప్తి మేరకు టీటీడీ అధికారులు ఆ భక్తుడికి చెందిన వివరాలను బయటపెట్టడానికి నిరాకరించారు. ఈ అయిదు బంగారు పతకాలను చెల్లించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
మరోవంక.. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ అపూర్వ ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి తరఫున తన అన్నగారైన శ్రీ గోవిందరాజస్వామివారికి సుమారు రూ.71 లక్షల విలువైన నాలుగు దివ్య ఆభరణాలను టీటీడీ సమర్పించింది. ఈ దివ్య కానుకల్లో సాధారణ రాళ్లు కలిగిన బంగారు గుండు పతకం, ఒక జత సాధారణ రాళ్లు గల బంగారు పతకాలు, బంగారు కాసుల మాల ఉన్నాయి.
ఈ అమూల్య ఆభరణాలతో అలంకరింపబడిన శ్రీ గోవిందరాజస్వామివారు గరుడవాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఎదురు ఆంజనేయస్వామి ఆలయం నుండి శ్రీవారి ఆభరణాలను మంగళవాయిద్యాలు, వేదఘోషలు, గోవింద నామస్మరణల మధ్య ఘనంగా ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అంతకుముందు తిరుమల నుండి అలిపిరి, కోమలమ్మ సత్రం మీదుగా బంగారు నగలు ఊరేగింపుగా ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకువచ్చారు. ప్రత్యేక పూజలు అనంతరం శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి తీసుకువచ్చి ఆలయ అధికారులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications