విజయ్ సీటులో ఉప ఎన్నిక ఎందుకు జరగలేదు? మరో 4 సీట్లలోనూ..! రీజన్ ఇదే..!
తమిళనాడులోని ఖాళీగా ఉన్న రెండు అసెంబ్లీ స్ధానాలు ధారాపురం, మధురాంతకంలో తాజాగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఈ రెండు సీట్లలోనూ టీవీకే ఘన విజయాలు నమోదు చేసుకుంది. ఈ రెండు గతంలో అన్నాడీఎంకే చేతిలో ఉన్న సీట్లు కాగా.. వీటిలో ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీవీకే చేరారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఈ నేపథ్యంలో వీటి కంటే ముందే సీఎం విజయ్ (CM Vijay) రెండు చోట్ల గెలిచిన తర్వాత ఖాళీ చేసిన తిరుచిరాపల్లి ఈస్ట్ స్ధానంలో ఉప ఎన్నికలు ఎందుకు జరగలేదనే చర్చ జరుగుతోంది. దీని వెనుక ఓ కీలక కారణం ఉంది.
ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాల్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో ఐదు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అవి కరూర్, విరాలిమలై, పెరుందరై, అంబాసముద్రం, తిరుచిరాపల్లి తూర్పు. ఈ సీట్లలో తిరుచిరాపల్లి ఈస్ట్ తో పాటు పెరంబూర్ లోనూ గెలిచిన విజయ్.. ఆ తర్వాత తిరుచ్చి ఈస్ట్ ను వదులుకున్నారు. దీంతో ఈ సీట్లో ఉపఎన్నిక జరగాల్సి ఉంది. కానీ ఆయా సీట్లలో ఉప ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్దం కాగానే.. గతంలో ఆయా సీట్లలో ఓడిన టీవీకే ప్రత్యర్థులు మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ల వ్యవహారం తెరపైకి వచ్చింది.

దీంతో ఈ న్యాయ వివాదాలు తేలేవరకూ ఉప ఎన్నికల నిర్వహణకు ఈసీ కూడా సిద్దం కాలేదు. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా ఈ ఐదు సీట్లలో ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించకుండా గతంలో స్టే ఇచ్చింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి కాకపోవడంతో ఈ ఐదు సీట్లలో ఉపఎన్నికలు జరగడం లేదు. కానీ ఆయా స్ధానాల్లో ఫలితాలపై దాఖలైన పిటిషన్లపై త్వరగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టును టీవీకే కోరుతోంది. కానీ విచారణ మాత్రం ఆలస్యమవుతూనే ఉంది. దీంతో ఎన్నికల సంఘం కూడా చేసేది లేక వివాదాలు లేని మధురాంతకం, ధారాపురం సీట్లలో ఉపఎన్నికలు నిర్వహించి ఇవాళ ఫలితాలు కూడా విడుదల చేసింది. అయితే ఎన్నికల వివాదాలు తేలకుండా మిగిలిన ఐదు సీట్లలో ఉపఎన్నికలు నిర్వహించే, అందులో గెలిచే అభ్యర్ధుల విజయాలు వివాదాస్పదం అయ్యే అవకాశం ఉండటంతో ఆయా చోట్ల ఎన్నికలు జరగడం లేదు.














Click it and Unblock the Notifications
